రాష్ట్రీయం

జూదాల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 16: ఏటికేడు కోడిపందాలను నిరోధిస్తామంటూ పోలీసులు చెప్పడం, ఆ తర్వాత న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవటం, చివరకు ఆ మూడురోజులు యధావిధిగా జూదాల జాతర జరిగిపోవటం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆనవాయితీగా మారిపోయింది. ఇది చివరకు సంప్రదాయంగా కూడా పేరొందేసింది. మొత్తంమీద ఈ వ్యవహారాలన్నీ పశ్చిమగోదావరి జిల్లా అంటే కోడిపందేలు, పేకాట, గుండాట వంటివి సంస్కృతి, సంప్రదాయాలుగా విలసిల్లే ప్రాంతమనే పరిస్థితిని తీసుకువచ్చేసింది. ఇక్కడ పుట్టిన సారస్వతం, ఇతర వ్యవహారాలు ప్రస్తావనకే రాకపోతుండగా ఇప్పటి పరిస్థితులు చూసుకుంటే అందరూ కలిసి ఒక జూదవిశ్వవిద్యాలయాన్ని ఆవిష్కరించినట్లుగా ఈ మూడురోజుల పరిణామాలు కన్పిస్తున్నాయి. ఒకతరం పందాలు వేసివేసి రిటైరైపోతుంటే వారే కొత్త తరాన్ని కూడా తయారుచేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్ పందేగాళ్లు ఈసారి కోతాట, గుండాట వంటి వ్యవహారాల్లో మంచి ఉత్సాహంగా పాల్గొనడం గమనార్హం. ఆరకంగా భవిష్యత్‌కు ఇబ్బంది లేకుండా కొత్తతరం పందేగాళ్లు కూడా ఇక్కడ తయారైపోతున్నారు. దాదాపుగా ఎక్కడ బరి చూసినా అక్కడ చిన్నారుల సంఖ్య అధికంగానే కన్పించింది. మరోవైపు పిల్లలకు కోడిపందాలు చూపేందుకు ఈసారి కుటుంబాలతో సహా పెద్దఎత్తున విహారానికి రావటం విశేషంగానే చెప్పుకోవాలి. ఆ అంశాన్ని అలాఉంచితే ఈ మూడురోజులు పందేగాళ్లు పూర్తిస్థాయిలో చెలరేగిపోయారు. ఎక్కడెక్కడి నగదో ఇక్కడొచ్చి వాలిపోయింది. అది పేకాటలో పోనీ, కోడిపందాల్లో కోల్పోని, లేదా వాటిలో గెలవని ఏదైనా నగదు మాత్రం కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో దర్శనమిచ్చింది. ఇదే సమయంలో పండుగ ఖర్చులకు ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కుటుంబ సంఖ్య ఈనెల మొదటినుంచి అలాగే ఉంది. పందేలకు మాత్రం ఎక్కడా నగదు కొరత రాకపోవటం ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. అయితే జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా కోడిపందేలు నిర్వహించే వెంపలో మాత్రం పోలీసులు వీటిని అడ్డుకోగలగటం ఒకరకంగా
విజయమనే చెప్పుకోవాలి. ఇక ప్రముఖుల హాజరుకు కొదవలేదు. ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి, సినీనటులు సుబ్బరాజు, శ్రవణ్ రాఘవ తదితరులు ఈసారి పోటీలను వీక్షించేందుకు తరలివచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏప్రాంతం చూసినా పందెగాళ్ల నోట ‘ఆదుర్సు’ అన్న మాట నినాదంగా మారింది. ఈసారి కూడా జిల్లా పందాల స్వర్గంగా, జూదాల స్వర్గ్ధామంగా మారిపోయింది. పోలీసు ప్రకటనలన్నీ మరోసారి తూచ్‌గా మారిపోగా ఈసారి కూడా పందెగాళ్లదే రాజ్యంగా మారింది. పందెం కోడి ముందు లాఠీ పవర్ వీగిపోయింది. జిల్లా జూదాలకు స్వర్గ్ధామంగా మారిపోతోందనడానికి ఈ ఏడాది కోడిపందేలు, పేకాట పందేలను చూస్తే అర్ధమవుతుంది. జిల్లాలో సంప్రదాయం పేరుతో నిర్వహించే కోడిపందేలు వ్యవస్థీకృతంగా మారిపోతున్నాయన్న వాదనకు ఈసారి పందాలు అద్దంపడుతున్నాయి. గంటల వ్యవధిలో పందాలకు ఏర్పాట్లు చేసేసి వందల సంఖ్యలో పందెగాళ్లను రప్పించేసి అదేసమయంలో పేకాట, గుండాట, కోతాట ఇలా రకరకాల జూదాలకు వేదికలు ఏర్పాటుచేసి ఒక్కసారిగా జిల్లా మొత్తం సోమవారం ఉదయానికి జూదగోదావరిగా మార్చేశారు. అడ్డూ అదుపు లేకుండా ఆడటం అంటే ఎక్కడో దూరంగా పొలాల మధ్యలో బరులు ఏర్పాటుచేసుకోవటం కాకుండా రహదారి