రాష్ట్రీయం

ముందే కూసిన ‘రాజకీయ పందెం కోళ్లు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
అమరావతి, జనవరి 14: పట్నమంతా పల్లెలోనే ఉంది. రాదార్లన్నీ గ్రామాల వైపే పరుగులు పెడుతున్నాయి. జనమంతా పందెం కోళ్లను చూసే పనిలో ఉంటే, ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలంతా జనం మధ్యకు వెళ్లేపనిలో పడ్డారు. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జనంలోకి వెళుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రతో జనక్షేత్రంలో దూసుకెళుతున్నారు. ఇప్పటివరకూ జనసామాన్యానికి దూరంగా ఉంటూ అప్పుడప్పుడూ ఉరుములు, మెరుపులతో గర్జిస్తోన్న జనసేనాధిపతి పవన్ ఫుల్‌టైమర్ అవతారమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలే ప్రచారాస్త్రంగా చేసుకుని బీజేపీ జనక్షేత్రంలోకి దిగితే, కనీసం ఒక్క చోటయినా జెండా ఎగరేయాలన్న కసితో కాంగ్రెస్ పోరాడుతోంది. ఆ విధంగా ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ‘రాజకీయ పందెం కోళ్లు’ మాత్రం అప్పుడే ఓట్ల బరిలోకి దిగాయి. జీడిపప్పు, పిస్తా, బాదంపప్పుతో పందెం కోళ్లు యుద్ధానికి సిద్ధమయితే, రాజకీయ కోళ్లు హామీలు, తాయిలాలు, నిధులు, నినాదాలతో ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కోళ్ల పందేలు, పొట్టేళ్ల పందేలపై జనం దృష్టి పెడితే.. రాజకీయ పార్టీల కోళ్లు మాత్రం కాళ్లకు కత్తులు కట్టుకుని, ఏడాదికి ముందుగానే ఉత్సాహంగా కదన రంగంలోకి దిగుతున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ఏ పార్టీ కోడి ఏం చేస్తుందో, ఎన్నికల నాటికి ‘పుంజు’కునేందుకు చేస్తున్న కసరత్తేమిటో ఓసారి చూడాల్సిందే!

ముందే మేల్కొన్న ‘తెలుగు’ కోడి
నాలుగేళ్లుగా పిస్తా, బాదం, కసరత్తులతో బలిష్టంగా మారిన తెలుగుదేశం పందెం కోడి ఏడాది ముందుగానే ఉత్సాహంగా కూస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికలకు ముందు వరకూ మళ్లీ ఎగరడం సందేహంగానే కనిపించిన ‘తెలుగు’ కోడి.. ఆ బరిలో ప్రత్యర్థి కోడి రెక్కలు విరిచిన తర్వాత నుంచి సమరోత్సాహంతో దుముకుతోంది. నంద్యాల, కాకినాడ బరులు ‘తెలుగు’ కోడిలో రానున్న ఎన్నికలపై భరోసా నింపాయి. తనపై బెట్టింగ్ కట్టి చప్పట్లు కొట్టే వారితో పాటు, నడిపించే నాయకుడు అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడైనందున ‘తెలుగు కోడి’ కయ్యానికి కాలు దువ్వుతోంది. పైగా మూడేళ్ల క్రితం నాటి యుద్ధంలో తనపై గెలిచిన సాటి పందెం కోళ్లలో చాలావరకూ ఇప్పుడు తన వైపే ఉండటంతో ‘తెలుగు కోడి’ మరింత ఉత్సాహంగా కవ్విస్తోంది. కొత్తగా వేస్తున్న పథకాల ఆహారం తనను వచ్చే సంక్రాంతి తర్వాత జరిగే ఎన్నికల్లో బాహుబలిగా నిలబెడుతుందన్న విశ్వాసంతో ముందుకు సాగుతోంది.

