రాష్ట్రీయం

కమిటీ ముగ్గులోకి పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు అధికారాలు, బాధ్యతలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1992 లో చేసిన 73 వ రాజ్యాంగ సవరణను తెలుగు రాష్ట్రాలు అమలు చేయకపోవడంతో గ్రామ పంచాయతీలు బలహీనంగానే కొనసాగుతున్నాయి. పంచాయితీలకు అన్ని అధికారాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వాలు 25 ఏళ్లనుండి చెబుతున్నప్పటికీ, అమలు జరగడం లేదు.
పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పంచాయతీ వ్యవస్థ పటిష్టం కోసం కొన్ని సిఫార్సులు చేసింది. ఈ ఉపసంఘం చేసిన సిఫార్సుల కంటే 73 వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు సంక్రమించాల్సిన అధికారాలే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవంగా కేంద్రం చేసిన చట్టం 1993 ఏప్రిల్ 24 నుండి అన్ని రాష్ట్రాల్లో అమల్లోకి రావాలి. ఇందుకోసం ఆ యా రాష్ట్రప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా తెలుగు రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోలేదు. 1993 తర్వాత ఇప్పటి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం కోసం కొన్ని జీఓలు జారీ చేసినప్పటికీ, అవి అమల్లోకి రాలేదు.
రాజ్యాంగ పరంగా పంచాయతీలకు ఈ అధికారాలన్నీ కట్టబెట్టాల్సి ఉన్నప్పటికీ, పాలనలో ఎవరు ఉన్నప్పటికీ, అధికారాలను ఇవ్వడం లేదు. ఈ అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని గత 25 సంవత్సరాల నుండి పనిచేసిన ముఖ్యమంత్రులు భావిస్తూ వస్తున్నారు.
నిధుల కొరత
గ్రామపంచాయతీలకు నాలుగు రకాలుగా నిధులు లభిస్తాయి. పన్నుల రూపంలో ప్రజల నుండి వసూలు చేసే నిధులు కాకుండా, కేంద్రం సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చే నిధులు, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు (జాతీయ ఉపాధి పథకం తరహా పథకాలు), రాష్ట్ర ఆర్థిక కమిషన్ చేసే సిఫార్సులకు అనుగుణంగా లభించాల్సిన నిధులతో పంచాయతీలు వేర్వేరు పనులు
చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం నుండి నిధులు వస్తున్నాయే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం లేదు. దాంతో సర్పంచ్‌లు ఆందోళనకు గురవుతున్నారు. పంచాయతీ సంస్థల అవసరాలను పరిశీలించి, నిధులు ఏ రకంగా, ఎంత మేరకు ఇవ్వాలో పరిశీలించేందుకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పరిశీలిస్తుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటులో జాప్యం జరిగింది. నిన్న మొన్ననే జి. రాజేశంగౌడ్‌ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించారు. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలు ఇక్కట్లకు గురయ్యాయి.
పంచాయతీలకు నిధులు ఇవ్వాలి
పంచాయతీలను పటిష్టం చేస్తామంటూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండగా కెటిఆర్ ప్రకటించినప్పటికీ, ఆయన హామీ అమల్లోకి రాలేదు. పంచాయతీలకు అధికారాలను ఇవ్వాలంటూ భారత రాజ్యాంగంలో సవరణ చేశారు. అధికారాలను ఇవ్వాల్సిన రాష్ట్రం ఇవ్వలేదు. పంచాయితీలకు కేంద్రం ఇస్తున్న నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. దాంతో పంచాయతీలు నిర్వీర్యం అవుతున్నాయి. మా గ్రామంలో ఏటా పన్నుల రూపంలో 1,20,000 రూపాయలు వస్తున్నాయి. సిబ్బంది వేతనాలకు కూడా ఇవి సరిపోవడం లేదు. నేను 5 ఏళ్లకింద సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కేంద్ర ప్రభుత్వం 14 వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఏడు లక్షల రూపాయలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం తదితర పథకాల కింద చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఆ యా శాఖల అధికారుల నేతృత్వంలోనే జరుగుతున్నాయి తప్ప, స్థానిక సంస్థల ప్రమేయం పెద్దగా ఉండటం లేదు. సర్పంచ్‌లకు గౌరవ వేతనం మాత్రం రాష్ట్రం ఇస్తోంది. గ్రామస్వరాజ్యం రావాలంటే పంచాయితీలకు పూర్తి అధికారాలు ఉండాలి. సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్ష విధానంలో జరగాలి.
కె.మోహన్, సర్పంచ్
తిర్మన్‌పల్లి
నిజామాబాద్ జిల్లా
*
73 వ రాజ్యాంగ సవరణతో రాజ్యాంగంలో 11 వ షెడ్యూల్‌ను (ఆర్టికల్ 243జి)
రూపొందించారు. ఈ షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం పంచాయతీలకు ఇవ్వాల్సిన అధికారాలివి.
*
వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ.
భూ అభివృద్ధి, భూసంస్కరణల అమలు, భూసారపరిరక్షణ.
చిన్ననీటి వనరులు, నీటి యాజమాన్యం, వాటర్‌షెడ్ అభివృద్ధి.
పశుసంవర్థకం, పాడి, కోళ్లపెంపకం.
మత్స్యాభివృద్ధి.
సామాజిక అటవీపెంపకం.
అటవీఉత్పత్తులు.
చిన్నతరహా పరిశ్రమలు, ఆహారపరిశ్రమలు.
ఖాదీ గ్రామీణ పరిశ్రమలు.
గ్రామీణ గృహనిర్మాణం.
తాగునీరు.
గ్రాసం, ఇంధనం.
రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం.
గ్రామీణ విద్యుత్తు, విద్యుత్తు సరఫరా.
ప్రత్యామ్నాయ ఇంధన వనరులు.
పేదరిక నిర్మూలన పథకాలు.
విద్య (ప్రాథమి, సెకండరీ).
సాంకేతిక శిక్షణ, వృత్తివిద్య.
అనియత విద్య, వయోజన విద్య. గ్రంథాలయాలు.
సాంస్కృతిక కార్యక్రమాలు.
మార్కెట్లు, సంతలు.
ఆరోగ్యం, పారిశుద్ధ్యం.
కుటుంబ సంక్షేమం.
మహిళా, శిశుఅభివృద్ధి.
సామాజిక సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం.
ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమం.
రేషన్ దుకాణాలు.
సామాజిక ఆస్తుల నిర్వహణ.