ఆంధ్రప్రదేశ్‌

రబీకి తప్పని గడ్డుకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గోదావరి డెల్టాలో రబీ గట్టెక్కాలంటే ఇంకా పది టిఎంసిలు నీటిని అదనంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మార్చి 31నాటికి రబీని ముగించాలని జలవనరులశాఖ అధికారులు ఎంత మొత్తుకున్నా ఏప్రిల్ నెలాఖరు వరకు రబీ సా..గేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో 10టిఎంసిలు నీటిని అదనంగా బలిమెల రిజర్వాయరు నుండి తెచ్చుకుంటే తప్ప రబీ గట్టెక్కే పరిస్థితి కనిపించటం లేదు. రబీ సాగు ప్రారంభమైనప్పటి నుండే సీలేరు బైపాస్ జలాలను తెచ్చుకోవాల్సి రావటంతో, గత రెండు నెలల్లోనే 40టిఎంసిలను వినియోగించాల్సి వచ్చింది. మరో 20టిఎంసిలు ఉంటే తప్ప రబీ గట్టెక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు సరఫరాచేస్తున్న 6300 క్యూసెక్కుల్లో 4500 క్యూసెక్కులు సీలేరు నుండి సమకూర్చుకుంట్నువే. సీలేరు జలాలు లేకపోతే ఈసారి కనీసం నాట్లు పూర్తిచేసే పరిస్థితి కూడా ఉండేది కాదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధాన ప్రవాహం నుండి వస్తున్న నీరు బాగా తగ్గుతున్న పరిస్థితుల్లో బ్యారేజి ఎగువన అనధికారికంగా పనిచేస్తున్న ఎత్తిపోతల పథకాలపై జలవనరులశాఖ అధికారులు ఒత్తిడి పెంచారు. ఇలా అయితే గోదావరి డెల్టాలో రబీని పండించలేమని, కచ్చితంగా ఎగువ ఎత్తిపోతల పథకాలు, పంపింగ్ స్కీంలను ఆపాల్సిందేనని రాష్ట్రప్రభుత్వానికి జలవనరులశాఖ అధికారులు నివేదిక పంపటంతో, అనధికారికంగా నడుస్తున్న ఎత్తిపోతల పథకాలన్నీ నిలిచిపోయాయి. దాంతో ప్రధాన ప్రవాహం నుండి వచ్చే ప్రవాహం కొంత మెరుగుపడింది. అయినా సరే ప్రస్తుతం ప్రధాన ప్రవాహం, సీలేరు జలాలు పూర్తిగా వినియోగించుకోగా ఇంకా 10టిఎంసిలు అవసరమవుతాయని జలవనరులశాఖ అధికారులు అంచనావేస్తున్నట్టు తెలుస్తోంది. జల విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాల్సిన నీటిని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బైపాస్ కాలువ ద్వారా గోదావరి డెల్టాకు విడుదలచేసిన ఎపి జెన్‌కో, ఇక మళ్లీ అలాంటి త్యాగంచేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వంతో చర్చించి, అదనపు నీటిని తెచ్చుకోవటం మినహా మరోదారి లేదని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం ఎంత వరకు సహకరిస్తుందన్నది అనుమానంగానే కనిపిస్తోంది. 2009లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి తలెత్తినపుడు అప్పట్లో రాష్ట్రప్రభుత్వం చాకచక్యంగా అదనపు నీటిని తెచ్చుకోగలిగింది. ఈసారి రాష్ట్రప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అమలుచేస్తుందోనని రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రబీని పూర్తిగా గట్టెక్కించడానికి శాయశక్తులా కృషిచేస్తున్నామని, తమ మంత్రి దేవినేని ఆదేశాలతో గోదావరి డెల్టాలో రబీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని ఎస్‌ఇ సుగుణాకరరావు చెప్పారు.