రాష్ట్రీయం

కాంగ్రెస్‌లోకి నామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 22: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో భారీషాక్ తగలనుంది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ మాజీ నేత నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమయినట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరగ్గా ఆది, సోమవారాల్లో అందుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతమైనట్లు సమాచారం. ఇందుకు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ ప్రధాన నేతతో పాటు ఓ పారిశ్రామికవేత్త మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం. నామాను తిరిగి ఖమ్మం లోక్‌సభ సభ్యునిగా పోటీ చేయిస్తారని, ఇందుకు అనుగుణంగా ఒప్పందాలు కూడా కుదిరినట్లు తెలుస్తోంది. తొలుత వ్యాపారవేత్తగా ఉన్న నామా నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్‌లోనే చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచిన వెంటనే ఆయనకు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించింది. దీంతో దేశవ్యాప్తంగా విస్తృత పరిచయాలు పెంచుకున్నారు. గత ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుతో విభేదాలు, ఎన్నికల్లో ఓటమి ఆయనను నైరాశ్యంలో ముంచాయి. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కూడా అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరాలనే ప్రతిపాదన కూడా ఆయన ముందుకు వచ్చిందని, అయితే అప్పటికే ఆ పార్టీలో చేరి మంత్రి పదవి పొందిన తుమ్మలతో సఖ్యత సాధ్యం కాదనే ఉద్దేశంతో, జాతీయ పార్టీలోనే చేరాలని భావించి ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సమాచారాన్ని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళగా ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు తగ్గుతున్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నామా పార్టీమారితే రాష్ట్రంలో పార్టీకి మరింత గడ్డుకాలం ఎదురవుతుందని, దీంతో ఉన్న కొద్దిమంది నేతలు కూడా పార్టీ మారతారని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నామా చేరిక ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చనే ధీమా కూడా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా మరికొంతమంది ప్రధాన నేతలు కూడా క్యూకట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా నామాను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం ద్వారా జిల్లాలో పార్టీకి మరింత ఊపు తీసుకురావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. నామా చేరికను కాంగ్రెస్ నేతలు బాహటంగానే సమర్థిస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన నేతలుగా ఉన్న వారు కూడా ఆయన వస్తే సగౌరవంగా తమలో కలుపుకుంటామని బహిరంగంగానే చెప్పడం విశేషం.