రాష్ట్రీయం

సహకరిస్తే అభివృద్ధి పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర సంబంధాలు బలోపేతం చేసేందుకు ‘నీతి ఆయోగ్’ ముఖ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి నీతి ఆయోగ్ మరింత సహకరించాలని కోరారు. ఉండవల్లిలోని తన నివాసం సమీపంలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశానికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ హాజరు కాగా, ముఖ్యమంత్రి ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టామని ఈ సందర్భంగా వివరించారు. నీతి ఆయోగ్ సహకరిస్తే మరింత శ్రమిస్తామన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు, అభ్యాసాలు దేశమంతా అమలు చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేయడం తమకు గర్వకారణమన్నారు. రాజధాని లేకున్నా, సౌకర్యాలు లేకున్నా కష్టమో, నష్టమో సొంత రాష్ట్రం నుంచే పాలన సాగించాలని పట్టుదలగా పనిచేశామని చెప్పారు. 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచార ఉద్యమాలు, కుటుంబ వికాసం, సమాజ వికాసం ఇండికేటర్లు తీసుకుని అభివృద్ధి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు నీతి ఆయోగ్ సహకారం కావాలని రాజీవ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కోరారు. అలాగే ప్రస్తుతం ఐదంచెలగా ఉన్న స్థానిక పాలనా వ్యవస్థలో మార్పులు అవసరమని, రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఎంపీటీసీ, జట్పీటీసీ వ్యవస్థ వల్ల పాలనలో ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదన్న చంద్రబాబు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకురావడంలో నీతి ఆయోగ్ చొరవ చూపాలని కోరారు.
మళ్లీ మళ్లీ విజయవాడ వస్తా: రాజీవ్‌కుమార్
జాతీయస్థాయి లక్ష్యాలపై ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్ సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు. 2022నాటికి ఆరోగ్యం, పరిశుభ్రత, నైపుణ్యం, సురక్షిత భారతదేశాన్ని నిర్మించాలని, 2047 నాటికి సర్వ శ్రేష్ఠ భారత్, జగద్గురు భారత్ సాధించాలనేది ధ్యేయమని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దేశాన్ని వృద్ధి పథంలో నడపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రస్థానం సాగుతోందని అన్నారు. ఆర్థిక వృద్ధి ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, పేదరిక నిర్మూలన ఇంకా జరగాల్సి ఉందని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని అన్నా రు. ఈ లక్ష్యాల సాధనలో
ఆంధ్రప్రదేశ్ ముందుండాలని రాజీవ్‌కుమార్ ఆకాంక్షించారు. ‘పేదరికం లేని, అవినీతి లేని భారత్’ను సాధించాలి, అందుకు ఏపీ వంటి రాష్ట్రాలు పూర్తిగా సహకరిస్తాయని భావిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి కృష్ణానదిని చూశానని,అద్భుతంగా అనిపించిందని చెప్పారు. మళ్లీ మళ్లీ తాను విజయవాడ వస్తానని వెల్లడించారు. ప్రణాళిక సంఘంతో నీతి ఆయోగ్‌కు ఎలాంటి పోలిక లేదని, రాష్ట్రాల అభివృద్ధి కోసమే నీతిఆయోగ్ పనిచేస్తోందన్నారు.టీమిండియాలా పనిచేయాలన్నదే నీతి ఆయోగ్ ఉద్దేశమని చెప్పారు. దేశాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా నీతి ఆయోగ్ పనిచేస్తోందని, గతంలో కేంద్రీకృతమైన నిధుల పంపిణీలో మార్పులు తెచ్చామని చెప్పారు.
కీలక సమస్యలపై దృష్టి పెడదాం: కేఈ కృష్ణమూర్తి
కలెక్టర్ల సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ‘మీ భవితకు నేను బావుటానవుతా’ నంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి లేఖ రాయడం ప్రభుత్వ ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేసిందని అన్నారు. నూరు శాతం ఓడీఎఫ్ సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రజలంతా సహకరించాలని కోరారు. ప్రతి రంగంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో గత మూడున్నర సంవత్సరాలుగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. జాతీయ స్థాయిలో అవార్డులు పొందామని కేఈ అన్నారు. జాతీయస్థాయిలో 170 శాఖలు పోటీపడగా అందులో మన రిజిస్ట్రేషన్ శాఖ ‘అవార్డ్ ఆఫ్ అప్రిషియేషన్’ దక్కించుకుందని చెప్పారు.
చుక్కల భూమి సమస్యకు పరిష్కారం చూపెట్టమని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టంలో సవరణలు చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని కేఈ వెల్లడించారు. నాలా చట్టంలో సవరణ చేసి భూమార్పిడి ఛార్జీలు తగ్గించామని చెప్పారు. సర్వే శాఖలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. గత మూడున్నరేళ్లుగా పేదవారికి జరిపిన ప్రభుత్వ భూకేటాయింపులపై జిల్లా కలెక్టర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కేఈ సూచించారు. అర్హులైన పేదవారిని, అందుబాటులో ఉన్న భూ వివరాలను జిల్లాల వారీగా రూపొందించాలని చెప్పారు.
విజయవంతంగా ‘2017-18’: ప్రధాన కార్యదర్శి
రెండు రోజులపాటు జరిగే కలెక్టర్ల సమావేశంలో ముందుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీటా స్వాగతోపన్యాసం చేయగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ 2017-18 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన కీ అచీవ్‌మెంట్స్‌ను వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు విద్యుత్, గ్యాస్ వంద శాతం అందించామని, అన్ని పట్టణ ప్రాంతాల్లో నూరు శాతం ఓడీఎఫ్ అమలు చేశామని, గ్రామాల్లో మార్చి నాటికి నూరు శాతం ఓడీఎఫ్ సాధిస్తామని చెప్పారు. 46.2లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని, 22.4 లక్షల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించిన రాష్ట్రంగా గుర్తింపు సొంతం చేసుకున్నామని దినేష్‌కుమార్ వెల్లడించారు.
‘ఇ-ప్రగతి కోర్ ప్లాట్‌ఫామ్’
‘ఇ-ప్రగతి కోర్ ప్లాట్‌ఫామ్’ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కోర్ ప్లాట్‌ఫామ్ తన చిరకాల వాంఛ అని, అది ఈరోజు నెరవేరిందని ముఖ్యమంత్రి అన్నారు. ఇంతవరకు ఏ శాఖకు ఆ శాఖ స్వతంత్రంగా ఇ-ప్రగతి పోర్టల్స్‌ను నిర్వహించుకున్నాయని, ఇక నుంచి ‘ఇ-ప్రగతి కోర్ ప్లాట్‌ఫామ్’ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపైకి తీసుకువచ్చామని వివరించారు. ఇది ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా పనిచేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

చిత్రం..కలెక్టర్ల సదస్సులో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు