రాష్ట్రీయం

ఆర్డర్ టు సర్వ్ ఇంకెంతకాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి దసరా పండుగ నాటికే ఏడాది గడిచినప్పటికీ, ఇంకా పూర్తిస్థాయి ఉద్యోగుల నియామకం జరుగలేదు. దసరా పండుగ పర్వదినాన కొత్త జిల్లాలు లాంఛనంగా ప్రారంభం కావాల్సి ఉండటంతో పాత జిల్లా కేంద్రాల్లోని ఉద్యోగులనే సర్దుబాటు చేసారు. ‘ఆర్డర్ టు సర్వ్’ పేరిట ఉద్యోగులకు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చి నెల రోజుల్లో కౌన్సిలింగ్ నిర్వహించి పర్మినెంట్ ఉత్తర్వులు జారీ చేస్తామని హామీతో పంపించారు. అలా వెళ్లిన వారు గత అక్టోబర్ 11 నాటికి ఏడాది గడిచినా ఇప్పటి వరకు తాత్కాలిక ఉత్తర్వులపైనే కొనసాగుతున్నారు.
పూర్తిస్థాయి పోస్టింగులు లేకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులు మొక్కుబడి విధులకే పరిమితం అయ్యారు. దీంతో కొత్త జిల్లాలతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చేరువైనప్పటికీ ఉద్యోగులు మాత్రం కాలేకపోతున్నారు. కొత్త జిల్లాల ఆవిర్భావం అద్భుతంగా జరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో కొనియాడారు. జిల్లాల అవిర్భావం సరే సరి, మరి ఉద్యోగుల సంగతి మాత్రం ఇప్పటిదాకా తేలకపోవడంతో ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులపై పని చేస్తున్న ఉద్యోగులు వాపోతున్నారు. కొత్త జిల్లాలకు పోస్టులు మంజురీ అయితే తప్ప పర్మినెంట్ స్ట్ఫాను నియమించే అవకాశం లేదు. దీంతో ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులతో పని చేస్తున్న ఉద్యోగులతోనే ఏడాదికాలంగా నెట్టుకోస్తున్నారు. తమకు పర్మినెంట్ పోస్టింగ్ ఎక్కడికిస్తారో తెలియని పరిస్థితుల్లో తాత్కాలిక ఉద్యోగులు
కూడా మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత, తాత్కాలిక ఉద్యోగుల వల్ల పనులు కూడా సజావుగా జరుగడం లేదన్న విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటుంది.
రాష్ట్ర విభజన తర్వాత 10 జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణలో కొత్త జిల్లాలకు 2016 అక్టోబర్ 11న (దసరా పండుగ) శ్రీకారం చుట్టింది. పాత జిల్లాలు పదింటి స్థానంలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాత జిల్లాల్లోని ఉద్యోగులనే కొత్త జిల్లాలకు సర్దుబాటు చేసింది. ఒక్కో కొత్త జిల్లాలకు సుమారు 500 మంది చొప్పున ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జిల్లాలు లాంఛనంగా ప్రారంభమయ్యాక నెల రోజులలో కౌన్సిలింగ్ నిర్వహించి సదరు ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇస్తామన్న హామీ ఇచ్చి పంపించింది. ఉద్యోగులు కూడా ఎలాగు నెల రోజుల్లో పర్మినెంట్ పోస్టింగ్ ఎక్కడో తేలుతుందన్న నమ్మకంతో సంతోషంగా విధుల్లో చేరారు. అయితే నెల రోజులు కాదు కదా కొత్త జిల్లాలు ఏర్పడి మొన్నటి దసరా పండుగకే ఏడాది దాటినా తదుపరి ఉత్తర్వులు అతీగతి లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఉధాహరణకు మహబూబ్‌నగర్ పాత జిల్లా కేంద్రంలో పని చేసే ఉద్యోగి ఒకరికి గద్వాల జోగులాంబ జిల్లాకు ఆర్డర్ టు సర్వ్ కింద బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవానికి ఈ ఉద్యోగి స్వస్థలం ఇదే జిల్లాలోని నాగర్‌కర్నూల్. ఇది కూడా కొత్తగా జిల్లాగా ఏర్పడటంతో ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు ఇచ్చే ముందుకానీ, ఆ తర్వాత కానీ ఆప్షన్ తీసుకొని ఉంటే నాగర్‌కర్నూల్ జిల్లాకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుకునే అవకాశం ఉండేది. కానీ అలాంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించకపోవడంతో నాగర్‌కర్నూల్‌కు చెందిన ఉద్యోగి గద్వాలలో, గద్వాలకు చెందిన ఉద్యోగి నాగర్‌కర్నూల్‌లో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆనాలోచిత చర్యల వల్ల మానసికంగా, భౌతికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే అభిప్రాయాన్ని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి వ్యక్తం చేసారు. ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల జారీకి ముందు కానీ, ఆ తర్వాత కానీ ఉద్యోగుల నుంచి అప్షన్స్ తీసుకొని ఉంటే ఉద్యోగులు ఇంతగా ఇబ్బంది పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా కొత్త జిల్లాలకు పోస్టులు మంజురు చేసి ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల స్థానంలో పర్మినెంట్ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరం లోగా అయినా ఉద్యోగుల స్థిరీకరణ ప్రక్రియను పూర్తి చేస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో బదిలీలకు అవకాశం కల్పించాలని రవీందర్‌రెడ్డి డిమాండ్ చేసారు.