రాష్ట్రీయం

న్యాయం చేస్తాం.. నమ్మండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 30: రాజధాని నిర్మాణాలకు భూములిచ్చిన రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి నారాయణ రైతులకు హామీ ఇచ్చారు. శనివారం తుళ్లూరు మండలంలోని కేంద్ర రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలలో మం త్రులు, పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీ్ధర్ తదితరులు రైతుల వద్ద నుంచి మాస్టర్‌ప్లాన్‌పై అభిప్రాయాలు సేకరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటుందన్నారు. ఫిబ్రవరి 3న సింగపూర్ బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించే అవకాశం ఉందన్నారు. రానున్న రెండు రోజుల్లో అసైన్డ్, లంక భూములకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. రాజధాని గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని, అలాగే భూములిచ్చిన రైతులకు కౌలుపరిహారాలు చెల్లించేందుకు 3.50 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నందున మీరంతా సహకరించాలని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ కోరారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రైతులు ఆందోళన చెందుతున్న అంశాలపై నిర్మొహమాటంగా మంత్రుల ముందు ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులను చూసి భూములివ్వలేదనే విషయం గుర్తించాలన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోని పక్షంలో ఊరుకునేది లేదన్నారు. రైతులను ఆందోళనకు గురి చేసే విధంగా రోజుకొక ప్రకటన చేస్తూ సిఆర్‌డిఎ అధికారులు వ్యవహరించటం సమంజసంగా లేదన్నారు. సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ రైతులకు సమాధానం చెప్పటంలో సక్రమంగా వ్యవహరించటం లేదని, అందువల్ల గుంటూరు జెసి చెరుకూరి శ్రీ్ధర్‌కు బాధ్యతలు అప్పగించాలని రైతు నాయకులు కోరారు. గత 3 నెలల కాలంలో మంత్రులు ఒక్కసారి కూడా గ్రామాల్లో పర్యటించక పోవటానికిగల కారణాలు అడిగారు.

ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలి

రోహిత్ ఆత్మహత్యపై రఘువీరా డిమాండ్

మడకశిర, జనవరి 30: మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేకు ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు ఉన్నాయని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే బిజెపి, ఎబివిపి, విశ్వహిందూ పరిషత్ అని అన్నారు. అనంతపురం జిల్లా మడకశిరలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో గాంధీ, గాడ్సే వారసుల మధ్య సైద్దాంతిక యుద్ధం జరుగుతోందన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిశోధన విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రులు, యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌ను బర్తరఫ్ చేయాలని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. బడుగువర్గాలు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం లేకుండా పాలకులు అడ్డుకుంటున్నారన్నారు. మెరిట్‌తో సీటు సాధించిన రోహిత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎబివిపి, విశ్వహిందూ పరిషత్ నాయకులు అతనిపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించి ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారని ధ్వజమెత్తారు. ఇందులో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, విసి ప్రమేయం ఉందన్నారు. వీరి బండారం బయటపడుతుందనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉంటుందన్నారు. అందులో భాగంగానే రాహుల్‌గాంధీ రోహిత్ జయంతికి హాజరయ్యారన్నారు. రోహిత్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేంత వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు.

తల్లీబిడ్డల దారుణహత్య
గోరంట్ల, జనవరి 30: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కరావులపల్లిలో తల్లీబిడ్డలను కొట్టి చంపిన సంఘటన శనివారం జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్‌నాయక్ తన తమ్ముడి భార్య లక్ష్మీబాయి, ఆమె పిల్లలు చంద్రిక(1), యుమనాబాయి(6)ని రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మూగవాడైన తమ్ముడిని లెక్కచేయకుండా మరదలు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం జీర్ణించుకోలేని శివశంకర్‌నాయక్ మట్టుబెట్డాడు.

సిఆర్‌డిఎ అదనపు
కమిషనర్‌గా చెరుకూరి శ్రీ్ధర్?

గుంటూరు, జనవరి 30: గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్‌ను సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా నియమించాలంటూ లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం రైతులు డిమాండ్ చేశారు. శనివారం కేంద్ర రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెంలలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ పర్యటించిన సమయంలో రైతులు ప్రస్తుతం సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా ఉన్న ప్రసన్న వెంకటేష్ పని విధానం నచ్చలేదంటూ ఆందోళనకు దిగారు. ఇటీవల తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయంలో రైతు కమిటీతో కమిషనర్ శ్రీకాంత్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడిన సమయంలో కూడా రైతులు గ్రామకంఠాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ రూపొందించిన జాబితాను విడుదల చేయాలనే డిమాండ్ వచ్చింది. రెండు గ్రామాలకు చెందిన రైతులు గ్రామకంఠాలకు సంబంధించి జాయింట్ కలెక్టరు తయారు చేసిన జాబితాను ఎప్పుడు విడుదల చేస్తారంటూ ప్రశ్నించటమే కాకుండా సిఆర్‌డిఎ అదనపు కమిషనర్‌గా చెరుకూరి శ్రీ్ధర్‌ను నియమించాలంటూ రైతులు ముక్తకంఠంతో కోరారు. మంత్రులు ఇద్దరూ సుముఖత వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతమైన 29 గ్రామాల్లో ప్రజలతో మమేకమై గ్రామకంఠాలను గుర్తించటంలో జెసి చొరవ చూపారు.

