ఆంధ్రప్రదేశ్‌

కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 2: కాపుల సంక్షేమం కోసం ఏర్పాటైన కాపు కార్పొరేషన్‌కు ప్రస్తుతం వున్న రూ.100 కోట్ల నిధిని వెయ్యి కోట్లకు పెంచేందుకు సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపులకు బిసి రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందంటూ సాధ్యమైనంత త్వరగా కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తుని ఘటన పేరిట అమాయకులపై కేసులు పెట్టి వేధించవద్దంటూ కాపు నేతలు కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం కాపు వర్గానికి చెందిన మంత్రులు, కాపు సంఘ నాయకులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తుని ఘటన దురదృష్టకరమైందని కాపునాయకులంతా ముక్తకంఠంతో విచారం వెలిబుచ్చారు. ముందుగా కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న సూరిబాబు మృతికి సంతాపంగా రెండు నిమిషాలు వౌనం పాటించారు. వచ్చే విద్యా సంవత్సరంకల్లా కాపులకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని నాయకులు కోరారు. తొలిసారిగా బిసి రిజర్వేషన్ల వర్తింపు కోసం కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన చంద్రబాబుపై తమకు అచంచల విశ్వాసం వుందంటూ వారు మ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కమిషన్‌లో మహిళలకు స్థానం కల్పించాలని, ఎన్నికల హామీలో చెప్పినట్లుగా ఏడాదికో వెయ్యి కోట్లు చొప్పున ప్రస్తుత రెండేళ్లకు రెండువేల కోట్లు కార్పొరేషన్‌కు జమచేయాలని నాయకులు కోరారు. కమిషన్ నివేదిక మూడు మాసాల్లో వచ్చేలా చూడాలని కోరారు.
ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, ఎంపి అవంతి శ్రీనివాస్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు, మంత్రులు పి.నారాయణ, అచ్చెన్నాయుడు, కాపునాడు కృష్ణా అధ్యక్షులు బేతు రామ్మోహనరావు, తూగో అధ్యక్షులు పురంశెట్టి మంగారావు, పగో అధ్యక్షులు చిన్నమిల్లి వెంకట్రాయుడు, పొన్నూరు జెడ్పీటిసి కోట శ్రీనివాసరావు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
అదనపు బలగాలు
కాపులకు బలంగా వున్న ప్రాంతాల్లోని సమీప పోలీస్‌స్టేషన్లకు అదనపు పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ముగిసిన తదుపరి ముద్రగడను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని ప్రచారం సాగింది. ఆయన అరెస్టుపై ఎలాంటి ఘటన జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కార్పొరేషన్‌లో కాపుల మనోభావాలను దెబ్బతినకుండా వుండేందుకే ముద్రగడ అరెస్టులో జాప్యం జరుగుతున్నట్లు కాపు నాయకులు చెబుతున్నారు.
కాపుల్లో అంతర్మథనం
అతి సామాన్య ప్రజలు అధికంగా వున్న కాపు వర్గానికి దిశ, దశ నిర్దేశించే సరైన నాయకుడు లేకపోవటం వలనే ముద్రగడ లాంటి నాయకుల పిలుపునకు తక్షణం స్పందిస్తున్నారని ఆ వర్గంలోని మేధావులు చెబుతున్నారు. గతంలో రంగా వున్నప్పుడు ఏమైనా సమస్య వస్తే అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు కూడా వచ్చి అండగా నిలిచేవాడని చెబుతున్నారు. అలాగే క్రమశిక్షణకు కూడా ప్రాధాన్యతనిచ్చేవారని, ఆయన జైల్లో వున్నప్పుడు కృష్ణానది తీరాన లక్షలాది మందితో కాపునాడు సభ ప్రశాంతంగా జరగటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఏ పార్టీ అధికారంలోవున్నా కాపుల పట్ల చిత్తశుద్ధి లేదని, 1994లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని నాటి మంత్రి మహమ్మద్ జానీ ఒక లేఖ రాయటంతోనే నాటి సిఎం కోట్ల విజయభాస్కరరెడ్డి కమిషన్‌ను నియమించి మూడు నెలల్లో అమల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేసారు. అలాగే కోర్టు వివాదం నడిచినప్పటికీ తిరిగి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం రిజర్వేషన్లకు ప్రాణం పోసారని చెబుతున్నారు. 1910లో బ్రిటిష్ కాలం నుంచి కాపులకున్న రిజర్వేషన్లను తొలిసారిగా 1956లో నాటి సిఎం నీలం సంజీవరెడ్డి రద్దు చేయటం జరిగింది. తిరిగి దామోదర సంజీవయ్య పునరుద్ధరించగా 1966లో నాటి సిఎం కాసు బ్రహ్మానందరెడ్డి రద్దుచేయటం జరిగింది. నాటి నుంచి నేటి వరకు బిసి రిజర్వేషన్లు అమలుకు నోచుకోలేదు.

చిత్రం... కాపు నాయకులతో జరిగిన సమావేశంలో
మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు