రాష్ట్రీయం

ఉపాధి వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 17: రాబోయే దశాబ్ద కాలంలోపు రాష్ట్రంలో యువతకు ఐటీ రంగంలో 10లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ‘హైదరాబాద్‌తో ఒక సైబరాబాద్‌ను కోల్పోయాం. అందుకే నాలుగు సైబరాబాదులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురంలో నాలుగు ఐటీ క్లస్టర్లు రాబోతున్నాయి. సైబరాబాద్ పేరు చెబితే మైక్రోసాఫ్ట్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు తిరుపతి పేరు చెబితే జోహో గుర్తుకొస్తుంది. యువకులు ముందు చిన్న కంపెనీలో చేరి అనుభవం సంపాదించుకోవాలి’ అని ఆయన సూచించారు. కష్టపడి నిర్మించుకున్న రాజధాని సైబరాబాద్ పోయిందన్న బాధ ఉందని, అందుకే అంతకు మించి అభివృద్ధి
సాధించాలన్న కసితో పనిచేస్తున్నామని లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 13 ఐటీ కంపెనీలను ఎన్‌ఆర్టీ టెక్ పార్కులో, మూడు ఐటీ కంపెనీలను పైకార్ ఐటీ పార్క్‌లో లోకేష్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఎంతో కష్టపడి నిర్మించిన సైబరాబాద్ నగరం రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రాంతంలో భాగమైందన్నారు. ఒక్క సైబరాబాద్ టవర్ వల్ల హైదరాబాద్‌లో ఐటీలో ఎకో సిస్టమ్ ఏర్పడి 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేలా అభివృద్ధి జరిగిందన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో లక్ష మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఒకపక్క బాధ ఉన్నా ఇంకోపక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కసిగా పనిచేస్తున్నామన్నారు. ఏ రాజధానికైనా సామాజికపరమైన భద్రత అవసరమన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కన్నా అత్యుత్తమమైన రాజధానిని అమరావతిలో నిర్మించుకోబోతున్నామని లోకేష్ అన్నారు. మంగళగిరిలో మొదట్లో ఒకే ఒక ఐటీ కంపెనీ ఉంటే ఇప్పటికి 25 ప్రముఖ ఐటీ కంపెనీలు ఈ మూడున్నరేళ్లలో వచ్చాయన్నారు. విశాఖ నుంచి అనంతపురం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ‘ఆంధ్రా వ్యాలీ’ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రాబోయే కాలంలో అమరావతి డేటా సెంటర్ హబ్‌కు ప్రధాన కేంద్రం కానుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం, అనంతపురం, అమరావతి, తిరుపతిలలో ప్రముఖ ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐటీకి సంబంధించి ఒక అద్భుతమైన ఎకో సిస్టం అవసరమని, అప్పుడే ప్రముఖ కంపెనీలు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలుగు యువత ఎంతో అద్భుతమైన ప్రతిభ కలిగినవారని, వారి ప్రతిభను ఉపయోగించుకునేలా రాష్ట్రంలో ఐటీ కంపెనీలను ప్రారంభించమని నిర్వాహకులను కోరానన్నారు. రాష్ట్రంలో యువత ఐటీ డిగ్రీలతో ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదని, అవి రాజధాని అమరావతికే వస్తున్నాయన్నారు. ఐటీ కంపెనీల ద్వారా వచ్చిన అవకాశాలను రాష్ట్ర యువత అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి 54 ఐటీ కంపెనీలు వచ్చాయని, వీటిద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించామని మంత్రి లోకేష్ తెలిపారు.
* లోకేష్ చొరవతో కంపెనీల క్యూ:కొల్లు
క్రీడలు, న్యాయ వ్యవహారాలు, ఎన్‌ఆర్‌ఐ సాధికారత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రానికి పెద్దసంఖ్యలో ప్రముఖ ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. తెలుగు యువతలో అపారమైన తెలివితేటలు ఉన్నాయని, వారికి సరైన శిక్షణ ఇస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఐటీ రంగం ప్రగతి సాధిస్తోందన్నారు. ఒకేసారి 16 ఐటీ కంపెనీలను ప్రారంభించే కార్యక్రమం ఏర్పాటు చేయడం చెప్పుకోదగ్గ విషయమన్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చర్యలు తీసుకున్నారన్నారు. మంత్రి నారా లోకేష్ ఏ చిన్న కంపెనీ అయినా ఇక్కడ స్థాపించేందుకు ముందుకొచ్చే వారితో భేటీ అవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ప్రారంభించేవారికి ప్రభుత్వం 50 శాతం రెంటల్ ఖర్చు భరిస్తోందని తెలిపారు. డీజీపీ మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేలా ప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. సంపద సృష్టించే వారికి సహకరించాల్సిన అవసరం ఉందని, శాంతిభద్రతల విషయమై తప్పక తమవంతు సహకరిస్తామన్నారు. ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో సాంబశివరావు స్వాగతోపన్యాసమిస్తూ విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు ఐటీ వ్యాలీని రూపొందించేలా ఒక మిషన్‌తో ముందుకు వెళుతున్నామన్నారు. రెండు విధాన లక్ష్యాలతో పనిచేస్తున్నామని, అందులో ఒకటి డీటీపీ (డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు) అని, దీని ప్రకారం ఐటీ కంపెనీలకు అవసరమైన స్పేస్, తదితర సదుపాయాలు కల్పించటం కాగా, రెండోది ఐటీ కంపెనీలకు అవసరమైన శిక్షణ కలిగిన మానవ వనరులను అందించటమని తెలిపారు. రాజధాని అమరావతిలో సెమీ కండక్టర్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
* రెండు అవగాహన ఒప్పందాలు
అనంతరం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐటీ కంపెనీలతో రెండు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను మంత్రి చేతులమీదుగా అందించారు. 16 ఐటీ కంపెనీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రాజేంద్రప్రసాద్, జెఎన్‌టీయూ వైస్ చాన్సలర్ ఏఎస్‌ఎస్ కుమార్, వివిధ ఐటీ కంపెనీల యజమానులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్రం..మంగళగిరిలో ఐటీ కంపెనీల ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తున్న మంత్రి నారా లోకేష్