రాష్ట్రీయం

ఫాతిమా విద్యార్థులకు ఫీజు వాపసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 14: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఫాతిమా విద్యార్థుల వ్యవహారంలో కొత్త మలుపు. వారికి చెల్లించాల్సిన ఫీజులు తిరిగి ఇచ్చేందుకు యాజమాన్యం ఓ మెట్టు దిగింది. విద్యార్థులు చెల్లించిన ఫీజులు తిరిగివ్వడానికి ఫాతిమా మెడికల్ కళాశాల యాజమాన్యం అంగీకరించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈనెల 11న ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్, రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎంసీఐ ప్రతినిధులు, న్యాయ నిపుణులు సమావేశమయ్యారన్నారు. ఫాతిమా విద్యార్థుల సమస్య జఠిలమైందని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు విద్యార్థులు మరోసారి నీట్ పరీక్ష రాయాల్సిందేనని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ స్పష్టం చేశారని మంత్రి తెలిపారు. ఈనెల 18, 19 తేదీల్లో మరోసారి ఢిల్లీ వెళ్లి, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పోలవరం, ఆర్థిక లోటు, రైల్వే జోన్‌తో పాటు ఫాతిమా విద్యార్థుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాను కూడా కలిసి, సుప్రీంకోర్టులో పిల్ వేసే అవకాశాలపై చర్చిస్తామన్నారు. ఫాతిమా కళాశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని, ఇప్పటివరకూ మూడు పర్యాయాలు సుప్రీంకోర్టుకు వెళ్లామని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎంసీఐకు పంపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏ ప్రతిపాదననూ ఎంసీఐ అంగీకరించడం లేదని మంత్రి నిస్సహాయత వ్యక్తం చేశారు.
విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ఫీజులు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థుల ఫీజు తిరిగివ్వడానికి ఫాతిమా యాజమాన్యం కూడా అంగీకరించిందన్నారు. సీటు వద్దనుకునే విద్యార్థులకు ఫీజు తిరిగిప్పిస్తామన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసి, ఫీజుల వివరాలతో కూడిన జాబితాను రూపొందించాలని సూచించామన్నారు. జాబితా అందిన వెంటనే, యాజమాన్యంతో మాట్లాడి, ఫీజులు ఎప్పటిలోగా చెల్లించేది తెలియజేస్తామని మంత్రి తెలిపారు.
విద్యార్థులకు ఉచితంగా లాంగ్ టర్మ్ కోచింగ్
ఫాతిమా విద్యార్థులకు విజయవాడ పోరంకి నారాయణ కళాశాలలో రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి, నీట్ పరీక్ష కోసం ప్రత్యేక లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఫీజు తీసుకున్నవారికి కూడా లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇప్పిస్తామన్నారు. 99మంది విద్యార్థుల్లో మూడోవంతు మంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి అంగీకరించారన్నారు. ఇంకొందరు తాము చెల్లించిన ఫీజు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారన్నారు. మరికొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిల్ వేస్తే, వచ్చే తీర్పు కోసం వేచి చూసే ధోరణిలో ఉన్నారన్నారు.
నీట్ క్వాలిఫై అయి సీటొచ్చిన వారికీ ఫీజు చెల్లిస్తాం
నీట్ పరీక్షలో క్వాలిఫై అయి ఏ, బీ కేటగిరీల్లో సీట్లొస్తే, వారికయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుందని కామినేని తెలిపారు. అయితే నీట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులు ఫాతిమా కళాశాల యాజమాన్యం నుంచి ఫీజు తీసుకోకుండా ఉండాలన్నారు. సీ కేటగిరీ కింద సీటు వచ్చిన వారి విషయం కూడా సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. అంతకుముందు ఫాతిమా విద్యార్థుల తల్లిదండ్రులతో జరిగిన సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సీవీ రావు, అకడమిక్ డీఎంఈ బాబ్జీ, ఫాతిమా కళాశాల ప్రతినిధులు సిద్ధిఖీ, జవహర్ తదితరులు పాల్గొన్నారు.