కూతలు ఆపి బరిలోకి జనసేన కోడి
జనసేన కోడికి ఈ పందెం పూర్తిగా కొత్త. ఇప్పటిదాకా ఎవరి భుజం మీదనో నిల్చుని కూయడమే తప్ప సొంత బలం నిరూపించుకుంది లేదు. మిగిలిన వారిని బరిలోపి దింపి, తాను చప్పట్లు కొట్టి ప్రోత్సహించే ప్రేక్షక పాత్రకే పరిమితమైన జనసేన కోడి, ఈసారి బరిలోకి దిగేందుకు కాలుదువ్వుతోంది. అందుకే కూతలతో పాటు జనక్షేత్రంలోకి వచ్చిపోతోంది. ఆది నుంచీ అయోమయం నిండిన ఈ కోడి, రానున్న యుద్ధంలో ఎన్ని బరుల్లో నిలుస్తుంది? దాని పోరాట వ్యూహమేమిటో ఇంకా తెలియలేదు. అప్పుడప్పుడూ పొద్దునే్న లేచి కూయడమే తప్ప, సహజసిద్ధంగా రోజూ కూసే అలవాటు లేని జనసేన కోడి ఈసారి తానూ పందెం కోడినవుతానంటోంది. బలమైన పుంజును కాకుండా బలహీనమైన పుంజులతోనే ఇప్పటివరకూ యుద్ధం చేస్తున్న జనసేన కోడి అసలు బలమేమిటో చూడాలి.
ఎగిరీ ఎగరని కమలం కోడి!
అన్ని బరుల్లోనూ ఎగిరి, బలాఢ్యురాలు కావాలన్న కోరిక బాగా ఉన్నా సొంతగా ఎగిరేంత బలం లేని కమలం కోడి ఈసారి కూడా ఎవరో ఒకరి బలంపై ఎక్కువ బరుల్లో దిగాలన్న ఆశతో ఉంది. ఆశ లావు పీక సన్నం మాదిరిగా బక్కపలచగా ఉన్నప్పటికీ పిస్తా, జీడిపప్పు, బాదంపప్పుతో బలంగా ఉన్న పందెం కోళ్లతో తనను తాను ఊహించుకోవడమే కాదు.. బరులు ప్రతిధ్వనించేలా తొడగొట్టి సవాలు చేస్తోంది. ఎగిరీ ఎగరని బలంతో ఉన్న కమలం కోడి కేంద్ర పథకాలనే ఎక్కువగా కూస్తోంది. తన ప్రదర్శనకు చప్పుట్లు కొట్టేవారి సంఖ్య లేకున్నా, బలమైన పుంజులున్నప్పటికీ వాటిని బరిలోకి దిగనీయని ఢిల్లీ యజమాని అయోమయం, అసలు తన పోరాటం ఎలా ఉండాలో తనకే తెలియని గందరగోళంతో బీజేపీ కోడి బరి వైపు ఆశగా చూస్తోంది.

ఖాతా కోసం కాంగ్రెస్ కోడి కష్టాలు!
మూడు పందెం కోళ్లు ఎన్నికల బరిలోకి దిగేందుకు కావలసిన అస్తశ్రస్త్రాలు తమ అమ్ములపొదిలో సమకూర్చుకుంటుండగా, పాపం గత యుద్ధంలో ప్రత్యర్థి కోళ్ల కత్తుల దాడితో క్షతగాత్రురాలయి ఇంకా కోలుకోని కాంగ్రెస్ కోడి, కనీసం ఒక్క బరినయినా సొంతం చేసుకుని ఖాతా తెరవాలన్న ఆరాటంతో ఉంది. కష్టాలకు కేరాఫ్ అడ్రసుగా మారిన తన పోరాటంలో చివరివరకూ నిలిచి, అందులో ఎంతమంది బరిలోకి దిగుతారో తనకే తెలియని అయోమయంలో చిక్కి వుంది. బరిలోకి బలవంతంగా దింపాలనుకున్నా ఒక్క పందెం కోడీ దొరకని దయనీయ స్థితిని ఎదుర్కొంటోంది. తనతో మొన్నటివరకూ ఉన్న బలిష్టమైన కోళ్లన్నీ శత్రు శిబిరాల్లోకి ఎగిరిపోతే, మిగిలిపోయిన బక్కపలచని కోళ్లతోనే యుద్ధానికి సిద్ధమవుతోంది.

పోరాడుతున్న
వైసీపీ కో‘్ఢ’!
చప్పట్లు కొట్టే వారి సంఖ్య తక్కువైనప్పటికీ.. మూడేళ్ల క్రితం తనతో ప్రత్యర్థులపై తొడకొట్టి పోరాడిన సహచర కోళ్లు శత్రు శిబిరానికి ఎగిరిపోయినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహపడకుండా వైసీపీ కోడి తొడగొట్టి పోరాడుతోంది. ప్రత్యర్థి తెలుగుకోడి మాటలు, కూతలకు ఏమాత్రం తీసిపోకుండా కాళ్లకు కత్తులు కట్టుకుని తెలుగు కోడిపై కదనానికి కాలుదువ్వుతోంది. పాదయాత్రలతో అలిసిపోకుండా, అదే ఆయుధంగా ‘పుంజు’కునేందుకు వైసీపీ పందెం కోడి ఎదురుదాడికి సిద్ధమవుతోంది. ఈసారి మరింత శక్తిని కూడగట్టుకుని మూడేళ్ల క్రితం తానోడిన బరిలోనే తెలుగు కోడిని మట్టికరిపించేందుకు కసరత్తు చేస్తోంది. పోరుబాటలో గతంలో చేసిన పొరపాట్లను దొర్లనీయకుండా ఈసారి కొత్త వ్యూహాలతో వైసీపీ కోడి సమాయత్తమవుతోంది.
*
చిత్రం..పెద్దాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కోడి పందాలు