రాష్ట్రీయం

ఖైదీల్లో జీవన నాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తివిరి ఇసుకన తైలం తీయవచ్చు... ఇది నిజంగా నిజం. కరడుగట్టిన ఖైదీల్లో సైతం మార్పునూ తేవచ్చు. నైతికవర్తననూ పాదుకొల్పవచ్చు. జీవితం వ్యర్థం కారాదంటూ ‘ఉన్నత’ విలువలనూ పెంపొందించవచ్చు. ఒకసారి నేరం చేస్తే అది చర్విత చరణంగా జీవితానే్న మార్చేస్తుందన్న నైరాశ్యం నుంచీ బయటపడేవచ్చు. ఇలాంటి ఉన్నత భావాలను ఖైదీల్లో పాదుకొల్పి వారిలో పరివర్తనను తీసుకువచ్చే సమున్నత పథకమే ‘ఉన్నతి’. జీవిత విలువలను శిక్షా కాలంలోనే ఖైదీల్లో పెంపొందించడం ఓ ఉదాత్త ఆలోచన. ఆ ఆలోచనే నేడు కార్యరూపం దాల్చి సత్ఫలితాలనిస్తోంది. ఖైదీలకు జీవితం విలువ తెలుస్తోంది. నమ్ముకున్నవారిని ఆదరించాలన్న భావనా పెరుగుతోంది. వరంగల్ జైలులో మొదలైన ఈ ‘ఉన్నతి’.. జీవితం వ్యర్థమనుకునే జైలుపక్షుల పాలిట విలువల పెన్నిధి.
*

తమ్మలి మురళీధర్
సంగారెడ్డి, జనవరి 21: జీవితం, వ్యక్తిగత విలువలు, సమాజంపై సరియైన అవగాహన లేక నేరాలకు పాల్పడడం,పోలీసులకు చిక్కడం, జైలుకు వెళ్లడం.. విడుదలయ్యాక మళ్లీ అదే తంతూ. ఇలాంటి వారిని ఎంత కఠినంగా శిక్షించినా మార్పులేకపోగా మరిన్ని నేరాలకు పాల్పడుతూ తనకుతాను చెడ్డ గుర్తింపు కొని తెచ్చుకోవడమే కాకుండా కుటుంబాలు తలెత్తుకుని తిరగలేకుండా చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు మానవీయ విలువలు తెలియజెప్పి, సమాజంలో ఎలా బతికితే కుటుంబం, వ్యక్తిగత విలువలు పెరుగుతాయనే విషయాలను తెలియజెప్పి వినూత్న మార్పు తెస్తూ అద్భుత విజయాలను తెలంగాణ జైళ్ల శాఖ సొంతం చేసుకుంటుంది. ‘ముల్లును ముల్లుతోనే తీయవచ్చు’ అనే నానుడి ఇక్కడ సాక్షాత్కరిస్తోంది. తలపండిన మేధావులో, మానసిక వైద్యులతోనో కౌన్సిలింగ్ ఇప్పించకుండా వివిధ నేరాల్లో శిక్షలు అనుభవిస్తున్న జీవిత ఖైదీలతో మార్గదర్శనం చేస్తున్నారు. జైళ్ల శాఖ డీజీగా వీకే.సింగ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జైళ్లు, ఖైదీల ప్రవర్తనల్లో మార్పులు తీసుకురావడంతో పాటు స్వశక్తితో అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విశ్రాంత అద్యాపకురాలు బీనా నేతృత్వంలోని 18 మంది బృందం ‘సహాయం’ అనే కౌన్సిలింగ్ కార్యక్రమం పేరిట నేరస్తుల్లో మార్పు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటగా చర్లపల్లి జైలులో ‘ఉన్నతి’ అనే పేరుతో కరుడుగట్టిన ఖైదీల్లో మార్పు తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జైలులో జీవిత ఖైది శిక్షలు అనుభవిస్తున్న వారికి కూడా ఉన్నతి కార్యక్రమం ద్వారా మార్పుకు శ్రీకారం చుట్టారు. గోదావరిఖనికి చెందిన దనాల శేఖర్ బీటేక్ చదువుతుండగానే నేరానికి పాల్పడి జీవిత ఖైదీ శిక్షను మూడేళ్లుగా అనుభవిస్తున్నాడు. వరంగల్ జిల్లా మొగిలిచెర్లకు చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ క్షణికావేశంలో ఒకరిని హత్య చేసినందుకు నాలుగేళ్ల నుండి జీవిత ఖైది శిక్షను పొందుతున్నాడు. బిహార్ రాష్ట్రం చప్రా జిల్లా సోన్‌పూర్ గ్రామానికి చెందిన మున్నా కుమార్ ఉపాధ్యాయ నలుగురిని హత్య చేసిన కేసులో 15 ఏళ్లుగా జీవిత ఖైది శిక్షను అనుభవిస్తున్నాడు. ప్రవర్తనలో మార్పు చెందబోమని, మళ్లీ నేరాలు చేయాలనే ఆలోచనతోనే ఉండేవాడినని, కానీ ఉన్నతి కార్యక్రమం చేపట్టాక జీవిత విలువలు, తాను ఎవరి కోసం నేరం చేసి జైలు కొచ్చానో, తన కోసం ఎవరు శిక్ష అనుభవిస్తున్నారో అనే విషయాలు ఉన్నతి కార్యక్రమం ద్వారా అర్థం చేసుకున్నానని దనాల శేఖర్ పేర్కొంటున్నారు. నా భార్య, నా తల్లిదండ్రులు, నా తోబుట్టువుల మాదిరిగా ఇతర వాళ్లు కూడా బాద పడకూడదనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ (టీఓటీ)గా బాధ్యతలు స్వీకరించినట్లు శేఖర్, శ్రీనివాస్, మున్నాలు పేర్కొంటున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా అండర్ ట్రైల్ ఖైదీలు మళ్లీ మళ్లీ జైలుకు రాకుండా 30 నుండి 40 రోజుల వరకు తగిన కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఒక బృందంలో 30 మందిని ఎంపిక చేసి వారికి కౌన్సిలింగ్ ద్వారా జీవన మార్గాలను నిర్దేశిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జైలులో 8 విడతలుగా అనేక మంది నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ నేరం చేయకుండా మార్పు తీసుకువచ్చామని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే తరహాలో గత యేడాది ఏప్రిల్ నెల నుండి సంగారెడ్డి జిల్లా కంది కారాగారంలో ఉన్నతి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్ రాయ్ పేర్కొన్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 150 మందికి ఐదు విడతలుగా కౌన్సిలింగ్ చేసారు. కౌన్సిలింగ్ పొందిన అండర్ ట్రైల్ నేరస్తుల్లో ఇప్పటి వరకు 122 మంది విడుదలై బయటకు వెళ్లగా, మరో 28 మంది జైలులోనే ఉన్నారు. విడుదలై వెళ్లిన వారిలో ఇప్పటి వరకు మళ్లీ నేరానికి పాల్పడి జైలు మొహం చూడలేదంటే ఉన్నతి కార్యక్రమం ద్వారా కౌన్సిలింగ్ ఏ మేరకు దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు. నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని, సమాజంలో కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లుతుందనే ఉద్దేశంతో ఇంట్లోకి రానివ్వకపోవడం వల్ల మరోమారు నేరానికి పాల్పడి జైలుకు వస్తున్న నేరస్తుల కుటుంబ సభ్యులకు కూడా స్పెషల్ ములాఖత్ పేరిట కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 15 అంశాల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సమస్య ఎక్కడో పరిష్కారం అక్కడే, జైలుకు రావడానికి కారణం, జైలు జీవితం ఎలా ఉంది, జైలు నుండి వెళ్లాక ఎలా జీవిస్తే సమాజంలో ఇనుమడిస్తాం అనే విషయాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకు ఆవేశంతో నేరానికి పాల్పడ్డాం. తద్వారా ఎంతటి క్షోభను అనుభవిస్తున్నాం, జైలులో తినడానికి తిండి బాగుందీ, సుఖంగా జీవించే అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు బయట ఎంతటి శిక్ష అనుభవిస్తున్నారో అనే విషయాలపై నేరస్తుల హృదయాలను తట్టి లేపుతున్నారు. సమాజానికి మేలు చేయకున్నా సరే కానీ కీడు తలపెట్టవద్దని ఉద్భోదిస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాషల్లో అర్థమయ్యే విధంగా హితవు పలుకుతున్నారు. టీఓటీలుగా శిక్షణ పొంది జైలు నుండి విడుదలైన వారు కూడా తిరిగి జైలుకు వచ్చి కౌన్సిలింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ గతంలో తాను జైలు జీవితాన్ని ఎలా అనుభవించానో, ఇప్పుడు బయటకు వెళ్లాక ఏ విధంగా జీవిస్తున్నాను, తనకు లభిస్తున్న ఆధరణ ఏమిటనే విషయాలను అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు. మానవీయకోణంలో కొనసాగుతున్న ఉన్నతి కార్యక్రమాన్ని బీపీఆర్‌డీ కూడా పరిశీలించి దేశ వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సహాయం కౌన్సిలింగ్ బృందంలో సభ్యుడైన రాజేశ్వర్ సాల్మన్ సన్మార్గ పద్దతిలో ఇస్తున్న ఉపన్యాసాలు కూడా నేరస్తుల మార్పులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మొత్తంమీద ఉన్నతి కార్యక్రమం మంచి ఫలితాలను సాధిస్తూ నేరస్తుల్లో సత్ప్రవర్తనను తీసుకురావడం అభినందనీయం.

చిత్రం..నేరస్తులకు జైలులో కౌన్సిలింగ్ ఇస్తున్న టీఓటీలతో సైకాలజిస్ట్ రాజేశ్వర్ సాల్మన్