రాష్ట్రీయం

ఏపీలో ఇన్నోవేషన్ వ్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 27: టెక్నాలజీ, రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)లో ముందున్న ఏపీలో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఇన్నోవేషన్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందుకు సీఐఐ (కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) సహకరిస్తుందన్నారు. దావోస్ పర్యటనపై శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. తన పర్యటనలో రెండు ఎంఓయులు కుదుర్చుకున్నామని, 25 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నామన్నారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు 50 సంస్థలు ‘మెడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్’ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఆసక్తి వ్యక్తీకరణ లేఖలు) ఇచ్చాయన్నారు. దావోస్‌లో భారత్, ఆంధ్రప్రదేశ్ ఆకర్షణీయంగా నిలిచాయని, ముఖ్యమైన అన్ని అంశాల్లో పాల్గొన్నామన్నారు. యుపీఎల్ లిమిటెడ్ కంపెనీ గ్లోబల్ సీఈవో జై షరోఫ్‌తో సమావేశమయ్యామని, వర్షాభావ సమయంలో సాగునీటికి ఉపకరించే ఉత్పత్తిని యూపీఎల్ సంస్థ రూపొందించినట్టు తెలిపారు. భూమిలోని నీటిని గ్రహించి కరవు కాలంలో నెమ్మదిగా విడుదల చేసే ఉత్పత్తి అని, దీన్ని ఏపీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి ఆహ్వానించామన్నారు. వరదల సమయంలో పొలంలో వేసిన ఎరువులు కొట్టుకుపోకుండా నిలిపే టెక్నాలజీని ఆ సంస్థ అభివృద్ధి చేసిందన్నారు. ఈ రెండు టెక్నాలజీల వల్ల రాష్ట్రంలో కరవు సమస్యను నివారించగలమన్నారు. విభజనతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఏపీకి పెట్టుబడులు రాబట్టడానికి, పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో కృషి చేశామన్నారు. పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ బెంచ్ మార్క్ తీసుకున్నట్లు తెలిపారు. ఒక్క కాల్‌తో ఎటువంటి సమస్య అయినా పరిష్కారమయ్యే విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయోగమన్నారు. ప్రస్తుతం 30 శాఖలను అనుసంధానించామని, త్వరలో అన్ని శాఖలను ఇందులోకి తీసుకువస్తామన్నారు. 2027 నాటికి రాష్ట్రంలో గ్రీన్ అగ్రికల్చర్‌ని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించడం ద్వారా భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆటోమొబైల్ రంగంలో 3.7 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. అనంతపురానికి కియో మోటార్స్ రావడం, దక్షిణ కొరియా టౌన్‌షిప్ ఏర్పడటంతో అక్కడి వాతావరణం మారిపోయిందన్నారు. ఈజీ టు బిజినెస్‌లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచామని, 21 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు ఇస్తున్నామని, పరిశ్రమల స్థాపన విషయంలో అధికారులు, పారిశ్రామికవేత్తల వెంటపడుతున్నారని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసిన పనులకు సంబంధించి నాబార్డ్ ద్వారా నిధులు ఇప్పించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి కాంక్రీట్ పని కూడా ప్రారంభమవుతుందన్నారు. నదులు అనుసంధానం ద్వారా రాష్టమ్రంతటా సాగు, తాగునీరు అందిస్తామన్నారు. పట్టిసీమ ద్వారా నీరందించడంతో ఈ ఏడాది అధిక వ్యవసాయ దిగుబడులు వచ్చాయని, రూ.2500 నుంచి రూ.3వేల కోట్ల వరకు అదనపు ఆదాయం లభించినట్లు చంద్రబాబు వివరించారు.
ప్రకృతితో మమేకం కండి
ప్రజలందరూ ప్రకృతితో మమేకం కావాలని, ప్రకృతిని ఆరాధించి, ప్రేమించాలని చంద్రబాబు కోరారు. ఏరువాక పవిత్రమైన కార్యక్రమం అని, అందరికీ తిండి పెట్టే రైతన్నకు సంఘీభావం తెలుపుతూ దాన్ని పండుగలాగా జరుపుకున్నామని గుర్తు చేశారు. సంపదకు మూలం నీరని అందువల్ల జలసిరికి హారతి ప్రారంభించామన్నారు. పుష్కరాలకు అఖండ హారతి పట్టామన్నారు. వనం-మనంలో భాగంగా వన మహోత్సవం నిర్వహించి పండుగ వాతావరణంలో చెట్లకు పూజలు చేశామన్నారు. ప్రస్తుత, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా అమ్మకు వందనం పేరుతో తల్లిని గౌరవించడం, అభిమానించడం, ప్రేమించడం, ఆరాధించడం వంటివి పిల్లలకు అలవాటు చేస్తున్నామన్నారు. అలాగే రేపు ఉదయం 7 గంటలకు విజయవాడలో సూర్య ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో అదే సమయానికి పవిత్రమైన మనసు, పరిశుభ్రతతో సూర్య నమస్కారాలు చేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలన్నారు. సమావేశంలో సమాచార, పౌర సంబంధాల కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ కూడా పాల్గొన్నారు.