పక్కనే, ప్రధాన సెంటర్లకు దగ్గరలోనే ఇటువంటి బరులు ఏర్పాటుచేసుకోవటం, వాటికి మించి పేకాట శిబిరాలను జోరుగా నిర్వహించటం జరిగిపోయింది. ఏ దశలోనూ పందెగాళ్లు బరుల వద్దకు వచ్చేందుకు కొంచెం కూడా కష్టపడకుండా అన్నిచోట్ల అందుబాటులోనే వీటిని ఏర్పాటుచేశారు. పోలీసు భయం లేకపోవటంతో మరింత సుఖంగా, మరింత అనాయాసంగా ఈ పందాల జాతర సాగిపోయింది. మెట్ట, డెల్టా అన్న తేడా లేకుండా పల్లెపల్లెన ఈసారి పందాల బరులు ఏర్పడటం విశేషం. అదే జోరు మంగళవారం రాత్రి వరకు సాగిపోయింది. ఈమధ్యలో ఎక్కడా పోలీసు ప్రస్తావనగాని, ఖాకీల జాడ గాని లేకపోవటం ఈసారి విచిత్రంగానే కనిపించింది. గతానికి భిన్నంగా అంతా అపేస్తామని ముందు ఉత్తరకుమార ప్రగల్భాలు పలికినా చివరకు ఆ మూడురోజులు గతానికి భిన్నంగానే అడ్డూ అదుపు లేకుండా అడ్డంగా ఆడేసుకునేందుకు జిల్లాను పందెగాళ్లకు వదిలేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ మూడురోజుల్లోనూ తొలిరోజు కొంత మందకొడిగా ప్రారంభమైనా మిగిలిన రెండురోజులు మాత్రం పూర్తిగా పందెగాళ్లదే రాజ్యమైపోయింది. కత్తులు కట్టేదిలేదని, సంప్రదాయ పందాలంటూ నాయకుల నోట మాటలు విన్పించినా ఆ పరిస్థితి ఒక్క బరిలో కూడా లేదంటే ఆతిశయోక్తి కాదు. మరోవిధంగా చూస్తే ఎక్కడికక్కడ సాగిన కోడిపందేలు ‘పర్యాటకుల’ను కూడా భారీగానే అలరించాయని చెప్పుకోవాలి. ఎక్కడెక్కడి సొమ్మో ఇక్కడి కోడిపందాల బరుల్లో హారతికర్పూరం అయిపోయింది. ఈ మొత్తం ప్రాధమిక అంచనాల ప్రకారమే వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు. పందాలకు మించి ఆ వేదికను ఆధారం చేసుకుని వెలిసిన పేకాట శిబిరాలు మాత్రం పూర్తిస్థాయిలో కళకళలాడిపోయాయి. కొన్ని బరుల వద్ద కోడిపందేల దగ్గర కన్నా పేకాట శిబిరాల వద్ద అధికసంఖ్యలో జూదగాళ్లు చేరారంటే అతిశయోక్తి కాదు. వీటితోపాటు గుండాట, కోతాట కూడా జనాన్ని పూర్తిస్థాయిలో అలరించాయి. ఈమూడింటిలోనే పందేలకు మించి సొమ్ము చేతులు మారిందని భావిస్తున్నారు. ఏడాదికాలం సంపాదించినంతా పోగొట్టుకున్నవారు కొందరైతే, మూడురోజుల్లో లక్షాధికారులు అయినవారు మరికొంతమంది. ఇక వీటితోపాటు యధాప్రకారం ఉండాల్సిన బిర్యానీ పాయింట్లు, బెల్టుషాపులకు కొదవేలేకుండా పోయింది. మొత్తంగా చూస్తే ఈసారి ఆ మూడురోజులు జరుగుతాయా, జరగవా అన్న అనుమానాలను సృష్టించిన ఆ పరిస్థితులు ఒక్కసారిగా మాయమైపోయి జూదాలకు స్వర్గ్ధామంగా జిల్లా మారిపోయిందనే చెప్పుకోవాలి. ఇదేవిధంగా ఈసారి కూడా పలు పెద్ద పందాలు జరిగిన ప్రాంతాల్లో మహిళల హడావిడి అధికంగానే ఉంది. పురుషులతో సమాన హక్కులు కావాలంటూ పోరాడే మహిళలు పందెం బరుల్లో మాత్రం కొన్నిచోట్ల ఆ హక్కును సాధించుకున్నట్లే కనిపిస్తోంది. ఇక పందాలను పూర్తిస్థాయిలో వ్యతిరేకించే మహిళా సంఘాలకు జిల్లాలో కొదవలేకపోగా పందాలు ఆడే మహిళల విషయంలోనూ అదే పరిస్థితి ఎదురుకావటం విచిత్రం. కొంతమంది మహిళలు లక్ష రూపాయలను ఒక్కొ పందెంపై సునాయాసంగా కాస్తూ గెల్చినా, ఓడినా అదే చిరునవ్వుతో మరో పందెం వైపు వెళ్లిపోవటం అలవాటు అయిన పందెగాళ్లను కూడా ఆశ్చర్యపరిచింది. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది కేవలం తమ జూదాల సరదాను పూర్తిస్థాయిలో నెరవేర్చుకునేందుకే జిల్లాను వినియోగించుకున్నట్లు కన్పించింది. దీంతో అందరూ ఈ పోటీలో విజేతలుగానే నిలిచారు. అటు పందెగాళ్లు, ఇటు రాజకీయనాయకులు కూడా తాము అనుకున్నది సాధించి విజయపతాకను ఎగురువేయగలిగారు. అయితే పందెం బరులు మాత్రం నెత్తురోడుతున్న కోళ్లతోను, తెగిపడ్డ రూల్స్‌తోను తడిసిపోయాయి.