రాష్ట్రీయం

సముద్రం సాక్షిగా.. సత్తా చాటనున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వందకుపైగా యుద్ధ నౌకలు. 90కి పైగా యుద్ధ విమానాలు. ఏ దేశ నౌకాదళమైనా సగర్వంగా చెప్పుకునే పండుగ అంతర్జాతీయ సముద్ర సమీక్ష. ఏ దేశంలోనైనా అత్యంత అరుదుగా జరిగే కార్యక్రమమిది. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు సన్నాహాలు పూర్తయ్యాయి. భౌగోళికంగా సరిహద్దు తగాదాలుండొచ్చు. వర్తక, వాణిజ్య విషయాల్లో భేదాభిప్రాయాలు ఉండచ్చు. షరతులు, నిబంధనల విషయంలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) విషయానికి వచ్చేప్పటికి, ఆయా దేశాల నౌకాదళాలు వాటిని పూర్తిగా మరిచిపోతాయి. సముద్రం సాక్షిగా కలిసి సాగుదామంటూ ఒక్కటవుతాయి. ఆ అద్భుత సన్నివేశానికి విశాఖ వేదికైంది. నాలుగు రోజులపాటు సాగే ఫ్లీట్ గురువారం నుంచి విశాఖలో ప్రారంభం కాబోతోంది.
భారత్‌కు అరుదైన అవకాశం
మన దేశ ఆధునిక రణతంత్ర శక్తియుక్తులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని భారత నౌకాదళం అవకాశంగా తీసుకుంటోంది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో తూర్పుతీరం తొలిసారిగా ఇంతటి మహత్తర కార్యక్రమానికి ఆతిథ్యమిస్తోంది. వ్యూహాత్మకంగా ఏర్పడిన తూర్పుతీరం సత్తాను ప్రపంచ దేశాలకు, దాయాది దేశానికి తెలియచెప్పడమే ఫ్లీట్ రివ్యూ ఆంతర్యం. 27 విదేశీ యుద్ధ నౌకలు, 70కి పైగా భారత నౌకాదళ యుద్ధనౌకలు ఇందులో పాల్గొంటున్నాయి.
దేశ సర్వసైన్యాధ్యక్షుడైన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఫ్లీట్ రివ్యూని సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహ కార్యక్రమాలు పూర్తయ్యాయి. భారీగా నిర్వహించే ఫ్లీట్ రివ్యూకి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? దేశ సర్వసైన్యాధ్యక్షుడైన రాష్టప్రతికి అరుదైన గౌరవం ఇవ్వడంతోపాటు, వివిధ దేశాల సైనికపాటవాలను తెలుసుకోవడం, మన దేశ శక్తి సామర్థ్యాలను, స్నేహ సంబంధాలను ఇతర దేశాలకు చాటిచెప్పడానికి వేదికగా కార్యక్రమం నిలుస్తుంది కాబట్టి దీనికి ఇంత ప్రాధాన్యత ఉంది. ప్రతి రాష్టప్రతి పదవీకాలంలో ఒకసారి ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. ఇప్పటి వరకూ మన దేశంలో 10సార్లు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలు జరిగాయి. మన దేశంతోపాటు, అంతర్జాతీయ యుద్ధ నౌకలు, విమానాలు కూడా పాల్గొంటే దాన్ని ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటారు. 2001లో ముంబైలో పశ్చిమతీరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి అప్పటి రాష్టప్రతి కెఆర్ నారాయణన్ పాల్గొన్నారు. మళ్లీ 15ఏళ్ల తరువాత తూర్పుతీరంలో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. మన శక్తి సామర్థ్యాలను చాటిచెపుతూనే, మనతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలకు అండగా ఉన్నామని చెప్పడం కూడా ఫ్లీట్ రివ్యూను వేదికగా ఉపయోగించుకుంటున్నాం.
భారత దేశానికి సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు సముద్ర మార్గానే్న ఎంచుకుంటున్నారు. పశ్చిమ తీరంలో ఇటువంటి చేదు అనుభవాన్ని మనం చవి చూశాం. ఇటువంటి పరిస్థితుల్లో తీర భద్రతపై మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం. పశ్చిమ తీరాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చిన తరువాత, ఇప్పుడు భారత ప్రభుత్వం తూర్పు తీర పటిష్ఠతపై దృష్టి కేంద్రీకరించింది. భారత్‌పై కాలుదువ్వుతున్న చైనాను నిలువరించడంతోపాటు, హిందూ మహా సముద్రంలో వాణిజ్యాన్ని పటిష్ఠపరిచేందుకు భారత నౌకాదళం అడుగులు ముందుకు వేస్తోంది.
సముద్రతీరంలో ఆరు లేన్లలో బారులుతీరిన యుద్ధ నౌకలను రాష్టప్రతి ప్రణబ్ సమీక్షిస్తారు. ఆకాశమార్గంలో 70 దేశ, విదేశీ విమానాలు విన్యాసాలు పరిశీలిస్తారు. భారత నౌకాదళానికి చెందిన ఎజెటి హక్122, టియు 142, డోర్నియర్‌లు, చేతక్, డోర్నియర్లు, సారంగ్ హెలికాప్టర్లు అలరించనున్నాయి. రష్యా, చైనా, కెనడా, ఆంటిగ్వా, బంగ్లాదేశ్, మైన్మార్, జపాన్, ఇండోనేషియా, టర్కీ ఆస్ట్రేలియా, ఒమన్, సౌదీ నుంచి నౌకలు వస్తున్నాయి. ఈ విన్యాసాలకు పాకిస్తాన్ మాత్రమే దూరంగా ఉండటం గమనార్హం. 5న గవర్నర్ నరసింహన్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆరున ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధ నౌకపై నుంచి రాష్టప్రతి యుద్ధ నౌకల సమీక్ష నిర్వహిస్తారు. వివిధ దేశాల సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.
ఇవీ నేటి కార్యక్రమాలు
విశాఖలో 4రోజులపాటు జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ గురువారం నుంచి ప్రారంభంకానుంది. కార్యక్రమానికి సిఎం చంద్రబాబు హాజరవుతున్నారు. గురువారం సాయంత్రం 3.30కు చంద్రబాబు విశాఖ చేరుకుంటారు. 4 నుంచి 4.35వరకూ స్థానిక బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. 1971 భారత్- పాక్ మధ్య జరిగిన యుద్ధంలో అమరులైన నౌకాదళ వీరులకు చిహ్నంగా స్థూపాన్ని నిర్మించారు. తరువాత చంద్రబాబు ఆంధ్ర వర్శిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను ప్రారంభిస్తారు.

చిత్రం.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ తీరానికి
చేరుకున్న ఐఎన్‌ఎస్ విక్రమాధిత్య, ఐఎన్‌ఎస్ విరాట్