రాష్ట్రీయం

అగ్గిరాజేసిన గిరిజన వర్గ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్/ హైదరాబాద్, డిసెంబర్ 15: ఆదివాసీలు, లంబాడాల మద్య రాజుకున్న వర్గపోరు శుక్రవారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. నార్నూర్ మండలం హస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బేతల్‌గూడలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురంభీం విగ్రహానికి చెప్పుల దండ వేశారు. ఈ సంఘటన ఉట్నూరు ఏజెన్సీలో చిచ్చురాజేసింది. ఆదివాసీ, లంబాడీ తెగల మధ్య రగులుతున్న వర్గపోరు ఆదిలాబాద్‌లో హింసాత్మకంగా మారింది. కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఆదివాసీలు ఆందోళన చేస్తుండగా ఉట్నూరు మండలం హస్నాపూర్‌లో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఆదివాసీ గిరిజనులు కర్రలు చేతపట్టుకుని హస్నాపూర్‌లో రాస్తారోకో నిర్వహిస్తుండగా ఒక ప్రైవేట్ వాహనం అటువైపు రావడంతో ఆందోళనకారులు ఆగ్రహంతో దాడికి ప్రయత్నించారు. దీంతో వాహనడ్రైవర్ భయంతో ఎక్స్‌లేటర్ నొక్కి జీపును వేగంగా నడపడటంతో అక్కడే ఉన్న షేక్ ఫరీదు (50), రవీందర్ (42), జితేందర్ రాథోడ్ (31) అక్కడికక్కడే మృతి చెందారు. జితేందర్ ఒక ప్రైవేట్ ఛానల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఆదివాసీ గిరిజనుల ఆందోళన ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో నాలుగు వైన్ షాపులు ధ్వంసం కాగా, రెండు కార్లు, మూడు మోటారుసైకిళ్లు దగ్ధమయ్యాయి. పెట్రోల్‌బంక్‌తో పాటు రెండు హోటళ్లు, ఒక ప్రైవేట్ ఆసుపత్రి ధ్వంసమయ్యాయి. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో కరీంనగర్ రేంజి డిఐజి రవివర్మ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, ఎస్పీ ఎం.శ్రీనివాస్ ఉట్నూర్‌కు చేరుకుని ఏజన్సీలో భారీయెత్తున పోలీస్ బలగాలను మోహరింపజేశారు. గిరిజనవర్గాల మధ్య ఘర్షణ మధ్య సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించడంతో ఇంటర్నెట్ వ్యవస్థను స్తంభింపజేశారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ ఘర్షణ ఎటు దారితీస్తుందోనన్న భయం సర్వత్రా నెలకొంది.
ఆదివాసీల ఆరాధ్యదైవంగా భావించే కుమురంభీం విగ్రహాన్ని చెప్పుల దండతో అవమానించిన దుండగులను అరెస్ట్ చేయాలంటూ తుడుం దెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్, విద్యార్థి విభాగం అధ్వర్యంలో సుమారు రెండువేల మంది వివిధ గ్రామాల నుండి బేతల్‌గూడకు
చేరుకుని కుమురం విగ్రహాం వద్ద ధర్నాకు దిగారు. అక్కడే బైటాయించి లంబాడాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎం శ్రీనివాస్, అదనపు ఎస్పీ మోహన్ రెడ్డి, డిఎస్పీ వెంకటేష్, సిఐ భూమయ్యలు సంఘటన స్థలానికి చేరుకొని అందోళనకారులను సముదాయించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని, సంయమనం పాటించాలని కోరారు. అయితే ఈ పరిస్థితి ఇలా ఉండగనే చెప్పుల దండ వేసిన ఘటనపై ఆదివాసి గిరిజన సంఘాలు భగ్గుమన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసి సంఘాల అధ్వర్యంలో నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించి ఇరువైపుల వాహనాలను స్థంభింపజేశారు. ఉట్నూరు క్రాస్‌రోడ్డు రహదారిపై ఆదివాసీ గిరిజనులు భారీఎత్తున ధర్నాకు దిగారు. రాళ్లు, కర్రలు పట్టుకొని లంబాడాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎదురుగా వచ్చిన లంబాడాలు వాళ్లను నిలదీయడంతో ఆదివాసీ గిరిజనులు రాళ్లు రువ్వి దాడికిదిగారు. ఈ దాడిలో 8మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. వెనువెంటనే అక్కడేవున్న పెట్రోల్ బంక్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నించర్, అద్దాలు, పరికరాలను ధ్వంసం చేశారు. హస్నాపూర్‌లో రెండు గుడిసెలు తగలబెట్టారు. హీరాపూర్‌లో కారు అద్దాలను ఆదివాసి గిరిజనులు ధ్వంసం చేశారు. అనంతరం హస్నాపూర్‌లో ఉన్న వైన్‌షాప్‌ను దగ్దం చేయడంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలావుంటే మరోవైపు ఉట్నూరు క్రాస్‌రోడ్డు వద్ద రహదారిపై దుంగలు అడ్డంగావేసి రాస్తారోకో చేయడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు రాకపోకలు స్థంభించాయి. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో సాయంత్రం భారీఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 144 సెక్షన్ నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు ఎస్పీ ప్రకటించారు. పరిస్థితి అంతా గందరగోళంగా మారి టెన్షన్ నెలకొన్న నేపథ్యంలోనే ఉట్నూరులోని ప్రధాన రహదారిపై గల సేవాలాల్ ఆసుపత్రిని ధ్వంసం చేసి ఫర్నిచర్, అద్దాలను పగలగొట్టారు. అక్కడేవున్న మోటర్‌సైకిల్‌ను కాల్చివేశారు. ఉట్నూరులో మరో వైన్‌షాప్‌పై దాడి చేసిన గిరిజనులు ఆ షాపులోని మద్యం నిల్వలను తీసుకవెళ్లారు. ఉట్నూరు క్రాస్‌రోడ్డులో చిన్న గుడిసెలో నడుస్తున్న హోటల్‌ను సైతం దగ్దం చేశారు. పరిస్థితి చేయిదాటడంతో సాయంత్రం నుండే ఆదిలాబాద్, ఉట్నూరు ప్రాంతాల్లో తమ దుఖానాలను స్వచ్చందంగా మూసివేశారు. ఉట్నూరు ఏజెన్సీ కేంద్రంలో విధ్వంసం జరుగుతుందని తెలిసినా పోలీసులు, నిఘావర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రభుత్వం శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పూర్తిగా విఫలమైందని లంబాడా గిరిజన సంఘాల నేతలు ఆరోపించారు. మారుమూల గిరిజన గ్రామంలో కుమురంభీం విగ్రహానికి చెప్పుల దండ వేసిన సంఘటనను నిరసిస్తూ శనివారం ఉమ్మడి జిల్లా బంద్‌కు ఆదివాసి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఇటీవలే ఆదివాసి గిరిజనులు, లంబాడాలు పోటాపోటీగా హైదరాబాద్‌లో బహిరంగ సభలు నిర్వహించుకొని తిరిగి రాగా శుక్రవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న భయం సర్వత్రా ఉత్కంఠత రేపుతోంది.
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
లంబాడీలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించి, ఆఫీసులోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉట్నూరులో పరిస్థితి అదుపులోనే ఉందని, ఇరువర్గాల ఘర్షణలో ఎవరూ చనిపోలేదన్నారు. ఉట్నూరు చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో చనిపోయారని డీజీపీ స్పష్టం చేశారు. ఉట్నూరుకు డిఐజీ రవివర్మతోపాటు అదనపు బలగాలను పంపామని డీజీపీ తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. డిఐజీ రవివర్మ అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, ఉట్నూరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని డీజీపీ తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చిందని, పుకార్లు నమ్మొద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు.

చిత్రం..బేతల్‌గూడలో భీం విగ్రహాన్ని అవమానించారంటూ ధర్నాకు దిగిన ఆదివాసి గిరిజనులు