రాష్ట్రీయం

సారీ.. పవర్ కట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 19: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఆర్థిక పరిపుష్టిని కోల్పోతున్నాయి. సర్పంచ్‌లకు అధికారాల బదలాయింపు అందని ద్రాక్షగా మారుతోంది. అన్నింటికీ మించి విద్యుత్ బకాయిలపై సర్కార్ నోరు మెదపకపోవటంతో వందలాది గ్రామాల్లో వీధిదీపాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సచివాలయానికి ఒక విడత బిల్లు రూ. 3కోట్లు చెల్లించిన ప్రభుత్వం పంచాయతీల బిల్లుల చెల్లింపులో వౌనం వహించటాన్ని అధికార పార్టీ సర్పంచ్‌లు సైతం ఆక్షేపిస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా ఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో గ్రామ పంచాయతీలకు 1001 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఈపీడీసీఎల్ పరిధిలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో కలుపుకుని మరో రూ. 350కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో పలు గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 200కు పైగా గ్రామాల్లో వీధిదీపాలు వెలగటంలేదు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని 8 జిల్లాల్లో పంచాయతీలు చెల్లించాల్సిన బకాయిల వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో మేజర్, మైనర్ పంచాయతీల్లో వీధిదీపాలు, వాటర్ వర్క్స్, కార్యాలయ భవనాల సర్వీస్ కనెక్షన్లకు 146.79 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 82.51 కోట్లు, ప్రకాశం జిల్లాలో 68.97 కోట్లు, నెల్లూరు జిల్లాలో 83.11 కోట్లు, చిత్తూరు జిల్లాలో 204.83 కోట్లు, కడపలో 115.62 కోట్లు, కర్నూలు జిల్లాలో 160.87, అనంతపురంలో గ్రామ పంచాయతీలు 168.57 వెరసి 8 జిల్లాల్లో 1031.27 కోట్ల మేర ఎస్పీడీసీఎల్‌కు బకాయిలు చెల్లించాల్సి ఉంది. గ్రామాల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటు, సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపడితే పంచాయతీలకు పన్ను చెల్లించాల్సి ఉందని సర్పంచ్‌లు వాదిస్తున్నారు. అయితే ఎస్పీడీసీఎల్ అధికారులు గత కొద్దిరోజులుగా గ్రామ పంచాయతీల విద్యుత్ సర్వీసులకు సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్ బకాయిల విషయమై మినహాయింపు ఇవ్వాలని గతంలోనే సర్పంచ్‌లు ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈనేపథ్యంలో అప్పట్లో విద్యుత్ శాఖ సీఎండీతో సీఎం సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రూ. 500కోట్ల మేర బకాయిల్లో వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ఎలాంటి ఉత్తర్వులూ జారీ కాకపోవటంతో ఎస్పీడీసీఎల్ అధికారులు సరఫరా నిలిపివేస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసం వుంటున్న ఉండవల్లి పంచాయతీకి రూ. 60లక్షల మేర విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నివాసం కరకట్ట పొడవునా అడుగడుగునా వీధిదీపాలు వెలుగుతున్నాయి. సచివాలయానికి వెళ్లే రహదారిలో కూడా ఇవి ఏర్పాటయ్యాయి. దీంతోపాటు రాజధాని పనులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి విద్యుత్ కనెక్షన్లు మంజూరయ్యాయి. దీంతో ఉండవల్లి పంచాయతీపై నెలకు లక్షన్నర వరకు అదనపు భారం పడుతోందని చెపుతున్నారు. కరకట్ట, ఇసుక రేవుల సీనరేజి నిధులు కూడా నిలిపివేయటంతో పంచాయతీకి ఆదాయం తగ్గింది.. ఖర్చులు పెరిగాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా విడుదల కాకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్టవ్య్రాప్తంగా 12 వేల 920 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల కాకపోవటం పట్ల సర్పంచ్‌లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే 29 అధికారాలను స్థానిక సంస్థలకు బదాలాయించాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పటి నుంచి నామమాత్రంగా 9 అంశాలనే ప్రభుత్వం పరిష్కరించిందని, మిగిలిన 20 అంశాలపై వౌనం వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు సర్పంచ్‌లకు గౌరవ వేతనం కూడా అందటం లేదు. విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించటంతో పాటు ఆర్థిక సంఘం నిధులు, అధికారాల బదలాయింపుతో పంచాయతీలను పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే విషయం స్పష్టమవుతోంది.