రాష్ట్రీయం

ఎత్తిపోతలే శరణ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: పోలవరం టెండర్ల వ్యవహారంలో కేంద్రం రాసిన లేఖ దుమారం రేపడంతో కుడి, ఎడమ గట్లపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలే శరణ్యమన్న భావన బలపడుతోంది. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరిస్తామని, 2019కి ప్రాజెక్టు పూర్తిచేస్తామని ఇప్పటివరకు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణలో కష్టసాధ్యమన్న వాదన బలపడుతోంది. అనివార్యంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే అప్పటివరకు ఎత్తిపోతల పథకాలతో నెట్టుకు రావలసిందేనని అంటున్నారు. లక్ష్యంమేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలంటే ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్ నుండి కొన్ని పనులను వేరే కాంట్రాక్టు సంస్థకు అప్పగించక తప్పదని ప్రభుత్వం భావించింది.
ఈపీసీ విధానంలో 60సీ కింద ప్రధాన కాంట్రాక్టర్ వద్ద నుంచి కొన్ని పనులను ఇతర కాంట్రాక్టర్లకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈమేరకు పోలవరం ప్రాజెక్టులోని స్పిల్‌వే, స్పిల్ ఛానల్ కాంక్రీటు, మట్టి పనులకు కూడా టెండర్లు పిలవడానికి చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా టెండర్లు పిలిచే సమయంలో వాటిని నిలిపివేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నుంచి లేఖ రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వాస్తవానికి పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించింది. సిమెంటు, స్టీలు ప్రభుత్వమే సరఫరా చేయడంతో పాటు అత్యవసర నిధులనూ పెంచి, అన్ని విధాలా ఆక్సిజన్ అందించింది. సబ్- కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదనే వాదన కూడా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కాంట్రాక్టు సంస్థకు సహకరిస్తూనే వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లు పిలిచిన సమయంలో ట్రాన్‌స్ట్రాయ్ సంస్థ 14 శాతం తక్కువకు
పనులను కోట్‌చేసింది. ఇతర సంస్థలతో పోటీ నేపథ్యంలో టెండరు దక్కించుకోవడానికి 14 శాతం తక్కువకు కోట్ చేయడంవల్లే ప్రస్తుతం ఆ సంస్థ పనులు చేయడానికి ఆపసోపాలు పడుతోందనే వాదన వినిపిస్తోంది. ట్రాన్‌స్ట్రాయ్ సంస్థకు పనుల నిమిత్తం ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి పెట్టింది. ఈ మొత్తాన్ని వడ్డీతో సహా సంస్థకు చెల్లించే బిల్లునుండి మినహాయించుకునేలా వెలుసుబాటు ఇచ్చారు. అయినా పనుల విషయంలో ఇబ్బంది పడుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని పనులను ఇతర సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్లే ప్రస్తుతం కేంద్రంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కాగా పనుల్లో జరిగిన విపరీతమైన జాప్యంతోపాటు భూసేకరణ చట్టంలో వచ్చిన మార్పుల కారణంగా సహాయ, పునరావాసానికి చేయాల్సిన వ్యయం భారీగా పెరగడంతో 2010లో రూ.16,010 కోట్లు ఉన్న అంచనా వ్యయం 2014 ఏప్రిల్‌కి రూ. 58,319 కోట్లకు పెరిగింది. ఇందులో పునరావాసం ఖర్చే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం రూ.33 వేల కోట్లకు పెరిగింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పెరిగిన ఖర్చులో ప్రతీ పైసా కేంద్రానిదే బాధ్యత.
అయితే తాజాగా రేగిన గందరగోళం నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ పోలవరం కుడి కాలువ ఆధారంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల, ఎడమ కాలువ ఆధారంగా నిర్మించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలపై కేంద్రీకృతమయ్యింది. గోదావరి నదిలో నీటి ఉద్ధృతి కొనసాగినంత కాలం ఈ రెండు పథకాల ఆధారంగా కొంతమేర ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖ జిల్లాలకు నీటిని తరలించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం పోలవరం మాటెలావున్నా ఈ రెండు పథకాలపైనే ఆయా జిల్లాల ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు.
ఎవరెన్ని వాదనలు చేసిన పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అనడంలో సందేహం లేదు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఎగువన 42 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 7 లక్షల 20వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. విశాఖ జిల్లాలో 10 మండలాల్లో లక్షా 50వేల 71 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 21 మండలాల్లో 2 లక్షల 49వేల 872 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మండలాల్లో 2 లక్షల 58వేల 142 ఎకరాలు, కృష్ణా జిల్లాలో ఆరు మండలాల్లో 61వేల 258 ఎకరాలు ఆయకట్టుకు నీరందిస్తారు.