రాష్ట్రీయం

పొలిటికల్ ‘జోన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: విశాఖ రైల్వే జోన్.. విశాఖ వాసులకు నెరవేరని కల. తెలుగోడికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్ సభ్యులు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ ప్రశ్నించడం లేదు. ఒడిశా అధికారుల మోచేతి నీరు తాగలేక, వారి ఆధిపత్యాన్ని భరించలేక కుమిలిపోతున్న తెలుగు ఉద్యోగుల బాధను, బాధ్యతగల నేతలు పట్టించుకోవడంలేదు. అనేక సంవత్సరాల విశాఖ వాసుల జోన్ సెంటిమెంట్‌కు ఏ రాజకీయ పార్టీ కూడా విలువిఇవ్వడం లేదు. విశాఖ రైల్వే జోన్‌ను అన్ని రాజకీయ పార్టీలూ ప్రచార ఆయుధంగా తీసుకుంటున్నారు. దాంతో పబ్బం గడుపుకొని, ఆ తరువాత ఈ అంశాన్ని పక్కన పెట్టేస్తున్నారు. విశాఖ రైల్వేజోన్
రాజకీయ క్రీడలో నలిగిపోతోంది. రైల్వే జోన్ వచ్చేస్తోందని ముఖ్యమంత్రి చెప్తారు. ఇస్తామో? ఇవ్వమో? ప్రధాని మోదీ మాత్రం తేల్చి చెప్పరు. జోన్‌పై దోబూచులాడుతున్న ఈ రెండు పార్టీలూ ఏదొక నాడు ప్రజలకు సమాధానం చెప్పుకోవల్సి వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈస్‌కోస్ట్ రైల్వేలో ప్రధానమైనది వాల్తేరు డివిజన్. ఈ డివిజన్ వార్షిక ఆదాయం సుమారు ఏడువేల కోట్లు. భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం తీసుకువచ్చే డివిజన్లలో విశాఖ మొదటి మూడు స్థానాల్లోనే ఉంది. పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది ఈ డివిజన్ పరిస్థితి. విశాఖ నుంచి బయల్దేరే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను భువనేశ్వర్‌కు తరలించుకుపోయారు. విశాఖ నుంచి బయల్దేరే ఎక్స్‌ప్రెస్‌లు వేళ్లలో లెక్కపెట్టచ్చు. అందులో కూడా విశాఖ వాసులకు కోటా ఉండదు. భారతీయ రైల్వే ఏ కొత్త రైలు వేసినా, అది ఒడిశాను ఎక్కడో ఒకచోట దర్శించుకోవల్సిందే. విశాఖ నుంచి హైదరాబాద్‌కు, తిరుపతి, బెంగళూరు, చెన్నై, షిర్డీ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని ఇక్కడి వారు గొంతు ఎండేలా అరిచినా రైల్వే మంత్రిత్వశాఖకు వినిపించదు. దక్షిణ మధ్య రైల్వే దయతో వేసిన ఆ కొద్దిపాటి రైళ్లలోనే అవస్థలు పడుతూ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు విశాఖ వాసులు. అంతెందుకు కొత్తగా వచ్చే కోచ్‌లు ఒడిశా రైళ్లకు తగిలిస్తారు. వాడి వాడి వదిలేసిన బోగీలను వాల్తేరు డివిజన్‌కు అంటగడుతుంటారు. తిరుమల ఎక్స్‌ప్రెస్, పూరి-తిరుపతి, దురంతో, విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తగిలించిన బోగీల్లో ఎలకలు, పందికొక్కులు ప్రయాణికులతోపాటు ప్రయాణిస్తుంటాయి. గబ్బుకంపు కొట్టే బోగీల్లో తెలుగోడు బిక్కుబిక్కుమని ప్రయాణం చేస్తుంటే, జనాలే ఎక్కని మార్గాల్లో కొత్త కొత్త బోగీలతో రైళ్లను నడుపుతున్నారు ఒడిశా అధికారులు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్ష రాయడానికి భువనేశ్వర్ వెళ్లిన తెలుగు అభ్యర్థులను తరిమితరిమి కొట్టారు. ఇదే రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఉంటే, ఇన్ని దారుణాలు జరిగి ఉండేవి కావు. తెలుగు వాళ్లంటే, సాధారణంగా ఉత్తరాది వారికి చిన్నచూపు. అదే భావన రైల్వే జోన్‌పై కూడా ఎందుకు కొనసాగాలి?
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అయితే, దీనిపై స్పష్టత లేదు. రైల్వే జోన్ ఇస్తామనలేదని, జోన్ అంశాన్ని పరిశీలిస్తామని ఉందని చట్టాన్ని క్షుణ్ణంగా చదివిన వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి వచ్చినప్పుడల్లా రైల్వే జోన్ రాష్ట్రానికి ఖాయంగా వస్తుందని చెప్పేవారు. కొద్దిరోజుల కిందట ఆయన మరో అడుగు ముందుకు వేసి, విశాఖకే రైల్వే జోన్ వస్తుందని నొక్కి వక్కాణించారు. టిడిపి మిత్రపక్ష పార్లమెంట్ సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు రైల్వే జోన్ గురించి మాట్లాడుతూ జోన్ వస్తుంది కానీ, ఎక్కడొస్తుందో చెప్పలేమంటారు. పురంధ్రీశ్వరి మాట్లాడుతూ జోన్ వస్తుంది కానీ.. అంటూ వేరే సబ్జెక్ట్‌లోకి వెళ్లిపోతారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి జోన్ మీద క్లారిటీ లేదని అర్థమవుతోంది.
మరి కేంద్రం ఎందుకు జోన్ గురించి మాట్లాడడం లేదు. విశాఖ రైల్వే జోన్‌పై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కోర్టులో పిల్ దాఖలు చేస్తే, కేంద్ర ప్రభుత్వం దానికి కౌంటర్ వేసింది. రైల్వే జోన్ ఇవ్వాలంటే, ఆ డివిజన్ ఆదాయం, రైల్ ట్రాఫిక్, పరిపాలనా అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, జోన్‌కు సంబంధించి నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారని ఆ కౌంటర్‌లో పేర్కొంది. అందువలన రైల్వే జోన్ ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుందని, అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అంటే, ముఖ్యమంత్రి సహా నేతలందరూ జోన్ గురించి కేంద్రంపై ఓత్తిడి తెచ్చినా, అక్కడి నేతలు పట్టించుకునే పరిస్థితి లేదన్నది అర్థమవుతోంది. ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు తీసుకురానున్నారు. దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. సంవత్సరాల తరబడి విశాఖకు రైల్వే జోన్ రాకుండా అడ్డుపడుతున్నవారు.. మేం ప్రయత్నించినా, కేంద్రం ఇవ్వడం లేదని మాటలు చెప్పే నేతలు.. వచ్చే ఎన్నికల్లో విశాఖ ప్రజలకు కచ్చితంగా సమాధానం చెప్పాలన్న ఒక విషయాన్ని గుర్తుంచుకోవల్సి ఉంది.