రాష్ట్రీయం

విసిగిపోతున్న క్యాడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 24: పార్టీని గాడిలోపెట్టి, 2019 ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగురవేసేందుకు వైసీపీ అధినేత ఓపక్క పాదయాత్ర చేస్తుంటే, మరోపక్క ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి ఎగిరిపోతున్నారు. గడచిన మూడు సంవత్సరాల్లో వైసీపీ నుంచి సుమారు 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా టీడీపీలో చేరిపోతున్నా, ఆత్మరక్షణ కోసం జగన్ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆ వలస ప్రక్రియ అంతటితో ఆగకుండా కార్చిచ్చులా, విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీని దహించేస్తోంది. ఏజెన్సీలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా వలస వెళ్లిపోడానికి ఆ పార్టీ అధిష్ఠానం వైఖరి ఒక కారణమైతే, అధికార పార్టీ ఇచ్చే భారీ ఆఫర్లు కూడా మరొక కారణమని చెప్పచ్చు.
గత ఎన్నికల్లో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకుగాను ఆరింటిని వైసీపీ గెలుచుకుంది. వీటిలో పాలకొండ నియోజకవర్గం నుంచి కళావతి, కురుపాం నుంచి పుష్పశ్రీవాణి, సాలూరు నుంచి రాజన్నదొర, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం నుంచి వంతలపూడి రాజేశ్వరి వైసీపీ తరపున ఎన్నికయ్యారు. ఒక్క పోలవరం నియోజకవర్గాన్ని మాత్రమే టిడిపి దక్కించుకుంది. అలాగే అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని కూడా వైసీపీ చేజిక్కించుకుంది. ఈ నియోజకవర్గం నుంచి కొత్తపల్లి గీత ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం అరకు ఎంపి గీత వైసీపీని విడిచి, టీడీపీకి మద్దతు పలికారు. గెలిచిన కొద్ది రోజులకే జగన్‌తో విభేదించి, గీత పార్టీ మారాల్సి వచ్చింది. ఆ తరువాత అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొద్ది నెలల కిందటే టిడిపిలో చేరి, ఇప్పుడు ప్రభుత్వ విప్ అయ్యారు. జగన్ పాద యాత్ర మొదలుపెట్టిన తరువాత రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి చంద్రబాబు పచ్చ కండువా కప్పేశారు. తాజాగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా వైసీపీని వీడేందుకు రంగం సిద్ధం అవుతోంది. గత ఎన్నికల్లో ఈశ్వరి పాడేరు నియోజకవర్గంలో గతంలో ఎవ్వరూ సాధించనంత మెజార్టీ సాధించారు. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వైసీపీని బలోపేతం చేశారు. ఆమెను టీడీపీలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ఒక వ్యక్తిని పాడేరు పంపించి, ఆమెపై వత్తిడి తెచ్చారు. కానీ ఆమె వైసీపీని వీడి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు జగన్‌తో సహా పార్టీ అగ్రనేతలతో విసిగిపోయిన ఈశ్వరి పార్టీకి గుడ్‌బై చెప్పాలని చూస్తున్నారు.
అరకు నియోజకవర్గం నుంచి బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఫల్గుణుడిని ఆ ఉద్యోగానికి రాజీనామా చేయించి, జగన్ పార్టీలో చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అరకు టిక్కెట్ ఇస్తానని చెప్పి, పార్టీ కోసం ఇప్పటి వరకూ పనిచేయించారు. తీరా ఇప్పుడు ఫల్గుణుడిని కాదని, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును జగన్ తీసుకువస్తున్నారు. ఆయనతోపాటు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి బాలరాజును కూడా వైసీపీలోకి తీసుకువచ్చేందుకు అధిష్ఠానం రంగం సిద్ధం చేసింది. వీరిద్దరి రాకను ఈశ్వరి తీవ్రగా వ్యతిరేకిస్తున్నారు. ఆ ఇద్దరూ పార్టీలోకి వచ్చినట్టయితే, తాను వైసీపీలో ఉండనని ఈశ్వరి తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని జగన్‌కే ఈశ్వరి నేరుగా చెప్పినా, ఆయన పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. ఇప్పటికే మనస్తాపంతో ఉన్న ఈశ్వరి పార్టీని వీడి వెళ్లచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే శ్రీవల్లిని కూడా టిడిపిలోకి తీసుకువచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బొబ్బిలి ఎమ్మెల్యే, మంత్రి సుజయకృష్ణ రంగారావు ముఖ్య అనుచరులు. వచ్చే ఎన్నికల్లోగా రాజన్నదొర, శ్రీవల్లిని పార్టీలోకి తీసువస్తానని రంగారావు సిఎంకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. పాలకొండ ఎమ్మెల్యే మాత్రం వైసీపీలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే, ఏజెన్సీలోని వైసీపీ జెండాతో గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఐదుగురు, ఒక ఎంపిని పార్టీ చేజారిపోయినట్టే! ఏజెన్సీలో పార్టీ ఖాళీ అయిపోయినట్టే!