రాష్ట్రీయం

పల్లెల్లో.. స్వరాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో ఆవిష్కరించబోతోంది. గ్రామ పంచాయతీ వ్యవస్థ రూపు రేఖలు మారనున్నాయి. వచ్చే నెలలో అసెంబ్లీ శీతాకాల రెండో విడత సమావేశాల్లో పంచాయతీ చట్టం ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా 10వేలకు పైగా గ్రామ పంచాయితీలు, 583 మండలాల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన దాని ప్రకారం కొత్తగా మరో మూడునుంచి నాలుగు వేల వరకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 13నుంచి 14 వేలకు చేరనుంది. గ్రామ పంచాయతీలకు విధులు, బాధ్యతలు అప్పగించారు కాని, నిధుల లేమితో సతమతమవుతున్నాయి. వచ్చే బడ్జెట్లో నేరుగా గ్రామ పంచాయతీలకు జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలని గ్రామ పంచాయతీ చట్టం రూపొందిస్తున్న కమిటీ సిఫార్సు చేయనుంది. కొత్త చట్టం అమలులోకి వస్తే గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నిధులు అందుతాయ. దీనికితోడు కేంద్ర నిధులు, కార్పొరేట్ జవాబుదారీతనం కింద లభ్యమయ్యే నిధులు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిదులు, నేరుగా సమకూరే నిధులను జమచేసి గ్రామ పంచాయతీలకు మంజూరు చేస్తారు. విధుల నిర్వహణలో వైఫల్యం చెందితే సంబంధించిన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోనున్నారు. ప్రస్తుతం గ్రామ సభలు తూతూమంత్రంగా నడుస్తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ గ్రామసభలకు విశేష ప్రాధాన్యతను ప్రతిపాదిత చట్టంలో ఇవ్వనుంది. గ్రామసభల్లో చేసిన తీర్మానాలకు ప్రాధాన్యత ఉంటుంది. తీర్మానాలను పంచాయతీ రిజిస్టర్లలో నమోదు చేస్తారు. వార్డుస్థాయ గ్రామసభలను కూడా ఏర్పాటు చేసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. విలేజి ఆడిట్, టెండర్ల వ్యవస్ధ, భవనాలకు అనుమతుల విషయంలోనూ భారీ మార్పులు తేనున్నారు. కొత్త చట్టంలో గ్రామ పంచాయతీలకు స్పష్టమైన మారదర్శకాలు, విధులు, అధికారాలు, జవాబుదారీతనం, నిధుల కేటాయింపు, ఖర్చు విధానం అంశాలను చేర్చనున్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ కింద గ్రామ పంచాయతీలకు అధికారాలున్నా, జవాబుదారీతనాన్ని పొందుపరచలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్‌గా చెక్‌పవర్‌ను ఇస్తూ ఇప్పటికే చట్టానికి సవరణ చేశారు. గ్రామ పంచాయతీలకు విడుదలయ్యే నిధుల ఖర్చులో సర్పంచ్‌తో పాటు కార్యదర్శిని బాధ్యులను చేస్తారు. పంచాయతీ కార్యదర్శులు చెక్‌పై కౌంటర్ సంతకం చేయాల్సి ఉంటుంది. కొత్త పంచాయతీ చట్టంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో స్థానిక సంస్థల్లో ఆచరిస్తున్న ఉత్తమ విధానాలను కూడా చేర్చాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారు. గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు రెండు మూడు జిల్లాలకో అంబుడ్స్‌మెన్‌ను కూడా నియమించనున్నారు. మన దేశంలో కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్‌లో గ్రామపంచాయతీల్లో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నట్లు ఎన్‌ఐఆర్‌డి సర్వేలో వెల్లడైంది. ఈ విధానాలనూ ఉన్నతాధికారుల కమిటీ అధ్యయనం చేస్తోంది. అంబుడ్స్‌మెన్‌గా నియమితులయ్యే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలని, విశ్రాంత న్యాయాధికారిని, సమాజంలో మంచిపేరున్న వ్యక్తిని నియమించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానాన్నీ కమిటీ అధ్యయనం చేస్తోంది. అంబుడ్స్‌మెన్ వ్యవస్థను స్వయంప్రతిపత్తి ఉన్న కమిటీగా భావించవచ్చు. వచ్చే ఏడాది రాష్ట్రంలో పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా కొత్త చట్టం ప్రకారం సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఐదు వందల జనాభాకు పైగా ఉన్న ఆవాస ప్రాంతాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది.