రాష్ట్రీయం

పునర్విభజనపై సానుకూలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 20: నియోజకవర్గ పునర్విభజపై కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ సహచరులకు వెల్లడించారు. కోళ్ల పందేల నిర్వహణలో పాల్గొని కొంతమంది పార్టీ నేతలు పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ధ్వంసం చేశామన్న రీతిలో కేసీఆర్ మాట్లాడటం సరైంది కాదని, మనం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. శనివారం నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతల పనితీరు, జన్మభూమి నిర్వహణ, భవిష్యత్తు కార్యాచరణ అంశాలపై మాట్లాడారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల జరిగిన సంక్రాంతి కోడి పందేల సందర్భంలో పార్టీ నేతలే బరులు కట్టి నిర్వహించిన వైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను సంప్రదాయం ప్రకారం కోళ్లకు కత్తులు కట్టకుండా నిర్వహించుకోమని చెబితే, కొంతమంది వాటిని కాదని బరులే నిర్వహించడం వల్ల పార్టీ పరువు పోయింది అని వ్యాఖ్యానించారు. కోళ్ల పందేల నిర్వహణపై మీరు ఆగ్రహం వ్యక్తం చేశారన్న విషయం బయటకు వెళ్లాలని ఓ నేత సూచించారు. కాగా నియోజకవర్గ పునర్విభజనపై కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయని వెల్లడించారు. గతంలో కంటే ఇప్పుడు కేంద్ర వైఖరిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తాను ప్రధానితో భేటీ తర్వాత కూడా చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం, అలాంటి వాతావరణం కనిపించిందని బాబు విశే్లషించారు. విభజన హామీలు అమలుచేయకపోతే కోర్టుకు వెళతానని, నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై మీడియా కొంచెం అతిగా ఫోకస్ చేసినట్లు కనిపించిందని, సహజ హక్కును వినియోగించుకోవడం తప్పెలా అవుతుందన్న కోణంలోనే
తాను మాట్లాడితే, దానికేదో కలర్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరిష్టం వచ్చినట్లు ఎవరి అజెండాతో వాళ్లు ఊహించుకుని రాసుకుంటున్నారు.. అలాంటి వాటికి విశ్వసనీయత ఉండదని వ్యాఖ్యానించారు.
కాగా వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనమే అధికారంలోకి వస్తామన్న దానిలో ఎలాంటి సందేహం లేదని, అయితే మెజారిటీనే ముఖ్యమని బాబు స్పష్టం చేశారు. దానికోసం ఇప్పటినుంచే నియోజకవర్గాల్లో పార్టీని పటిష్ఠం చేసుకోవాలని, ప్రజలతో మరింతగా మమేకం కావాలని ఆదేశించారు. ‘ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నాలుగేళ్ల మన కష్టంతో పార్టీకి పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. దాన్ని మనం సొంతం చేసుకోవాలి. జన్మభూమిలో ఎలాంటి గొడవలు లేకపోవడమే దానికి నిదర్శనం’ అని విశే్లషించారు.
జగన్‌కు ప్రజల్లో సానుకూలత లేదని, అతనే చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడన్నారు. జన్మభూమి కార్యక్రమం బ్రహ్మాండంగా చేశారని, పార్టీ శ్రేణుల భాగస్వామ్యం బాగా కనిపించిందని అభినందించారు. ఇదే స్ఫూర్తి అన్ని ప్రభుత్వ-పార్టీ కార్యక్రమాల్లో కొనసాగించాలని సూచించారు.
కాగా పార్లమెంటు ఇన్చార్జి మంత్రుల పనితీరుపై బాబు మరోసారి పెదవి విరిచారు. మిమ్మల్ని పార్లమెంటు ఇనార్జులుగా నియమించిన విషయాన్ని కలెక్టర్లకు చెప్పానని, మీరంతా కలసి సమస్యల పరిష్కారంతోపాటు, రాజకీయపరమైన అంశాల్లో సమన్వయం చేసుకుని ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాస్ పార్టీలో చేరికల అంశాన్ని ప్రస్తావించారు. వైసీపీ, కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిపై ఎలాంటి వైఖరి తీసుకోవాలో చెప్పాలని కోరారు. అందుకు స్పందించిన బాబు.. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ, కొత్తవారిని పార్టీలో తీసుకోవాలని తాను గతంలోనే చెప్పానని, అదే విధానం అనుసరించాలని సూచించారు.
అంతకంటే ముందు.. మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల కాలంలో చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ప్రస్తావించారు. వాటిని పార్టీ నేతలు కింది స్థాయి నుంచి ఖండించి, ఎదురుదాడి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘వాళ్లు మరీ పచ్చి అబద్ధాలు మనమీద ప్రచారం చేస్తున్నారు. దాన్ని మనం ఎప్పటికప్పుడు గట్టిగా ఖండించాలి. వ్యవసాయం, ఇరిగేషన్‌పై మనం ఎక్కువ దృష్టి పెట్టడంతో క్షేత్రస్థాయిలో పాజిటివ్ వాతావరణం వచ్చింది. ఈ నాలుగేళ్ల కాలంలో మనం వివిధ సమస్యలు పరిష్కరించడం కూడా దానికి కలసివచ్చింది. ఎన్నికల ఏడాది కాబట్టి అంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రతిపక్షాలు చేసే ప్రతి ఒక్క విమర్శనూ తిప్పికొట్టాల’ని రామకృష్ణుడు సూచించారు.