రాష్ట్రీయం

విద్యుత్‌పై వెనకడుగు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: వ్యవసాయ రంగానికి 2018 జనవరి 1 నుండి 24 గంటలు విద్యుత్ అందిస్తామని సీఎం చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. విద్యుత్‌శాఖ అధికారులతో ప్రగతిభవన్‌లో శనివారం సాగుకు ఉచిత విద్యుత్ ప్రణాళికపై సమీక్ష జరిపారు. కేవలం రైతుల బావులకు మాత్రమే కాకుండా, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పథకాలకూ నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. ఇవికాకుండా అనధికార పంప్‌సెట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. యాసంగిలో పంటలకు నీటిని రోజూ అందించాల్సిన అవసరం ఉంటుందని, ఈ విషయాన్ని విద్యుత్ అధికారులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సాధారణ బావులు, బోర్‌బావుల కనెక్షన్లతో పాటు భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులకూ విద్యుత్ ఇవ్వాల్సి ఉందని కెసిఆర్ గుర్తు చేశారు. గోదావరి నదిపై కొత్త ఎత్తిపోతల పథకాలు వస్తున్నాయని, కాళేశ్వరం, సీతారామ, దేవాదుల తదితర భారీ ఎత్తిపోతల పథకాలతోపాటు గూడెం, శ్రీపాద, ఎల్లంపల్లి తదితర చిన్న ఎత్తిపోతల పథకాలూ ఉన్నాయని గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేసిన 1300 పంప్‌సెట్లకూ అవసరమైన విద్యుత్తును 24 గంటలపాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ పథకాలకు కలిపి 10 వేల నుండి 12 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరమని పేర్కొంటూ, ఇందుకు తగ్గట్టు విద్యుత్‌ను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు.
విద్యుత్ సరఫరాను ఐదు భాగాలుగా విభజించుకోవాలని కేసీఆర్ సూచించారు. వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు- మిషన్ భగీరథ, వాణిజ్యం, పరిశ్రమలు, గృహవినియోగం ప్రధానమైనవని తెలిపారు. ఈ ఐదు రంగాలను వేర్వేరుగా పరిగణించి ఏ రంగానికి ఎంత విద్యుత్తు అవసరమో గుర్తించాలన్నారు. అన్ని రంగాల్లోనూ విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తోందని, భవిష్యత్తు
అవసరాలకు అనుగుణంగా విద్యుదుత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవసాయ రంగానికి ఎక్కువ విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం మంచిది కాదని కొంతమంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ అభిప్రాయంతో తాను ఏకీభవించలేదని, అందుకే విద్యుత్తు సబ్సిడీని 4,777 కోట్ల నుండి 5,400 కోట్లకు పెంచామన్నారు. అవసరమైతే మరో 500 కోట్లు ఇచ్చేందుకూ వెనుకడుగు వేసే ప్రసక్తిలేదన్నారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు దాదాపు 10 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశామని, ఈ భారాన్ని కూడా తామే (ప్రభుత్వం) భరిస్తామన్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీల వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని, ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు లభిస్తాయని, అలాగే రైతులు ఆర్థికంగా బాగుపడతారని వివరించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్తు సరఫరా చేయడం వల్ల రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతుందని గుర్తు చేశారు.
జిల్లాల వారీగా ప్రస్తుతం విద్యుత్ డిమాండ్-సరఫరా, భవిష్యత్తు అవసరాలపై సంబంధిత అధికారులతో కెసిఆర్ నేరుగా మాట్లాడారు. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయినా, వెంటనే మరమ్మతు చేసేందుకు లేదా 24 గంటల్లో మార్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడం పాటు అన్ని వర్గాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను విద్యుత్ సంస్థలు అందించడం పట్ల కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పనితీరువల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచిపేరు వచ్చిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కెసిఆర్ కోరారు. విద్యుత్తు ఉద్యోగులను మనసారా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. విద్యుత్తు ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రమోషన్లు, ఇతర అంశాల్లో ఉదారంగా వ్యవహరిస్తుందని కెసిఆర్ హామీ ఇచ్చారు.
నిరంతరం పనిచేస్తున్నాం: సిఎండి
విద్యుత్తు శాఖాధికారులు కంటికి కునుకు లేకుండా నిరంతరం పనిచేస్తున్నారని జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. విద్యుత్ శాఖకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు అవుతున్నందుకు విద్యుత్ శాఖ సిబ్బంది యావత్తు ఆనందంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోవడం 30 శాతం నుండి నాలుగు శాతానికి తగ్గిందని, విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టం 18 శాతం నుండి 16 శాతానికి తగ్గిందని ప్రభాకర్‌రావు గుర్తు చేశారు. విద్యుత్ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య బాగా పెంచామన్నారు.

చిత్రం..ప్రగతి భవన్‌లో విద్యుత్‌పై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్