రూ.50కోట్లతో దుర్గగుడి అభివృద్ధి

విజయవాడ (ఇంద్రకీలాద్రి) జనవరి 30: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ జగన్మాత కనకదుర్గమ్మ సన్నిధిని సుమారు రూ.50కోట్ల అంచనాలతో మాస్టర్‌ప్లాన్ వేయించి రెండు నెలల వ్యవధిలో పనులను ప్రారంభించటానికి ఇవో సిహెచ్ నరసింగరావు శ్రీకారం చుట్టారు. ఈ మాస్టర్‌ప్లాన్ ప్రకారం అమ్మవారి సన్నిధిలో చరిత్ర, ఆభరణాల ప్రదర్శనశాల, మాడవీధులు, అంతరాలయం, ఉపాలయాలు, పోటుశాల మాత్రమే కొండపై ఉండి మిగతా పరిపాలనా సంబంధమైన అన్ని కార్యాలయాలు కొండ కిందకు తెచ్చేందుకు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్లాన్‌లో రూపొందించినట్లు తెలిసింది.
సాధ్యమైన వరకు ఆలయ చరిత్ర, అభరణాల ప్రదర్శశాల రెండింటినీ కలిపి ఒకచోట ప్రత్యేకంగా కొండపైనే ఏర్పాటు చేసేందుకు వీలుగా రెండు, మూడు స్థలాలను ఇప్పటికే ఇవో నరసింగరావు పరిశీలించారు. తిరుమల - తిరుపతి దేవస్థానం తరహాలో అమ్మవారి ఉత్సవాలను జరిగే సమయంలో మాడవీధుల్లోనే ఉత్సవమూర్తులను ఊరేగించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. నూతన రాజధాని నిర్మాణం కూడా కూతవేటులో జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి సన్నిధికి నిత్యం భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం, ఆదివారం, ముఖ్యమైన పర్వదినాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతోపాటు ఇంద్రకీలాద్రిని స్థలం సమస్య పీడిస్తోంది. ఇప్పటికే సుమారు 7 అంతస్తుల శ్రీమల్లిఖార్జున మహామంటపాన్ని సైతం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ నిర్మాణాన్ని భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చే అంశాన్ని సైతం ఈ మాస్టర్‌ప్లాన్‌లో రూపొందించినట్లు సమాచారం. మల్లిఖార్జున మహామంటపం విషయంలో ముందుగా ఇక్కడ స్థల సేకరణ అవసరం ఉంది. దుర్గగుడిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయటానికి మాస్టర్‌ప్లాన్ ఒకటే శరణ్యమని ఇవో నరసింగరావు భావించి ఈ అంశాన్ని దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన కూడా సానుకూలంగా స్పందించి చర్యలు చేపట్టినట్లు సమాచారం.

కూచిపూడికి పూర్వవైభవం
కూచిపూడి, జనవరి 30: మరుగున పడిపోతున్న కూచిపూడి యక్షగానాలు, కలాపాలు, నృత్య నాటికలకు పూర్వవైభవాన్ని కల్పించేందుకు నాట్యారామ కమిటీ ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ పర్యవేక్షణలో కేంద్ర సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర పర్యాటక శాఖ, భాషా, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కూచిపూడిలో కూచిపూడి యక్షగాన నాట్య మహోత్సవాలు వారంరోజులు నిర్వహిస్తున్నట్లు విజయవాడ సబ్ కలెక్టర్, జిల్లా పర్యాటక శాఖాధికారిణి డా. జి సృజన, కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. కూచిపూడి శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో శనివారం నాట్యోత్సవాలను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.నర్తనం ఎడిటర్ మాధవీ పురాణం మాట్లాడుతూ మధ్యప్రదేశ్ ఖజురహోలోని ఠాగూర్ ఇంటర్నేషనల్ అకాడమీలో కూచిపూడి నాట్య యక్షగానాలు, నృత్యనాటకాలు, కలాపాలు చోటుచేసుకోకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. ఇందువల్ల యునెస్కో సాంస్కృతిక శాఖలో కూచిపూడి నాట్యానికి చోటుదక్కలేదన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు.

పథకాలన్నీ పచ్చచొక్కాలకే

పేదల్ని నట్టేట ముంచిన బాబు * వైకాపా అధినేత జగన్ విసుర్లు

ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 30: చంద్రబాబు అబద్దాలకోరు ముఖ్యమంత్రి అని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన కడప జిల్లా వేముల, వేంపల్లె మండలాల్లో పర్యటించారు. గిడ్డంగివారిపల్లె వద్ద మహిళలు జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పంట రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ జరగలేదని జగన్ వద్ద వాపోయారు. వేలిముద్రలు సరిపోవడం లేదని రేషన్ సరుకులు ఇవ్వడం లేదన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ రాష్ట్రంలో మోసపూరిత ప్రభుత్వం ఉందన్నారు. అబద్దాలకోరు ముఖ్యమంత్రిగా ఉన్నారని, బాబును నమ్ముకుని జనం నట్టేట మునిగారన్నారు. పంట రుణాలమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం పేరిట బాబు ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. మరో మూడేళ్లు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందాన్ని చూసే విధంగా పాలన అందిస్తానని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ పచ్చచొక్కాలవారికే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. అధికారం చేపట్టి 18 నెలలైనా కాకముందే ప్రభుత్వం అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిందన్నారు. బాబు ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తూ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించే ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాధించవన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం తప్పక వస్తుందని , రాజన్న పాలన చూస్తారని అన్నారు. వైకాపా కార్యకర్తలు, నేతలు ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.