రాష్ట్రీయం

విశ్వ దేదీప్యం తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: అంతర్జాతీయ భాషగా తెలుగుకు గుర్తింపు లభించిందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో మంగళవారం రాత్రి ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో రెండో స్థానంలో నిలిచిన తెలుగు ఖండాంతర ఖ్యాతి పొందిందన్నారు. దక్షిణాఫ్రికా నుండి నైరుతి ఆసియా దేశాల వరకు తెలుగు జాతి ప్రజలు గొప్ప విజయాలను సాధిస్తున్నారన్నారు. అమెరికాలో పరిపాలనా రంగంలో ప్రజాప్రతినిధులుగా తెలుగువారు ఎన్నికవుతూ ఉన్నారని, అక్కడ వివిధ వృత్తుల్లోనూ రాణిస్తున్నారని అన్నారు. ఐటీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సంస్థ సిఇఓగా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల పనిచేయడం మన దేశానికి గర్వకారణమన్నారు. 1920-30 దశకంలోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్‌గా ఎల్లాప్రగడ సుబ్బారావు గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం హర్షణీయమని రాష్టప్రతి పేర్కొన్నారు. 42 దేశాలు, 17 రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులతో పాటు ఈ సభల్లో పాల్గొన్న వారందరికీ అభినందలు తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించే వ్యక్తి ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు ఈ నెల 15 న ఈ సభలను ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. గతంలో నాలుగు సార్లు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయని, మళ్లీ జరిగే ప్రపంచ తెలుగు మహాసభల కోసం తాను ఎదురు చూస్తానని పేర్కొన్నారు. తెలుగు భాషకు 2008 లో ‘క్లాసికల్ లాంగ్వేజ్’గా గుర్తింపు రావడం వెనుక తెలంగాణ ముఖ్యమంతి కె. చంద్రశేఖరరావు కీలకపాత్ర పోషించడం ఆనందంగా ఉందన్నారు. సంస్కృతం, అరబిక్, ఉర్దూ, ఇంగ్లీషు భాషలకు చెందిన అనేక పదాలను తనలో ఇముడ్చుకున్న గొప్ప భాష తెలుగు అంటూ ప్రశంసించారు.
తెలుగు సంస్కృతి, సాహిత్యాలు భారతదేశానికి వనె్న తెచ్చాయని రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. విజయనగరరాజు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజుగానే కాకుండా తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారన్నారు. తెలుగు వాడైన మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు బహుభాషా కోవిదుడని అన్నారు. తనకంటే ముందు రాష్టప్రతులుగా పనిచేసిన డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్, వి.వి. గిరి, నీలం సంజీవరెడ్డి తెలుగువారు కావడం గర్వకారణమన్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన ఘనత తెలుగువాడైన పింగళి వెంకన్నకే దక్కిందన్నారు. వేయి సంవత్సరాల క్రితమే నన్నయభట్టు తెలుగు వ్యాకారణం రాశారని, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని రాష్టప్రతి గుర్తు చేశారు. తిక్కన కూడా గొప్పకవిగా పేరుతెచ్చుకున్నారని, గురజాడ అప్పారావు రచనలు జాతీయోద్యమానికి ఊతమిచ్చాయన్నారు. సామాన్యుల ఉద్దరణకు శ్రీశ్రీ చేసిన రచనలు బహుదా ప్రశంసనీయమన్నారు. వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి రచనలు సామాన్యుల మనస్సుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాయన్నారు. త్యాగరాయ కృతులు, అన్నమాచార్య కీర్తనలు అంతర్జాతీయంగా పేరుగాంచాయని కోవింద్ కితాబిచ్చారు.
పోరాట యోధుడు కుమరం భీం
తెలంగాణ ప్రజల హక్కుల కోసం అనేక మంది పోరాటం చేశారని రాష్టప్రతి పేర్కొంటూ, గిరిజనుల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కుమురం భీం జీవితాంతం పోరాటం చేశారని ప్రశంసించారు. ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా చిట్యాల ఐలమ్మ తదతరులు పోరాటం చేసిన గడ్డ తెలంగాణ అన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా వందల సంవత్సరాల క్రితమే భాగ్యారెడ్డి వర్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ విముక్తికోసం, నిజాంపాలిత ప్రాంతాన్ని స్వతంత్ర భారత్‌లో కలిపేందుకు స్వామి రామానంద తీర్థ తదితరులు చేసిన పోరాటం ఈ జాతి మరువబోదన్నారు.
గొప్పనగరం హైదరాబాద్
హైదరాబాద్ నగరం భాషా సంస్కృతి, సాంప్రదాయాలకే కాకుండా సాంకేతిక రంగంలోనూ అంతర్జాతీయంగా పేరుతెచ్చుకుందని, ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్టప్రతి పేర్కొన్నారు. సులభతర వ్యాపారం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. ఇటీవల జిఇఎస్ విజయవంతంగా హైదరాబాద్‌లో జరగడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహకారం గొప్పదన్నారు. సినిమా రంగానికి కూడా ఈ నగరం కేంద్రంగా మారడం సంతోషదాయకమన్నారు. హైదరాబాద్ బిర్యానికే కాకుండా బ్యాడ్మింటన్ యోధులకు కేంద్రంగా ఉందని, బాహుబలి లాంటి సినిమాలు రూపుదిద్దుకున్న నగరమని ప్రశంసించారు. ఢిల్లీలో కూడా తెలుగు పచ్చళ్లకు పేరుందన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.