రాష్ట్రీయం

ప్రతి ఎకరాకు సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 12: రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖామంత్రి హరీష్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టు రెండవ దశను ప్రారంభించిన అనంతరం కాకరవాయిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ నిర్ణీతగడువు కంటే ముందుగానే ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కని ఖ్యాతి తెలంగాణకు దక్కుతున్నదన్నారు. రెండురోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర జలసంఘం అధికారులు చరిత్రలో ప్రాజెక్టు నిలిచిపోతుందని చెప్పడం గర్విందగ్గ విషయమన్నారు. ఏడాదికాలం పోయినా ప్రాజెక్టులో ఉన్ననీరు వ్యవసాయానికి పనికొచ్చేలా ప్రాజెక్టులు రూపుదిద్దుతున్నామన్నారు. గతంలో విద్యుత్, నీరు విషయంలో రైతులను ప్రభుత్వాలు మోసం చేశాయని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో దానిని సరిదిద్దుకున్నామన్నారు. రైతులకు 24గంటల విద్యుత్‌తో పాటు ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. పండించిన పంటను దాచుకునేందుకు అన్ని మండల కేంద్రాల్లో గోదామ్‌లు నిర్వహించామన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం చేస్తున్న పథకాలను అన్ని రాష్ట్రాలు అభినందిస్తుంటే ఇక్కడ ఉన్న కొందరు నేతలు మాత్రం ప్రజలను పక్కదారి పట్టించేందుకు విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. ఆ పథకాలను ఆపేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. అయినా తమ లక్ష్యం ఆగదని, విమర్శలకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా 78వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, మరో 22వేల చెరువులు నిండుతున్నాయని, తద్వారా భూగర్భజల నీటిమట్టం పెరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీటికి కొరతలేని నియోజకవర్గంగా పాలేరు చరిత్రలో నిలిచిందన్నారు. నాగార్జునసాగర్ కాల్వ, పాత సాగర్‌కాల్వ, భక్తరామదాసు కాల్వలతో ఈ నియోజకవర్గం సస్యశ్యామలం అయిందని స్పష్టం చేశారు. గతంలో ఎడారిగా ఉన్న తిరుమలాయపాలెం మండలం ఇప్పుడు సస్యశ్యామలంగా మారిందన్నారు. కాళేశ్వరం నీటిని ఈ ప్రాంతానికి కూడా తీసుకువస్తామని హామీనిచ్చారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని, ఉగాది నుండి ఇంటింటికి తాగునీటిని కూడా అందిస్తామని స్పష్టం చేశారు. భక్తరామదాసు రెండవ దశ పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం కాల్వపై ఆరుకిలోమీటర్ల మేర పరిశీలిస్తూ పర్యటించిన మంత్రులు కొన్నిచోట్ల అధికారులకు సూచనలు చేశారు.

చిత్రం..ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టుకు పూజలు చేస్తున్న మంత్రులు