రాష్ట్రీయం

కాళేశ్వరోభవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 8: కోటి ఏకరాలకు సాగు నీరందించే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్నిపనులు సమాంతరంగా, పటిష్టంగా, సకాలంలో జరిగేలా చూడాలని, వచ్చే వర్షాకాలం నుంచి వీలైనంతమేర నీటిని గోదావరి నంచి తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయంనుంచి సాయంత్రం వరకూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హెలీక్యాప్టర్‌లో పర్యటించారు. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంలో జరుగుతున్న ప్యాకేజీ-6, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో జరుగుతున్న ప్యాకేజీ-8, జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌లో జరుగుతున్న రివర్స్ పంపింగ్ పనులను కేసీఆర్ పరిశీలించారు. చివరగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేర్‌పై ఏరియల్ సర్వే నిర్వహించి, తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం కేసీఆర్ మీడియాతోమాట్లాడుతూ గోదావరి నుంచి రోజూ 2 టీఎంసీ నీటిని పంపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అందులోనుంచి వరద కాల్వద్వారా ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి, మరో టీఎంసీ మిడ్‌మానేర్‌కు పంపాలని సూచించారు. మేడారం, లక్ష్మీపూర్ ద్వారా లిప్ట్‌చేసిన నీటిని వరద కాల్వలో 99వ కిలోమీటర్ వద్ద కలుపాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ, కనె్నపల్లి పంప్‌హౌస్ నుంచి వరద కాల్వ వరకూ నీరు చేరే ప్రక్రియ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనదన్నారు. అలాగే కనె్నపల్లి వద్ద నీటి పంపింగ్ జరిగిన తరువాత అన్నారం, సుందిళ్ల ద్వారా మేడారం వరకు చేరే నీటిని 105 మీటర్లమేర లిప్ట్ చేయటం కూడా అత్యంత ముఖ్యమైన ఘట్టమన్నారు. వచ్చే జూన్‌లోగా రైతులకు సాగు నీరందించేందుకు అన్ని పనులు పూర్తిచేసి, నీటి లిప్టింగ్‌కు, పంపింగ్‌కు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వద్ద అధికారులు త్వరగా చేరుకునేలా రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. మొత్తంగా కాళేశ్వరం పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అధికారులను అడుగగా, ఎలాంటి సమస్యలు లేవని అధికారులు సీఎంకు వివరించారు. కాళేశ్వర ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా తుపాలగూడెం నుంచి మిడ్‌మానేర్ వరకు జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని, ఈ పరిశీలనతో ఒక అవగాహన వచ్చిందని, ప్రాజెక్టు పనులపై అధికారులు, ఇంజనీర్లు, గుత్తేదారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాల్సి ఉందని, అయితే, సమయభావం వల్ల సమీక్షను శనివారానికి వాయిదా వేసినట్టు సీఎం ప్రకటించారు. శనివారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తామని, సమావేశానికి ప్రాజెక్టుకు సంబంధించి అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, గుత్తేదారులు, బీహెచ్‌ఈఎల్, జెన్‌కో అధికారులు హాజరుకావాలని సీఎం ఆదేశించారు. సీఎంవెంట మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులున్నారు. కాగా ప్రాజెక్టుల పరిశీలన కోసం బుధవారం సాయంత్రం కరీంనగర్‌కు చేరుకున్న కేసీఆర్ గురు, శుక్రవారాలు రెండ్రోజులు హెలీక్యాప్టర్‌లో సుడిగాలి పర్యటన చేశారు. మొత్తానికి సీఎం కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలన కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం..కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా హెలీకాఫ్టర్‌లో బయలుదేరుతున్న సీఎం కేసీఆర్