రాష్ట్రీయం

ఈ గోదారికి ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జనవరి 28: గలగలలాడే గోదావరి.. కళకళలాడే వరి చేలు, కోనసీమ కొబ్బరి చెట్లతో నిత్యం సాగు హడావుడి కనిపించే గోదావరి జిల్లాలు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. హరిత విప్లవానికి, నీలి విప్లవానికి పేరొందిన ఉభయ గోదావరి జిల్లాలు రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సరికొత్త సాగు విధానాలను అందిపుచ్చుకుని దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న గోదావరి జిల్లాల రైతాంగం గత కొద్దికాలంగా దాడిచేస్తున్న రకరకాల వైరస్‌లతో విలవిల్లాడుతోంది. వివిధ రకాల వైరస్‌లు గోదావరి జిల్లాల్లోని పంటలపై దాడి చేస్తున్నాయి. దీంతో గోదావరి రైతు ఆర్థికంగా చితికిపోతున్నాడు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రానే్న మార్చేయగల సత్తా ఉన్నదిగా పేర్కొనే ఆక్వా రంగం రకరకాల వైరస్‌ల బెడదతో అల్లాడుతోంది. ఇక కోటి టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశానికి అన్నంపెట్టే వరికంకిని సుడిదోమ వదలడం లేదు. కేరళ తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న గోదావరి జిల్లాల కొబ్బరి తోటలు తెల్లదోమ పోటుతో బిక్కుబిక్కుమంటున్నాయి. ఇక స్వయంకృషితో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కడియం నర్సరీలు తెల్లదోమ ధాటికి విలవిల్లాడుతున్నాయ. మొత్తం మీద అన్ని రంగాల రైతులు ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారు. నీలి విప్లవానికి వేదికగా మారి, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన రొయ్యల రైతులు వరుస వైరస్‌ల దాడితో విలవిల్లాడుతున్నారు. నిన్న మొన్నటి దాకా ‘విబ్రియో’, తాజాగా ‘వైట్ గట్’ వైరస్‌లు రొయ్యల చెరువులను నిశ్శబ్దంగా మింగేస్తున్నాయి. ఈ వైరస్‌ల బారినుండి తప్పించుకోవడానికి రైతులు వాడుతున్న కొన్ని రకాల మందులు మరోకొత్త సమస్యను తెచ్చిపెడుతున్నాయి. అదే ‘యాంటీ బయోటిక్స్ అవశేషాలు’. ఈ మందులను వాడి కొంతలో కొంత పంటను రైతులు దక్కించుకోగలుగుతున్నా ఆయా మందుల తాలూకు అవశేషాలు ఎగుమతి అయిన తర్వాత కూడా
వదలకుండా భయపెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం యాంటీ బయోటిక్స్ వాడవద్దని ప్రచారంచేసి చేతులు దులిపేసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు. వైరస్‌ల బెడదను తప్పించుకోవడానికి అవసరమైన పరిశోధనలు జరపడం, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడంలేదనేది రైతుల ఆందోళన. ఒకవైపు యాంటీబయోటిక్స్ భయంతో మందుల వాడకం మానేసి, మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించకపోతే ముందు ముందు వైరస్‌ల దాడికి బలైపోతామని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇక హరిత విప్లవం ద్వారా గోదావరి జిల్లాలకు ధాన్యాగారం అని పేరుతెచ్చిన వరి సాగుచేస్తున్న రైతాంగాన్ని కొంత కాలంగా సుడిదోమ ఇబ్బందులకు గురిచేస్తోంది. సరిగ్గా పాలుపోసుకుని గింజలు గట్టిపడే దశలో ఈ సుడిదోమ దాడిచేస్తోంది. ఈ సుడిదోమ వచ్చినప్పుడల్లా ఏదో మందులను కొనుగోలు చేసి పిచికారి చేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో అన్నదాత ఉన్నాడు. 2012-13లో దీని వల్ల భారీగానే రైతాంగం నష్టాలను చవిచూశారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు కేవలం సుడిదోమ అంశాన్ని కాగితాలకే పరిమితం చేశారని చెప్పవచ్చు. కొనే్నళ్ల క్రితం కేంద్రం నుంచి బృందాలు వచ్చి పరిశీలించి వెళిపోయాయి. పరిష్కారం మాత్రం ఏ ప్రభుత్వమూ సూచించలేదని పశ్చిమ గోదావరి జిల్లా బేతపూడి గ్రామానికి చెందిన మధు అనే రైతు వాపోతున్నాడు.
ఇక కేరళ తర్వాత దేశంలో కొబ్బరి తోటలకు గోదావరి జిల్లాలే ప్రసిద్ధి. ‘కొడుకు కంటే కొబ్బరి చెట్టు మేలు’ అనే సామెత ఈ ప్రాంత రైతులు త్రికరణశుద్ధిగా నమ్ముతారు. అందుకే ప్రత్యేకంగా తోటలే కాక, పొలం గట్లు, ఇంటి ఆవరణలో సైతం కొబ్బరి చెట్లను పెంచుతారు ఈ జిల్లాల రైతులు. వరి పంట చేతికొచ్చే వరకు రైతులకు రోజువారీ ఖర్చులకు ఈ కొబ్బరి చెట్లపై వచ్చే ఆదాయంపైనే ఆధారపడుతుంటారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పువచ్చింది. వైరస్ బారిన పడి వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు నాశనమయ్యాయి. ఉన్న చెట్లూ దెబ్బతిన్నాయి. తాజాగా వినిపిస్తున్న ‘తెల్లదోమ’ మరోసారి కొబ్బరి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాకు చెందిన తెల్లదోమ సముద్ర మార్గం ద్వారా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రవేశించింది. కొబ్బరి మొక్కకు ఆకర్షించే గుణం ఉండటం వల్ల ఇది సోకింది. 2016కి ముందు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అరటి మొక్కలకు, ఆక్వా చెరువు గట్లపై ఉండే కొబ్బరి చెట్లుకి సోకి, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లోని కొబ్బరి తోటలకు వ్యాపించింది. దీనిపై కూడా కాయర్ బోర్డు పరిశోధనలు చేస్తున్నట్టు చెబుతోంది. కానీ ఇప్పటివరకు తీసుకోవాల్సిన చర్యలు కూడా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తెల్లదోమ ప్రభావాన్ని చూస్తుంటే కొబ్బరిని ఎమర్జన్సీగా ప్రకటించాలని హార్టికల్చర్ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలను ఈ తెల్లదోమ దాదాపు అతలాకుతలం చేసే పరిస్థితులు నెలకొన్నాయని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లోని కొబ్బరి మొక్కలపై ఈ దోమ ఆశించివుందని, అందువల్ల ఈ మొక్కలను విక్రయించరాదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. ఇదే దోమ పూలు, పండ్లు, అలంకరణ మొక్కలపై కూడా ఆశించే అవకాశముందని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ తెల్ల దోమను నివారించడానికి ఇప్పటివరకు ఎటువంటి మందులు లేవని నిపుణులు చెబతున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. అదే జరిగితే తలెత్తే విపరిణామాలు ఊహించడానికే భీతిగొల్పుతున్నాయని నర్సరీ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇన్నిరకాలుగా సమస్యల చట్రంలో చిక్కుకున్న తమను ఆదుకోవడానికి తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగాలని గోదావరి జిల్లాల రైతాంగం కోరుతోంది.