రాష్ట్రీయం

వైభవంగా పంచమీ తీర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 23: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పట్టుపుదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం నిర్వహించిన పంచమీ తీర్థం అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయం నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థం మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. పంచమీ తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఖజానాలో ఉన్న అనేకాభరణాలలో బంగారు తులసీపత్ర హారం, పగడాల కాసులు కూర్చిన బంగారు దండను సారెతోపాటు తీసువచ్చి అమ్మవారికి అలంకరించారు. అనంతరం పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 11.48 గంటలకు మకర లగ్నంలో పంచమీతీర్థం (చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తోపాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం వచ్చిన భక్తులతో పుష్కరిణి పూర్తిగా నిండిపోయింది. ఆలస్యంగా వచ్చిన వారంతా రాత్రి వరకు పుష్కరణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ అమ్మవారిని దర్శించుకోవడం గమనార్హం. ఇలా దాదాపు లక్ష మంది వరకు భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించారు. కాగా రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య అమ్మవారి తిరుచ్చి వాహన సేవ వైభవంగా జరిగింది. అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిగింది. ఈకార్యక్రమంలో పెద్దజీయర్, చిన్నజీయర్, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి, తిరుమల జేఈఓలు పోలా భాస్కర్, శ్రీనివాసరాజు దంపతులు, సీవీఎస్వో ఆకె రవికృష్ణ, తిరుపతి ఎస్పీ అభిషేక్ మహంతి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటి ఈఓ మునిరత్నంరెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ కోదండరామారావు, వీజీఓలు అశోక్‌కుమార్ గౌడ్, సదాలక్ష్మి, రవీంద్రారెడ్డి, ఏఈఓ రాధాకృష్ణ, ఏవీఎస్వో పార్థసారథిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య అమ్మవారి ఆలయంలో పుష్పయాగం జరుగనుంది.
చిత్రం..శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా తిరుపతిలోని పద్మసరోవరంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తజనం