రాష్ట్రీయం

చేనేతకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 18: చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతోందని పరిశ్రమలు, ఐటి, చేనేత శాఖల మంత్రి కె తారకరామారావు స్పష్టం చేశారు. చేనేత కార్మికుల మార్కెటింగ్ భద్రతకు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చేనేతమిత్ర పథకాన్ని మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద నేత కార్మికులకు అవసరమైన నూలు, కెమికల్స్, డై తదితర సామాగ్రిని 50శాతం సబ్సిడీతో సరఫరా చేస్తారు. సబ్సిడీ మొత్తంలో 10శాతం కేంద్రం భరిస్తుండగా, మిగతా 40 శాతం ప్రభుత్వం భరిస్తుంది. పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతు గత ప్రభుత్వాల హయాంలో చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారన్నారు. ఫలితంగా ఉపాధిలేక చేనేత కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసలు పోతే, కొందరు ఆకలిచావులకు గురయ్యారన్నారు. ఉద్యమ సమయంలోనే చేనేత కార్మికుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని అప్పటి సిఎంలను కోరినా పట్టించుకోలేదని, దాంతో పార్టీతరఫున 50లక్షలు చేనేత రంగానికి చెందిన పెద్దలకు ఇచ్చి కార్మిక సంక్షేమానికి ఖర్చు చేయాలని కోరామన్నారు. చేనేత రంగంపైన, చేనేత కార్మికులపై సమగ్ర అవగాహన ఉన్న సిఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత రంగం బడ్జెట్‌ను 1283 కోట్లమేర పెంచారన్నారు. చేనేత కార్మికులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే చర్యలో భాగంగా విద్యాశాఖకు చెందిన అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో అవసరమైన యూనిఫాంలకు చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు, కెసిఆర్ కిట్లలో తల్లులకు ఇచ్చే చీరలకు, బతుకమ్మ చీరెల కిందట చేనేత వస్త్రాలనే కొనుగోలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వాలు ఏ ప్రోత్సాహకాలు ఇచ్చినా అవి సహకార సంఘాలకు, వాటిని నడిపే పెద్దలకు మాత్రమే దక్కేవని, దీనిని దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం రాయితీలు, సబ్సిడీలు, రుణమాఫీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేనేత కార్మికులకే దక్కేలా చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న చేనేత, పవర్‌లూం కార్మిక కుటుంబాల రుణాల మాఫీకి చర్యలు తీసుకున్నామన్నారు. లక్ష రూపాయల లోపు ఉన్న పాత రుణాల మాఫీ, తాజాగా ముడిసరుకులపై 50శాతం సబ్సిడీ, మార్కెటింగ్ భద్రత, వృద్ధ చేనేత కార్మికులకు పెన్షన్‌ల ద్వారా చేనేత కార్మికులకు విశ్వాసం కలిగిస్తున్నామన్నారు. నేతన్నకు చేయూత కార్యక్రమం కింద చేనేత కార్మికులు ఒకవంతు మొత్తాన్ని చెల్లిస్తే రెండువంతుల డబ్బును ప్రభుత్వం చెల్లించి నిర్ణీత గడువు దాటాక ఆర్థిక ప్రయోజనం పొందేలా చూస్తున్నామని వివరించారు. చేనేత రంగానికి వెన్నుదన్నుగా నిలవాలనే ప్రయత్నంలో భాగంగా వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ద్వారా వలసవెళ్లిన చేనేత కార్మికులను వెనక్కి రప్పిస్తామని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా నిలవాలనే ప్రయత్నంలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని విద్యశాఖ, అన్ని సంక్షేమ శాఖల పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు 100కోట్ల రూపాయలు విలువచేసే చేనేత దుస్తులు కొనుగోలు చేశామని తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఆరూరి రమేష్, నగర మేయర్ నరేందర్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..హన్మకొండ బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్