రాష్ట్రీయం

ఆరునూరైనా ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 22: పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్ర భవిష్యత్ మారిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 56 ఏళ్ల నిర్లక్ష్యం ఫలితంగా రూ. 129 కోట్ల అంచనా కాస్త రూ.58వేల కోట్లకు చేరిందన్నారు. కేంద్రం నుంచి సక్రమంగా నిధులు అందితే త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాస్తామని బుధవారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో పాల్గొన్న చంద్రబాబు ఇప్పటి వరకు జరిగిన పనులు.. నిధుల వివరాలు..కాంట్రాక్టర్ల పనితీరు తదితర అంశాలపై మాట్లాడారు. 1941లో ప్రాజెక్టు నిర్మాణానికి మద్రాస్ ప్రెసిడెన్సీలోనే రూ. 129 కోట్లతో అంచనా రూపొందించారన్నారు. అనంతరం 1985లో గోదావరి ట్రిబ్యునల్ కూడా అనుమతి మంజూరు చేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కమీషన్ల కక్కుర్తితో 2011లో ప్రీక్లోజర్‌చేసి 2013లో మరోసారి టెండర్లు పిలవటంతో పాటు ఒప్పందాలను రద్దు చేసుకున్నారన్నారు. 2014లో టీడీపి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రాజెక్టులపై శే్వతపత్రం ప్రకటించి పోలవరం ఓ మహాయజ్ఞంగా చేపట్టామన్నారు. దీనివల్ల 7.25 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి తీసుకురావటంతో పాటు 980 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతుందన్నారు. ప్రాజెక్టు ద్వారా వచ్చే 80 టీఎంసీలు కృష్ణా బేసిన్‌కు, 21 టీఎంసిలు కర్నాటక, 14 టీఎంసీలు మహారాష్ట్ర, మరో 23 టీఎంసీలు విశాఖ జిల్లాలో 29 లక్షల మందికి మంచినీటి సదుపాయానికి, ఒడిశా-5 టీఎంసీలు, చత్తీస్‌గఢ్ 1.3 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కుడి కాల్వ ద్వారా 179.87 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టి పట్టిసీమ ద్వారా నీటిని తరలించామన్నారు. దీనివల్ల కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షా 29వేల 259 ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చిందని వివరించారు. ఎడమ కాల్వ 181 కిలోమీటర్ల మేర పూర్తిచేస్తే తూర్పుగోదావరి, విశాఖపట్నంలో మరో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇప్పటి వరకు రైట్ మెయిన్ కెనాల్‌కు రూ. 3వేల 656 కోట్లకు గాను రూ. 2వేల 135 కోట్లు, ఎడమ కాల్వకు రూ. 4960 కోట్లకు రూ. 1471 కోట్లు, హెడ్ వాటర్ వర్క్స్‌కు 11వేల 629 కోట్లకు 960 కోట్లు కేటాయించారని, పునరావాస ప్యాకేజీ, భూ సేకరణకు రూ. 33వేల 858 కోట్లు అవసరం కాగా 2934 కోట్లు మాత్రమే కేంద్రం మంజూరు చేసిందన్నారు. హైడల్ పవర్ ప్రాజెక్టుకు రూ. 4205 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. కేంద్ర నిధులు, అనుమతులలో జాప్యం జరుగుతున్నా పనులు 52 శాతం మేరకు పూర్తి చేయగలిగామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇంకా 60వేల 251 ఎకరాల భూ సేకరణ జరపాలన్నారు. 1,91,259 మందికి పునరావాసంతో పాటు 222 గ్రామాలు, 379 హాబిటేషన్లకు ప్యాకేజీ వర్తింప చేయాల్సి ఉందన్నారు. లక్షలాది మంది గిరిజనులకు పునరావాసం ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టు హెడ్ వర్క్ 71 శాతం పూర్తికాగా, కాంక్రీట్ పనులు 11.43 శాతం, డయాఫ్రం వాల్ 49శాతం, 55 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపనులు జరిగాయన్నారు. రేడియల్ గేట్లు 48 పూర్తయ్యాయని తెలిపారు. రాక్‌ఫిల్ ఎర్త్ పనులు కూడా పూర్తికావచ్చా యని, ఏరియల్ 55లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 72 శాతం, గడ్డర్లు 324, ఎత్తు 1423 మీటర్లకు గాను 628 మేర పనులు జరిగాయన్నారు. రాష్ట్రంలో ఒక పక్క తుపానులు..మరోవైపు అనావృష్టి..కరవు పరిస్థితులను అధిగమించేందుకు పోలవరం ఆవశ్యకతను గుర్తించాం..ప్రాజెక్టు నిర్మాణంలో పైసా అవినీతి జరిగినా ఉపేక్షించేదిలేదని స్పష్టంచేశారు. అధికారంకంటే ప్రాజెక్టు నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణలోని 7 ముంపు మండలాలను ఏపిలో కలపాలని కేంద్రానికి ప్రతిపాదించగా కేంద్రం ఆ అంశంపైనే తొలి ఉత్తర్వులు జారీ చేయటం ఓ శుభ పరిణామమన్నారు. కేంద్రం నుంచి ఎంత తొందరగా డబ్బులొస్తే అంత త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్పిల్‌వే, స్పిల్ చానల్ పనుల్లో జాప్యం కారణంగా ట్రాన్స్‌ట్రాయ్ నుంచి కొన్ని పనులు తొలగించి 60 సీ నిబంధన కింద మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించేలా డిసెంబర్ 10 లోగా టెండర్లు పిలుస్తామన్నారు. ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో పనులు నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. మొబలైజేషన్ అడ్వాన్స్‌గా 90 కోట్లు ఇచ్చామని, భవిష్యత్తు అవసరాలకు రూ. 150 కోట్లు (ఇంప్రెస్ట్) కింద కేటాయిస్తామన్నారు. పనుల్లో జాప్యం జరక్కుండా కాంట్రాక్టు సంస్థలకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో రుణాలు మంజూరు చేయాల్సిందిగా లేఖ రాస్తామన్నారు. నాణ్యతలో రాజీలేదని పేర్కొన్న ఆయన లాభాపేక్ష వద్ద ఈ ప్రాజెక్టును ఓ యజ్ఞంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. అడ్డుపుల్లలు వేయకుండా తోచిన సాయం చేయాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.