రాష్ట్రీయం

పోలవరం! బాబు గరం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 30: ఆటుపోట్లకు చలించకుండా సహనంతో వ్యవహరించే ఎపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రం తీరుతో అసహనం చెందుతున్నారా? కేంద్రం ఇప్పటివరకూ అనుసరిస్తున్న సహాయ నిరాకరణతో విసిగి వేసారిపోయారా? తాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కావాలనే అడ్డుపుల్లలు వేస్తోందని ఆయన అనుమానిస్తున్నారా? ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, ప్యాకేజీపై కేంద్రం మాట తప్పడంతో తనపై వస్తున్న ఒత్తిళ్లకు తెరదించి, ఇకపై కేంద్రంతో అమీతుమీకి ఆయన సిద్ధమవుతున్నారా? గురువారం శాసనసభలోను, బయట చంద్రబాబు పోలవరం, విభజన హామీల అమలుపై తొలిసారి ఆవేదనతో, అసహనంతో చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజమనిపించకమానవు.
కాఫర్ డ్యాం నిర్మాణానికి అనుమతులు, పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ఇప్పటివరకూ చేసిన ఖర్చును తిరిగి చెల్లించకపోవడం, సాంకేతిక నిబంధనల సాకుతో వేస్తున్న కొర్రీలు, విపక్షాలతోపాటు, బీజేపీకి చెందిన అగ్రనేతలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి తనపై చేస్తున్న ఫిర్యాదులు, విమర్శలకు తెరదించేందుకు బాబు సిద్ధమవుతున్నట్లు ఆయన తాజా వైఖరి స్పష్టం చేస్తోంది.
పోలవరం వ్యవహారంలో ఉమాభారతి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నంతవరకూ కేంద్రం నుంచి సానుకూల స్పందన ఉండేది. అనేక జాతీయ వేదికలపై ఆమె బాబును పొగిడేవారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, అధికారులు ఆమె వద్దకు వెళ్లినప్పుడు గౌరవించి, అధికారులతో సమావేశాలు నిర్వహించేవారు. అయితే, నితీన్ గడ్కరీ ఆ శాఖ మంత్రిగా రావడంతో ప్రాజెక్టుపై విచారణలు, కొర్రీలు ఎక్కువయ్యాయి. దీనికితోడు రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేతలు పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ కేంద్రమంత్రి గడ్కరీని కలసినప్పుడు, పోలవరంపై ‘వాస్తవ పరిస్థితుల’ను వివరించడంతోపాటు, దానిపై కేంద్ర వైఖరిని అధికారుల సాయంతో తెలుసుకుని, ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. గడ్కరీ తన వద్దకు ఏపీ బీజేపీ నేతలు వచ్చినపుడు కేంద్ర అధికారులను పిలిపించి, ప్రజెంటేషన్ ఇప్పించడం చర్చనీయాంశమైంది. దీంతో కేంద్రం కావాలనే పోలవరంపై అడ్డుపుల్లలు వేస్తోందని, ఇక్కడి బీజేపీ నేతలను కేంద్రమే ప్రోత్సహిస్తోందని బాబు నిర్ధారణకు వచ్చారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీపై హామీలను ఇప్పటివరకూ నెరవేర్చని వైనంపై బాబు విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో వైసీపీ కంటే కాంగ్రెస్ పార్టీ ముందువరసలో ఉంటూ రాజకీయంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పోలవరంలో బాబు సబ్ కాంట్రాక్టులు ఇప్పించి కమీషన్లు తీసుకుంటున్నారని, పట్టిసీమ కూడా అందులో భాగమేనని, కాసుల కోసమే ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని వైసీపీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి వేగంగా వెళుతుండటం కూడా
బాబుకు ఇబ్బందికరంగా పరిణమించింది.
కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకపోయినా, వౌనంగా ఉంటున్నారన్న భావన మరింత బలపడితే రాజకీయంగా నష్టపోతామని గ్రహించిన బాబు, ఇక చివరికి కేంద్రంతో అమీతుమీకే సిద్ధపడుతున్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడే నేరుగా కేంద్రంతో యుద్ధానికి తలపడకుండా, ముందు పోలవరంపై సాంకేతికంగా ఇరికించే వ్యూహానికి ఆయన తెరలేపారు. గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెబితే కేంద్రానికే పనులను అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించడం ద్వారా అటు బీజేపీని, ఇటు విపక్షాలను ఒకసారి ఇరికించేలా ఆయన వ్యూహరచన చేశారు.
అసెంబ్లీని వేదికగా ఎంచుకుని, కేంద్రాన్ని పూర్తిస్థాయిలో ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టడంలో ఆయన విజయం సాధించారు. ప్యాకేజీ ఇస్తామని ఇవ్వలేదని, హోదా ఇస్తామని చెప్పి ఆర్థిక సంఘం పేరుతో ఇవ్వలేదని, విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో కేంద్రం ఎన్ని నెరవేర్చిందో సభలో వివరించడంతోపాటు, హామీల అమలుకు తాను ఇప్పటివరకూ 62 సార్లు కేంద్రం చుట్టూ తిరిగిన విషయాన్ని వెల్లడించడం ద్వారా.. తాను ఎంత కష్టపడుతున్నా, రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపిస్తోందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు.
ఒకటి, రెండు రోజుల్లో ప్రధానిని కలసి, ఇప్పటివరకూ రాష్ట్రానికి ఏం రావాలి? ఏం ఇచ్చారన్న విషయాన్ని స్పష్టం చేస్తానడం ద్వారా, బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారని అర్థమవుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మోదీతో అయ్యే సమావేశమే ఆఖరిది కావచ్చని తెలుస్తోంది. ప్రధానితో అపాయింట్‌మెంట్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నించడం, మోదీ దాటవేస్తుండటం, తనకంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం, అది మీడియాలో తరచూ రావడంతో విసిగిపోయిన బాబు.. ఇక మోదీతో జరిగే భేటీలోనే అన్నీ తేల్చుకోవాలన్న వైఖరితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ బీజేపీ నేతల తీరుపైన, విపక్షాల ధోరణిపైనా బాబు కొంతకాలం నుంచీ అసహనంతో ఉంటున్నారు. బీజేపీతో కలసి ఉన్నా రాజకీయంగా ఎలాంటి లాభం లేకపోగా, వారి నుంచి సహకారం లేకపోవడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. కొత్త రాష్ట్రం కావడంతో కేంద్ర సహకారం తప్పనిసరైనందున, కయ్యానికి కాలుదువ్వకుండా మెతక వైఖరి అనుసరిస్తున్నా ఎలాంటి ఫలితం లేకపోగా, అది రాష్ట్రంలో తన పార్టీపై వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో బాబు ఉన్నారు. ప్రధానంగా జీఎస్టీపై బీజేపీ మీద అన్ని వర్గాల్లో పెరుగుతున్న వ్యతిరేకత టీడీపీ ఖాతాలో కలుస్తుందన్న భయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీతో కలసి ఎన్నికలకు వెళితే తామూ మునిగిపోతామన్న భయాందోళనలు పార్టీ వర్గాల్లోనూ లేకపోలేదు. అయితే, ఇప్పుడే కయ్యానికి కాలుదువ్వకుండా అంశాల వారీగా గళం విప్పి, చివరకు పోలవరం అంశంపైనే కేంద్రంతో బహిరంగంగానే విభేదించే అవకాశాలు లేకపోలేదని ఓ ఎంపీ వ్యాఖ్యానించారు.
*
చిత్రం..పోలవరం చర్చలో భాగంగా అసెంబ్లీలో
తీవ్ర అసహనంతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
*
ఇలాతలంలో హేమం
చిలికించెడి ఆంధ్రజనులిసీయనిరోయన్
ఏలనొ శాపపు పాశమై
పోలవరం రాజకీయ హేలగ మారెన్!