రాష్ట్రీయం

మత్స్య సంపదకు కాలుష్యం కాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 19: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు పెను ముప్పు పొంచి ఉంది. ఒకప్పుడు ఇక్కడి తీరంలో మత్స్య సంపద భారీగా ఉండేది. ఒడిశా నుంచి మత్స్యకారులు ఇక్కడికి వచ్చి వేట సాగించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సముద్ర జలాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగినా, దాన్ని అరికట్టడంలో మత్స్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోపోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. నిజాంటప్నం నుంచి భావనపాడు వరకూ ఉన్న సముద్ర తీరంలో ఎక్కడా చేపలు లభ్యం కావడం లేదు. దీనికితోడు డీజిల్ ధరలు పెరిగిపోవడంతో వేటకు వెళ్లిన బోట్లన్నీ నష్టాలతో తిరిగి వస్తున్నాయి. చేదాటిన ఈ పరిస్థితుల వలన సుమారు 10 లక్షల మంది మత్స్యకారులు వీధిన పడే ప్రమాదం దగ్గరలోనే ఉందని చెప్పచ్చు.
విశాఖ, కాకినాడ, శ్రీకాకుళం, భావనపాడు తీరంలో కాలుష్యం జోరు పెరగడంతో ఇక్కడి సముద్ర జలాల్లో మత్స్య సంపద వేరే ప్రాంతానికి తరలిపోతోంది. కాలుష్య జలాల్లో చేపలు మరణిస్తున్నాయి. మత్స్య సంపద తరిగిపోవడంపై సంబంధిత శాఖ అధికారులు అధ్యయనం చేయడం లేదు.
చేపల వేటపై నెలరోజుల నిషేధం తరువాత గత జూన్ నుంచి మత్స్యకారులు తిరిగి వేట ప్రారంభించారు. తొలి రోజు నుంచే వీరు నష్టాలను చవి చూస్తూ వస్తున్నారు. విశాఖ తీరంలో చేపలు, రొయ్యలు లభించనందున వీరు వేట కోసం ఒడిశా వెళ్లాల్సి వస్తోంది. విశాఖ నుంచి ఒడిశా వెళ్లి, రావడానికి 400 లీటర్ల డీజిల్ కావాలి. డీజిల్‌ను లీటరు 67 రూపాయల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోంది. డీజిల్‌తోపాటు, వేటకు వెళ్లే మత్స్యకారులకు రేషన్, ఐస్ వగైరాలను పూర్తి స్థాయిలో నింపాలంటే, ఒక్కో బోటుకు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చవుతోంది. ఇలా వెళ్లిన బోటు 15 నుంచి 18 రోజులపాటు వేట సాగించి తిరిగి వస్తుంది. జూలై నుంచి వేటకు వెళ్లి తిరిగి వచ్చిన బోటులో చేపలు, రొయ్యలు ఏమాత్రం దొరకడం లేదు. దీంతో
ఒక్కో బోటుకు 40 నుంచి 80 వేల రూపాయల వరకూ నష్టం వస్తోంది. వేటకు వెళ్లినా ప్రయోజనం లేదని భావించిన వారంతా బోట్లను ఫిషింగ్ హార్బర్‌లోనే కట్టేశారు. ఇదే పరిస్థితి కాకినాడ, నిజాంపట్నం, భావనపాడు, నెల్లూరు పరిసరాల్లో నెలకొందని విశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేభ్ అధ్యక్షుడు సిహెచ్.సత్యనారాయణమూర్తి చెప్పారు. విశాఖ నుంచి 700 బోట్లు వేటకు వెళ్లేవి. నష్టాల కారణంగా 80 శాతం బోట్లు నిలిచిపోయాయి. బోటు యజమానులు అప్పుల్లో కూరుకుపోయారు.
వేటకు వెళ్లే బోట్లకు అవసరమైన డీజిల్‌కు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ప్రభుత్వ అనాలోచిత విధానాల వలన సబ్సిడీ మంజూరులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. తొమ్మిదవ ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉన్నప్పుడు లీటరు డీజిల్ ధర 34 రూపాయలు ఉండేది. అప్పట్లో లీటరుకు ఆరు రూపాయల మూడు పైసలు సబ్సిడీ ఉండేది. 2002 మార్చి 31లోపు కొనుగోలు చేసిన బోట్లకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిసుంది. ఆ తరువాత కొన్న బోట్లకు ఎటువంటి సబ్సిడీ లేదు. విశాఖలో 700 బోట్లు ఉంటే, అందులో 340 బోట్లకే సబ్సిడీ లభిస్తోంది. పోనీ పాత బోట్లకైనా సబ్సిడీ సక్రమంగా లభిస్తోందా? అంటే అదీ లేదు. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర 67 రూపాయలకు చేరుకున్నా, ఇస్తున్న సబ్సిడీ మాత్రం ఆరు రూపాయల మూడు పైసలు మాత్రమే. ఒక్కో సబ్సిడీ బోటుకు నెలకు 3000 లీటర్లు మాత్రమే డీజిల్ ఇస్తుంది. ఆ తరువాత సబ్సిడీ లభించదు. పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సబ్సిడీని పెంచాలని మత్స్యకారులు కేంద్రాన్ని డిమాండ్ చేసినప్పుడు, సబ్సిడీ భారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం స్పందించలేదు. ఈ ప్రతికూల పరిస్థితులన్నీ మత్స్యకారులకు శరాఘాతంగా మారాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న మత్స్యకారులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

చిత్రం..విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో నిలిచిపోయిన బోట్లు