ఆంధ్రప్రదేశ్‌

బేకార్ పథకమన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 2: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రపంచమంతా గుర్తించి అభినందనలు తెలుపుతుంటే ప్రధాని మోదీ మాత్రం దీన్ని యుపిఎ ప్రవేశపెట్టిన బేకార్ పథకంగా పేర్కొనడం విడ్డూరంగా ఉందని, పేదల పట్ల ఎన్‌డిఎ ప్రభుత్వానికి ఉన్న విజన్‌కు ఇది నిదర్శనమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. అందుకే ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా నీరుగార్చే పన్నాగం పన్నారన్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితి, ప్రపంచబ్యాంకు, అనేక మంది ఆర్థిక నిపుణులు సామాన్యులకు, పేదలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడిందని అభినందించారన్నారు. ఈ పథకం గురించి తెలుసుకున్న విదేశీయులు తమ దేశాల్లో అమలుచేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సైతం ఈ పథకం ప్రాధాన్యతను గుర్తించి అభినందనలు తెలిపారన్నారు. పథకం ప్రాముఖ్యత, ఆవశ్యకత అందరికీ అర్థమవుతోంది గానీ ప్రధాని మోదీకి అర్థం కావడం లేదన్నారు. జన్‌ధన్ యోజన పథకం ద్వారా ఖాళీ ఖాతాలతో రైతులు, రైతుకూలీల అభివృద్ధి జరగదన్నారు. వారి ఖాతాల్లో రూ.15 లక్షల కోట్లు జమ చేస్తామని చెప్పిన మోదీ వాటిని జమ చేయకపోయినా 2014-15లో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన ఆరు వేల కోట్లు తప్పకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ప్రతి ఐదుమందిలో ఒకరికి ఈ పథకం కింద లబ్ది చేకూరిందని, కోట్ల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. కానీ బిజెపి, టిడిపి ప్రబుత్వాలు ఈ పథకాన్ని నీరుగార్చే యత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూలీలు, రైతులు, పేదల పక్షమేనని, ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చితే ఊరుకోమని వారి తరఫున పోరాటాలు చేస్తామన్నారు.
కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చాక కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం వ్యాప్తి చేయడానికి యత్నిస్తోందని రాహుల్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళితుడు కాదని కేంద్రమంత్రి సుష్మా అంటున్నారని, అయితే ఒక యువకుడు స్వేచ్ఛ్భావజాలంతో ఉండడం తప్పా అని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై అప్పటి యుపిఎ ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ప్రత్యేక హోదా అన్నది రాజకీయ సమస్య కాదని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్నారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేయడానికి అందరూ కలసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర మాజీ మంత్రులు, నాయకులు పాల్గొన్నారు.
ఉపాధి హామీతోనే పేదరిక నిర్మూలన
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదరిక నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు. పేదరిక నిర్మూలనపై గాంధీ, నెహ్రూ కాలం నుంచే పోరాటం చేస్తూ వస్తున్నామన్నారు. బండ్లపల్లి గ్రామంలోప్రారంభించిన ఉపాధి హామీ పథకం 100 జిల్లాలకు విస్తరించిందన్నారు. పథకాన్ని ప్రారంభించి పదేళ్లు సందర్భంగా ఇక్కడకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఈ పథకం అని అన్నారు. ఇలాంటి పథకాన్ని నీరుగార్చే కుట్రలో భాగంగానే గత ఆర్థిక సంవత్సరంలో మోదీ ప్రభుత్వం కేవలం ఆరు వేల కోట్ల నిధులు మంజూరు చేయలేదన్నారు. పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం అన్నా మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చామని మన్మోహన్ పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామన్నారు. అయితే బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదాకు ఏమాత్రం సముఖంగా లేదన్నారు.

చిత్రం... అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నిర్వహించిన ఉపాధి పథకం దశాబ్ద ఉత్సవంలో చిన్నారిని ముద్దాడుతున్న రాహుల్‌గాంధీ. కూలీలతో సంహపంక్తి భోజనం చేస్తున్న దృశ్యం