రాష్ట్రీయం

అడ్డుకుంటే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 11: ‘రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని ఎంతోకాలంగా చెపుతూనే వస్తున్నా. ఈ ప్రాజెక్టు ప్రజల సెంట్‌మెంట్‌గా మారింది. అడ్డుకుంటే సహించేది లేదు’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గత కొద్ది రోజులుగా చెలరేగుతున్న వివాదాలు, విమర్శలకు తనదైన శైలిలో తెరవేయడానికి ప్రయత్నించారు. కేంద్రం 2013లో చేసిన భూసేకరణ చట్టం కారణంగానే అంచనా వ్యయం 11 రెట్లు పెరిగిపోయిందన్నారు. పెరిగిన వ్యయమంతా గిరిజనుల కోసం ఖర్చు చేస్తున్నదేనని, అంచనాల పెరుగుదలపై విమర్శలు గుప్పిస్తున్న వారు అర్థం చేసుకోవాలన్నారు. 95 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని, ప్రతి కుటుంబానికి రూ.16.5 లక్షల లబ్ధి చేకూర్చాల్సిన పరిస్థితి ఉందన్నారు. 2011 అంచనాల ప్రకారం పోలవరం మొత్తం వ్యయం రూ.16వేల కోట్లు అనుకుంటే అందులో నాలుగువేల కోట్లు పవర్ ప్రాజెక్టు కింద, రూ.2900 కోట్లు పునరావాసం కింద కేటాయించారని గుర్తుచేశారు. 2013లో
వచ్చిన కొత్త భూసేకరణ చట్టం కారణంగా పునరావాస వ్యయం 11 రెట్లకు పైగా పెరిగి, మొత్తం అంచనా రూ.54 వేల కోట్లకు చేరిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై శే్వతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నామని, నేరుగా అసెంబ్లీకే వివరాలు తెలిపామని, అప్పటికీ ఇప్పటికీ రోజులు తేడావల్ల 20-30కోట్లు తేడా ఉంటుంది తప్ప మిగిలిన లెక్కలన్నీ పారదర్శకంగా ఉన్నాయన్నారు. 2014 నుంచి చేసిన ఖర్చు, కేంద్రం ఇచ్చిన నిధులు, ఇంకా రావాల్సిన నిధుల వివరాలను ఏకరువు పెట్టారు. ఈస్థాయిలో పారదర్శకంగా నడుస్తున్న ప్రాజెక్టు మరొకటి లేదని, అయినప్పటికీ ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శలు గుప్పించటం సరికాదన్నారు. ఇంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని, అంటే వాళ్ల ఉద్దేశ్యం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడటమేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవును తరిమికొట్టగల, జీవనాడిగా నిలవగలిగిన పోలవరం ప్రాజెక్టు విషయంలో సహకరించకపోతే మానుకున్నారుగాని ఇలా అడ్డంపడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఇది ప్రజల సెంటిమెంట్‌గా మారిందని, దాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ప్రాజెక్టు విషయానికి వస్తే దాదాపుగా అన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయని, డయాఫ్రం వాల్, కాంక్రీట్ పనులు, ఎర్త్ వర్క్ వంటివి మే నెలకు పూర్తి అయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. కాంక్రీట్ పనుల విషయంలోనే సాంకేతిక అంశాలు కొన్ని ఉన్నాయని, మిగిలిన కాఫర్ డ్యామ్, స్పిల్‌వే, డయాఫ్రంవాల్, గేట్లు పనులు కూడా మే నెలకు పూర్తవుతాయన్నారు. ఈమధ్య ఒకాయన వచ్చి కాఫర్ డ్యాం అవసరం ఏమిటి, గోడ కట్టేస్తే సరిపోతుంది కదా, అక్కడ గోడలు ఏమి కనపడటం లేదు, అన్ని గుంటలే ఉన్నాయి అంటూ వ్యాఖ్యానాలు చేశారని, సాంకేతిక అంశాల్లో పరిజ్ఞానం లేకుండా ఎవరికివారు వ్యాఖ్యానాలు చేస్తే ఇలాగే ఉంటుందన్నారు. తాను 47సార్లు వర్చువల్ పరిశీలన, 22 సార్లు ప్రత్యక్ష పరిశీలన జరిపానని, అయినప్పటికీ తనకే ఇంతవరకు ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కీలకమైన సాంకేతిక అంశాలు అవగాహనకు రాలేదన్నారు. తనకు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఈప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధ, పనులు ముందుకు వెళ్లటం కోసం పడిన శ్రమ ఇదే తొలిసారని అలాంటిది ఇలా వచ్చి అలా సాంకేతిక అంశాలపై కూడా వ్యాఖ్యానాలు చేసి వెళ్లిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇక విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ఏ అనుభవం ఉందని, పిల్లర్ అంటే ఏమిటో తెలుసా, కాంక్రీట్ అంటే తెలుసా, కాఫర్ డ్యామ్ అర్ధమవుతుందా, ఎర్త్‌వర్క్ ఎలా చేస్తారో తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. మాట్లాడితే శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని, శే్వతపత్రం అంటే బంగారు పూతతో ఉంటుందా అని ప్రశ్నించారు.
కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గడ్కరీ కూడా 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పారని, వారు సూచించే మార్గంలో ప్రాజెక్టు పూర్తిచేయడానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భావితరాల భద్రతను దృష్టిలో పెట్టుకుని మీడియా కూడా ప్రాజెక్టుకు అడ్డుపడే వారికి సహకరించవద్దని, అటువంటి వారిపై మీడియా కూడా ఎదురుదాడికి దిగితే వాళ్లు తోక జాడిస్తారన్నారు. ఉడుంపట్టు మాదిరిగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పంగా నిర్ణయించుకున్నామని, ఆ మేరకు 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించం, 2019 నాటికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకుని మరోమారు పోలవరం ప్రాజెక్టుపై చర్చించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస బాధ్యత కేంద్రానిదేనని, ఈ విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, గేట్ల తయారీ తదితర పనులను పరిశీలించారు. పనుల ప్రగతిపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపిలు మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ తదితరులున్నారు.

చిత్రం..పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లు పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు