ఆంధ్రప్రదేశ్‌

దిగిరాకుంటే ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 31: కాపులను బీసీల్లో చేరుస్తూ 24 గంటల్లోగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, లేనిపక్షంలో తాను ఆమరణ దీక్షకు దిగుతానని మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అల్టిమేటం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం కాపుగర్జన వేదిక నుండి కిందకు దిగి, జాతీయ రహదారిపై బైఠాయించిన ముద్రగడ రాత్రి 10 గంటలకు ఆందోళన విరమించారు. ప్రభుత్వం జీవో విడుదల చేయని పక్షంలో కాపుల ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తన ఇంట్లోనే నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. కాపు ఐక్యగర్జన విజయవంతమైందని, ఈ కారణంగా ఆందోళన విరమించాలని పిలుపునిచ్చారు. కాగా ముద్రగడ బైఠాయింపు విరమించడంతో జాతీయ రహదారిపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను చక్కదిద్దే పనిలో అధికార్లుపడ్డారు.
అంతకుముందు సాయంత్రం జరిగిన ఐక్య గర్జనలో మాట్లాడుతూ ‘కాపులతో ఓట్లు వేయించుకుని మోసం చేస్తున్నారు. బీసీ జాబితాలో చేరుస్తామని, ఆర్థికాభివృద్ధికి ఏడాదికి వెయ్యి కోట్లు చొప్పున నిధులు విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు ఏదీ అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అమలు చేస్తానన్న హామీలకు ఏడాదిన్నరైనా దిక్కులేదు. చివరకు మళ్లీ కాపుల్ని రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఆదివారం తుని సమీపంలోని వెలమ కొత్తూరు గ్రామంలో కాపు ఐక్య గర్జన పేరిట నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. 1993లో జరిగిన కాపు ఉద్యమంలో తనతోపాటు పాల్గొన్న ఆకుల రామకృష్ణకు ఒక్కరికి మాత్రమే మాట్లాడే అవకాశమిచ్చిన ముద్రగడ, తరువాత తానే ప్రసంగించారు. బ్రిటిష్ పాలనలోనే కాపులు బీసీ జాబితాలో ఉన్నారని, 1910 నుండి 1956 వరకు రిజర్వేషన్లు పొందినట్టు చరిత్ర చెబుతోందన్నారు. తరువాత నీలం సంజీవరెడ్డి సిఎంగా అధికారం చేపట్టిన తరువాత కాపులను బీసీ జాబితా నుంచి తొలగించారని, 1961లో దళిత సిఎం దామోదరం సంజీవయ్య మళ్లీ బీసీ జాబితాలో పెడితే, 1966లో కాసు బ్రహ్మానందరెడ్డి సిఎంగా అధికారం చేపట్టిన తరువాత బీసీ జాబితా నుంచి తొలగించినట్టు చరిత్ర చెబుతోందన్నారు. కాపులు గతంలో తమకున్న రిజర్వేషన్లనే కోరుతున్నారన్నారు. బీసీ జాబితా నుండి తొలగించిన తరువాత ఆరోజు నుండి ఈరోజు వరకు కాపులు తీవ్రంగా నష్టపోయారని, తమకు దక్కాల్సిన లక్షలాది ఉద్యోగాలు కోల్పోయామన్నారు. గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడితే, వారం తిరిగకుండా ప్రభుత్వం జీవో 30 జారీ చేసిందన్నారు. ఈ జీవో చెల్లదని అప్పట్లో కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేస్తే, జీవోను జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. అయితే జీవోను హైకోర్టును తీర్పు అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవటంతో మరుగునపడ్డాయన్నారు.
కాపుల సంక్షేమం కోసం జీవో 30ని జారీచేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ కాపులకు ఏం చేసిందని ప్రశ్నించే సిఎం చంద్రబాబు ఈ విషయం తెలుసుకోవాలన్నారు. కాపుల ఉద్యమంలో భాగంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, ఇది తెలుసుకోకుండా ముద్రగడ ఏం చేశారని ఎలా ప్రశ్నిస్తున్నారన్నారు. బీసీ జాబితాలో కాపులను చేర్చివుంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎస్పీలుగా ఉన్నతోద్యోగాలు పొందేవారన్నారు. ఆ ఉద్యోగాలన్నీ కోల్పోతున్నామని, ఎస్పీ కావాల్సిన వారు డిఎస్పీలుగా, ఎస్‌ఐ కావాల్సిన వారు కానిస్టేబుళ్లుగా, కలెక్టర్లు కావాల్సిన వారు ఆర్డీఓ, ఇంకా చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో 26శాతం నుండి 28శాతం కాపుల సంఖ్య ఉంటుందని ముందే తెలిసిన చంద్రబాబు, ఊరూరా తిరిగి బిసిల్లో చేరుస్తామని, ఏడాదికి వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించారన్నారు. తీరా అధికారం చేపట్టిన తరువాత హామీలను గాలికి వదిలేసారన్నారు. దాంతో మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సభకు కాపులను రానీయకుండా చేసేందుకు స్కూలు బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు బస్సులపై ఆంక్షలు విధించారని, ఎక్కడికక్కడ బస్సులను వాహనాలను నిలిపివేసారని ముద్రగడ ఆరోపించారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ ఇప్పటి నుండే ప్రారంభించాలని పిలుపునిచ్చారు. నాతోపాటు మీరంతా ప్రయాణంచేస్తారా? అని ప్రశ్నించిన ముద్రగడ వెంటనే రాస్తారోకో, రైల్‌రోకోలకు పిలుపునిచ్చారు. తరువాత ఒకదాని వెనుక ఉద్రిక్త పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి.
మా శవాలపై నడిచివెళ్లండి
కాగా ఒకపక్క రైల్వే స్టేషన్ వద్ద విధ్వంసం కొనసాగుతుండగానే జాతీయ రహదారిపై ఆందోళనలో పాల్గొన్న ముద్రగడ ఉద్రేకపూరితంగా ప్రసంగించారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుపై వెనక్కు తగ్గే ప్రసక్తేలేదని, ఈ ఆందోళనలో మమ్మల్ని చంపినా ఫర్వాలేదన్నారు. కాపులను బీసీల్లో మారుస్తున్నట్టు ప్రభుత్వం తక్షణం ప్రకటించాలని, చావో, రేవో ఇక్కడే తేల్చుకుంటామన్నారు. తాను, తన కుటుంబం ఉద్యమంలో ముందుంటుందని, పారిపోయే ఆలోచన లేదన్నారు. చేతనైతే రైళ్లు, బస్సులు మాపై నడిపించండి అని ముద్రగడ ప్రకటించారు.

చిత్రం...1. కాపుల ఐక్య గర్జనలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం

చిత్రం...2. డిగ్రీ కళాశాల మైదానంలో
దగ్ధమవుతున్న పోలీసు వాహనాలు