రాష్ట్రీయం

ఆదివాసీల సంబురం.. ఆధ్యాత్మిక వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,జనవరి 16: పుష్యమాస అమావాస్య ను పురస్కరించుకొని ఆదివాసీ అడవి బిడ్డలు అత్యంత వైభవంగా జరుపుకునే కెస్లాపూర్ నాగోబా జాతర మంగళవారం రాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో ప్రారంభమైంది. ఆదివాసీ గిరిజనులు ముఖ్యంగా మెస్రం వంశీయులు తమ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నాగోబా సన్నిదిలో పవిత్ర గోదావరి జలాలతో మూలవిరాట్‌ను అభిషేకించి ఆలయ పూజారి (కటోడి) అధ్వర్యంలో ఆచార వ్యవహారాలతో పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే గల చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర నుండి వేలాది మంది గిరిజనులు భక్తిపారవశ్యంతో నాగోబా సన్నిదికి చేరుకొని గుడారాలు వేసుకొని మర్రిచెట్టు నీడన బస చేశారు. ఆదివాసీ పూజక్రతువులో భాగంగా నాగోబా ఆలయం వెనక గత సంవత్సరం మట్టితో తయారు చేసిన పాత పుట్టలను తొలగించి మెస్రం ఆడపడుచులు, అళ్ళుల్లు కొత్త పుట్టలు తయారు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పుట్టనుంచి సేకరించిన మట్టితో ఏడు దేవతల ప్రతిమలు తయారుచేసి ఆలయంలో సతి దేవతగా కొలుస్తూ పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయాలు, ఆదివాసీల ఆచార వ్యవహారాలు ఉట్టిపడే రీతిలో మంగళవాయిద్యాల నడమ మెస్రం వంశీయు లు గోవాడలో విడిదికి దిగారు.
అక్కడ 22 పొయ్యిలను ఏర్పాటు చేసి ప్రత్యేక వంటకాలు తయారు చేశారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన మెస్రం వంశీయులు, కొత్తకోడళ్ళ రాకతో ఆలయ ప్రాంగణం కొలాహలంగా మారింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఆదివాసీలు పరస్పరం ఆత్మీయ పలకరింపులతో కుశలప్రశ్నలు వేసుకొని తన్మయత్వంతో మైమర్చిపోయారు. రాత్రి 10.30 గంటల తర్వాత పవిత్ర గోదావరి జలాలతో నాగోబాకు అభిషేక పూజలు నిర్వహించడంతో జాతర మహోత్సవం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే జిల్లా కలెక్టర్ డి.దివ్య, ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఐ ఏ ఎస్ అధికారులు గోపి, అనురాగ్ జయంతి అధ్వర్యంలో భారీ ఏర్పాట్లు నిర్వహించగా, ప్రభుత్వ శాఖల పథకాలను తెలియజేసేందుకు భారీ స్టాళ్ళు, గిరిజన సంస్కృతికి అద్దంపట్టే విధంగా పురాతన వస్తువుల ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు. కాగా జాతర తొలి రోజు జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఐటిడి ఏ అధికారులు ఆదివాసీ గిరిజనులతో మమేకం అవుతూ క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈనెల 22 వరకు కొనసాగే కెస్లాపూర్ నాగోబా జాతరను ప్రభుత్వం అధికారిక పండగగా ఏర్పాట్లు గావిస్తుండగా 19న ఆలయ ప్రాంగణంలో దర్బార్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భారీ బందోబస్తు
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్న డిమాండ్‌తో ఆదివాసీ గిరిజనులు అందోళన సాగిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలపై జిల్లా పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారాయి. ఇప్పటికే ఇంటర్నెట్ వ్యవస్థను పూర్తిస్థాయిలో నిలిపివేయగా జాతరపై నిఘా కట్టుదిట్టం చేశారు. 19న జరిగే గిరిజన దర్బార్‌కు లంబాడా ప్రజా ప్రతినిధులు, శాసన సభ్యులు, మంత్రులు హాజరుకావద్దని ఆదివాసీ సంఘాలు తీర్మానించడంతో బందోబస్తు మరిం త ముమ్మరం చేశారు. 700 మంది పోలీసు బలగాలను తొలిరోజు రంగంలోకి దించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆసాధారణ రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ విష్ణు వివరించారు.

చిత్రం..అడవి బిడ్డలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే కెస్లాపూర్ నాగోబా జాతరను ప్రారంభిస్తున్న మెస్రం వంశీయులు