రాష్ట్రీయం

ప్లేటు తిప్పేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 1: రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లా అభంగపట్నం ఉదంతానికి సంబంధించిన కేసులో అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. గడిచిన మూడువారాల నుండి నిరవధికంగా కొనసాగుతున్న దళిత సంఘాల నిరసనల పర్వానికి శుక్రవారం నాటి తాజా పరిణామంతో బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన మూడు వారాల నుండి కిడ్నాప్‌కు గురైనట్టు భావించిన ఇద్దరు దళిత యువకులు లక్ష్మణ్, రాజేశ్వర్‌లు హైదరాబాద్‌లో ఉన్నట్టుగా తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం ఆధీనంలోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ వారిని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. సదరు యువకులపై అమానవీయ రీతిలో దౌర్జన్యానికి దిగి, వారిని కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్‌రెడ్డి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారని, అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు బాధిత యువకులు మాత్రం భరత్‌రెడ్డికి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వడం దాడి, కిడ్నాప్ ఉదంతాన్ని పూర్తిగా మలుపు తిప్పినట్లయ్యింది. తమపై భరత్‌రెడ్డి అసలు దాడే చేయలేదని, తమపట్ల ఎంతమాత్రం అనుచితంగా ప్రవర్తించలేదని, తమను కిడ్నాప్ సైతం చేయలేదని పేర్కొనడంతో పోలీసు అధికారులు విస్తుపోతున్నారు. తమంతట తామే సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు, ఇతర ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చామని, పని ఒత్తిడిలో ఉండిపోయి కుటుంబీకులను కూడా సంప్రదించలేకపోయామని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో ఆందోళనకు గురై తమ కుటుంబీకులు కిడ్నాప్ అయి ఉంటామనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటారని బాధిత యువకులు స్పష్టం చేస్తున్నారు.
మూడు మాసాల క్రితం నవీపేట మండలం అభంగపట్నం గ్రామ శివారులో మొరం దందాకు అడ్డుపడ్డారనే అక్కసుతో భరత్‌రెడ్డి అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్, రాజేశ్వర్ అనే ఇద్దరు దళిత యువకులపై దాష్టీకానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నానా దుర్భాషలాడుతూ, వారిని కొట్టి,
సమీపంలోని మురుగు నీటి గుంతలో బలవంతంగా మునకలు వేయించడం, ముక్కు నేలకు రాయించిన దృశ్యాలన్నీ గత మూడువారాల క్రితం సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూసి వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు బయటకు వచ్చిన నాటినుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్‌రెడ్డితో పాటు బాధిత యువకులు లక్ష్మణ్, రాజేశ్వర్‌లు కనిపించకుండాపోయారు.
ఈ నేపథ్యంలోనే దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు మూడు వారాలుగా పెద్దఎత్తున నిరసనలకు దిగాయ. లక్ష్మణ్, రాజేశ్వర్‌లను భరత్‌రెడ్డి కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భరత్‌రెడ్డిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఈ క్రమంలోనే కిడ్నాప్‌కు గురైనట్టు భావిస్తున్న దళిత యువకుల ఆచూకీ హైదరాబాద్‌లో లభ్యమవగా, వారు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయిస్తూ భరత్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడడం చర్చనీయాంశమవుతోంది. మురుగు నీటి గుంతలో ముంచిన విషయమై స్పందిస్తూ అది సినిమా షూటింగ్‌లో భాగమని లక్ష్మణ్, రాజేశ్వర్‌లు సినీ ఫక్కీలో చెబుతుండటం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. దొరల రాజ్యం పేరుతో తీస్తున్న సినిమాలో నటించాల్సిందిగా భరత్‌రెడ్డి కోరడం వల్ల తాము బురద నీటి గుంతలో మునిగిన సన్నివేశంలో నటించామని, ఆ సన్నివేశం తాలూకు దృశ్యాలను వీడియో రూపకంగా సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేయడం వల్ల రాద్ధాంతం నెలకొందని యువకులు తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. తమపట్ల భరత్‌రెడ్డి ఎంతమాత్రం అనుచితంగా ప్రవర్తించలేదని, పైపెచ్చు సినిమాలో నటించే అవకాశం కల్పించారని, ఇందుకు ప్రతిఫలంగా 20వేలు అందజేసేందుకు ముందుకు వచ్చారని భరత్‌రెడ్డికి క్లీన్‌చిట్ అందించారు. తమపట్ల భరత్‌రెడ్డి దౌర్జన్యం చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్నదంతా కట్టుకథేనని, సినిమా షూటింగ్ సన్నివేశాన్ని వేరే విధంగా అన్వయించుకున్నారని వివరణ ఇవ్వడంతో కేసు అనూహ్య మలుపు తిరిగినట్లయ్యింది. ఈ తాజా పరిణామంతో భరత్‌రెడ్డి తనంతట తాను లొంగిపోయేందుకు, అతనిపై తీవ్రమైన అభియోగాలతో నమోదైన కేసు కూడా వీగిపోయేందుకు ఆస్కారం ఏర్పడినట్లయ్యిందని భావిస్తున్నారు. అయితే దళిత యువకులను ప్రలోభాలకు గురి చేసి, ఎంతో పకడ్బందీ వ్యూహంతో భరత్‌రెడ్డికి అనుకూలంగా మాట్లాడించి ఉంటారని పలువురు ఇప్పటికీ అనుమానాలు వెలిబుచ్చుతున్నారు.
చిత్రం..దళిత యువకులను గుంటలో ముంచుతున్నప్పటి దృశ్యం