రాష్ట్రీయం

దూషిస్తే.. దండించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 21: రాష్ట్రంలోనే అత్యున్నత విలువలు కలిగిన శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరిస్తున్న వారిపై ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు నెంబర్ వన్ క్రిమినల్ అంటూ అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్ర అసెంబ్లీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. స్పీకర్‌పై దిగజారి మాట్లాడటం అసెంబ్లీని అగౌరవపర్చడమేనని అభిప్రాయపడ్డారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాల్సిందేనంటూ సభ్యులు ఏకగ్రీంగా తీర్మాం చేసి ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. ఏపీ అసెంబ్లీ తాజా సమావేశాల్లో భాగంగా మంగళవారం టీ విరామం అనంతరం జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రత్యేక తీర్మానాన్ని చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో అనూహ్య అభివృద్ధి చేసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్సు, వరల్ట్ బుక్ ఆఫ్ రికార్డ్సులో సత్తెనపల్లిని నిలబెట్టిన వ్యక్తిపై అసభ్యంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు. స్పీకర్‌పై వ్యాఖ్యలు చేయడమంటే శాసన సభపై వ్యాఖ్యలు చేయడమేనని అంటూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాంబాబుపై కఠినమైన చర్యలు తీసుకునేలా ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను అలంకరించడమే కాకుండా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మార్గదర్శకునిగా నిలిచిన వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించడం తగదన్నారు. అవగాహన లేని ప్రతిపక్షనేత ఉండటంతోనే ఇటువంటి
పరిస్థితులు వస్తున్నాయన్నారు. సిబిఐ ద్వారా క్లీన్ చిట్ పొందిన వ్యక్తిని సిబిఐ కేసులో ఉన్న వ్యక్తి విమర్శించడం దారుణమన్నారు. రాజకీయంగా పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. బిజెపి శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విజ్ఞత కలిగిన వ్యక్తులెవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ఈ అంశాన్ని అంత తేలిగ్గాతీసుకోవద్దన్నారు. ఇప్పుడు చర్యలు తీసుకోకుంటే మునుముందు మరికొందరికి అలవాటుగా మారుతుందన్నారు. స్పీకర్ స్థాయిని దిగజార్చి మాట్లాడకూడదన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను పెంచే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. రాంబాబు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యను బిజెపి తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. చట్టసభలపై గౌరవం లేని వారిని ప్రజలు క్షమించరన్నారు. మరో ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి బాధలో ఉన్న ప్రజలను మరింత బాధపెట్టేలా రాంబాబు వ్యాఖ్యలున్నాయన్నారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం ఇతరులను నొప్పించేందుకు కాదని, రాంబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి, శాసన సభ విలువలు తెలిసిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. శాసన సభ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం దారుణమన్నారు. మహిళాసాధికారత కోసం సదస్సును నిర్వహించి ప్రత్యేక డిక్లరేషన్ తీసుకు వచ్చిన వ్యక్తిపై ఇటువంటి వ్యాఖ్యలు తగదన్నారు. మహిళలకు మనోధైర్యం కల్పించిన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ రాజకీయంగా విమర్శించాల్సి వస్తే ప్రజలు హర్షించే విధంగా ఉండాలేగానీ, ప్రజలు కూడా ఆక్షేపించేలా ఉండకూడదన్నారు. రాంబాబు వ్యాఖ్యలతో ఆయన స్థాయి మరింత దిగజారిందన్నారు. స్పీకర్‌గా తనకున్న విశేషాధికారాలు వినియోగించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చర్చ అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ జీవితంలో రాజకీయాలు ఉన్నతస్థాయికి చేర్చుతాయని, తనపై ఉన్న నమ్మకం, గౌరవంతో స్పీకర్ పదవికి అందరూ ఏకగ్రీంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. సభా ప్రతినిధిగా సభ గౌరవాన్ని కాపాడుతూ సభకు మరింత హుందాతనాన్ని తీసుకు వస్తూ, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న తనపై ఇటువంటి విమర్శలు రావడం ఎంతో బాధించిందన్నారు. స్పీకర్ స్థానాన్ని, స్పీకర్ వ్యవస్థను కించపరిచే విధంగా అవమానకరంగా మాట్లాడటం దారుణమన్నారు. సభానాయకుడు, శాసనసభా వ్యవహారల మంత్రితో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ప్రకటించి చర్చను ముగించారు.

చిత్రం..మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలంటూ తీర్మానం ప్రవేశపెడుతున్న పల్లె రఘునాథరెడ్డి