రాష్ట్రీయం

అద్భుతంగా యాదాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 24: యాదాద్రి ఆలయం అభివృద్ధి పనులను అన్ని ప్రభుత్వ శాఖలూ వేగవంతంగా పూర్తి చేసి దేశంలోనే అద్భుత ‘ఆలయ నగరి’గా రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. యాదాద్రి దేవస్థానాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం కేసీఆర్ ఆలయ పనుల్లో పురోగతిని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. పనుల్లో వేగం పెంచి వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ప్రధాన ఆలయంలో స్వయంభూ దర్శనాలు అందుబాటులో తేవాలని ఆదేశించారు. ఆలయం చుట్టూ ఏడు రోడ్లను కలుపుతూ ఏడు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి 143 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాయగిరి, తుర్కపల్లి, వంగపల్లి, రాజాపేట, కీసర ప్రాంతాల నుండి యాదగిరిగుట్ట వైపువచ్చే ఏడు రహదారులను రెండు లేన్లుగా నిర్మాణం చేపట్టాలన్నారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వైపు వెళ్లే రహదారిలో నిర్మిస్తున్న వంతెన పనులను సత్వరమే పూర్తి చేయాలని, వంగపల్లి నుంచి యాదగిరిగుట్ట వైపు వచ్చే మార్గాన్ని డబుల్ రోడ్డుగా మార్చి సికింద్రాబాద్ -ఖాజీపేట రైల్వే లైన్‌పై ఆర్‌ఓబీ చేపట్టాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట పంచాయితీని మున్సిపాలిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
రాయగిరి పెద్దచెరువు, యాదగిరిగుట్ట గండి చెరువును మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి, ఆలయ పరిసరాలు, నవగిరుల్లో పచ్చదనం అభివృద్ధికి ఏడాది మొత్తం నీరుండేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సీసీ కెమెరాల నిఘాలో శాంతిభద్రతల పరిరక్షణ ఉండాలని, యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) స్వయంగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఇక్కడ నిత్యం 150 మంది సాయుధ పోలీసులు అందుబాటులో ఉండాలని, ఇందు కోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఆర్మ్‌డ్ రిజర్వు కార్యాలయాన్ని యాదాద్రిలోనే ఏర్పాటు చేస్తామని, ఏసీపీ కార్యాలయం,
టెంపుల్ సిటీకి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ కార్యాలయాలు, గృహవసతి, ఇతర నిర్మాణాలకు 50 ఎకరాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
గుట్టపై 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రధాన ఆలయం, రాజ గోపురాలు, ప్రసాదం కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, శివాలయం, ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం, రథమండపం, మెట్ల మార్గం పనులను సీఎం పరిశీలించారు. గుట్ట దిగువ భాగంలో సేకరించిన 143 ఎకరాల్లో చేపట్టాల్సిన నిర్మాణాలపై సూచనలు ఇచ్చారు. 40 ఎకరాల స్థలంలో ప్రవచనాల కోసం నిర్మాణాలు చేపట్టాలని, బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 లక్షల మంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చునేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అదే ప్రాంతంలో బస్టాండ్ కాంప్లెక్స్ కూడా నిర్మించాలని, పక్కనే ఉన్న 33 ఎకరాల విస్తీర్ణంలో గండి చెరువును అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు కట్టను వెడల్పు చేసి ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటుచేసి తెప్పోత్సవం జరిపేలా ఆధునీకరించాలని ఆదేశించారు. 1200 ఎకరాల్లో విస్తరించిన పెద్దగుట్టపై జరుగుతున్న పనులను పరిశీలించి మొదటి దశలో 250 ఎకరాల్లో రహదారుల నిర్మాణం పూర్తయినందున రెండో దశ పనులు ప్రారంభించి పచ్చదనాన్ని పెంచాలన్నారు. ఇక్కడ రెండు విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టి రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూడాలన్నారు. భక్తుల కోసం రోజూ 15 నుండి 20 లక్షల లీటర్ల మంచి నీటిని మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసేందుకు పైప్ లైన్లు, ట్యాంకులను నిర్మించాలన్నారు. యాదాద్రిలో ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీని అన్ని హంగులతో ఆధునీకరించాలన్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ ప్రాంతంలో కాటేజీల నిర్మాణానికి ఇప్పటికే 50 కోట్ల విరాళాలు వచ్చాయని, వెంటనే కాటేజీల నిర్మాణం ప్రారంభించాలన్నారు. టెంపుల్ సిటీలో 2 కోట్లు, కోటి, 50 లక్షలు, 25 లక్షల కేటగిరిలతో కాటేజీలు నిర్మించేందుకు దాతలను ఆహ్వానించాలని సూచించారు. సీఎం వెంట మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, జి.జగదీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్, ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, సిఎంవో అదనపు కార్యదర్శి భూపాల్‌రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, జెసి రవి, వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీత, అర్కిటెక్ట్‌లు ఆనందసాయి, రవి, స్థపతి సుందరరాజన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

చిత్రాలు.. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న సీఎం కెసిఆర్, *ఇన్‌సెట్‌లో కెసిఆర్ కుటుంబానికి పండితుల ఆశీర్వచనం