రాష్ట్రీయం

చట్టసభల్లో బీసీలకు కోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్రం తరపున కేంద్రాన్ని కోరనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఈ అంశంపై కేంద్రంపై వత్తిడి తీసుకరావడానికి రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రిని కలుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే చట్టసభల్లో బిసీలకు రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేసామని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. బీసీల సంక్షేమం-అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభ కమిటీ హాలులో ఆదివారం అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. బిసీల సంక్షేమం కోసం ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన చట్టాలు, తీర్మానాలు, జారీ చేయాల్సిన ఉత్తర్వులపై క్షుణ్ణంగా చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి కోరారు. విస్తృతంగా చర్చించడానికి మూడు రోజుల పాటు అన్ని పార్టీలకు చెందిన బిసీ ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని సూచించారు. బిసి ప్రజాప్రతినిధులు కోరిన విధంగా చట్టాలు తేవడానికి, ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. ప్రస్తుతం బిసీల కోసం అమలు చేస్తున్న విధానాలలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకోవడానికి కూడా తమకు ఎలాంటి భేషజాలు లేవని ముఖ్యమంత్రి అన్నారు. సమాజంలో సగభాగానికంటే అధికంగా ఉన్న బలహీన వర్గాలు
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతిమంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిసీలకు మేలు జరగాలని, వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. బిసీల అభ్యున్నతి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ఆ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు కూలంకశంగా చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తే వాటిని నూరుకు నూరు శాతం చిత్తశుద్ధితో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బిసీల కోసం విధానాలు, పథకాల రూపకల్పనలో భవిష్యత్‌లో వాటిని ఎవరూ తొలగించలేనంత పకడ్బందీగా రూపొందించుకుందామన్నారు. అభివృద్థి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు మారినప్పటికీ విధానపరమైన విషయాలల్లో స్థిరత్వం ఉంటుందని, అయితే భారతదేశంలో మాత్రం విధానపరమైన స్థిరత్వం లేకపోవడమే ప్రధాన లోపమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బిసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసుకుందామన్నారు. బిసి పారిశ్రామిక వెత్తలను ప్రోత్సహించడానికి టిఎస్‌ఐఐసి కేటాయించే భూముల్లో బిసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇంకా బిసీలకు చేయాలో కొత్త పథకాలు రచించాలన్నారు. అన్ని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించండని సూచించారు. ‘బిసీల విషయంలో రాజకీయాలు లేవు. అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు ఒకే విధంగా కోరుకుంటున్నారు. ఉన్నంతలో బిసీల కోసం ఎంత ఉన్నతంగా పని చేయగలమన్నదే ముఖ్యం. కేవలం ప్రభుత్వమే ఖ్యాతి పొందాలని అనుకోవడం లేదు. అన్ని పార్టీలు సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు చెబుదాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే కొన్ని కులాలకు సర్ట్ఫికేట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులు ఉన్నాయని, ప్రభుత్వ లబ్థి అందుకునే విషయంలో కొన్ని కులాల మధ్య ఘర్షణలు ఉన్నాయి. కొన్ని కులాల గుర్తింపునకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. హాస్టళ్లలో పిల్లలు చేరకుండా రెసిడెన్షియల్ స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు, ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజా ప్రతినిధులు సూచించాలని ముఖ్యమంత్రి అన్నారు. బిసీల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి బిసీలకు 19 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉంటే వాటిని 123కు పెంచామన్నారు. కళ్యాణ లక్ష్మి, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, నాయి బ్రాహ్మణులకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, విశ్వ బ్రాహ్మణులకు అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మొత్తంగా రూ. 1200 కోట్ల వ్యయంతో వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశానికి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, బిసీ మంత్రులు ఈటల రాజేందర్, జోగురామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి, ఎంపి బండారు దత్తాత్రేయ, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బిబి పాటిల్, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, డి శ్రీనివాస్, రాపోలు ఆనంద భాస్కర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై పలు సూచనలు చేసారు.

చిత్రం..బీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు