రాష్ట్రీయం

సుఖాంతమైన సీఐ అదృశ్యం ఘటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 3: సంచలనం రేపిన నల్లగొండ టూటౌన్ సీఐ ఎన్. వెంకటేశ్వర్లు అదృశ్యం కేసు సుఖాంతమైంది. శనివారం సీఐ తన టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి డ్యూటీలో చేరడంతో రెండు రోజులుగా సీఐ అదృశ్యంపై రేగిన ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం ఉదయం 9:30కు సీఐ వెంకటేశ్వర్లు తన సర్వీస్ రివాల్వర్‌ను డ్రైవర్‌కు అప్పగించి, పోలీస్ శాఖ సెల్‌ఫోన్ సిమ్‌కార్డును మాడ్గులపల్లి పోలీస్ స్టేషన్‌లో ఇచ్చి ఆకస్మికంగా అదృశ్యమయ్యాడు. ఇటీవల పట్టణంలో వరుసగా జరిగిన మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసుకు, కనగల్ వాసి పాలకూరి రమేష్ హత్య కేసుకు వెంకటేశ్వర్లు విచారణాధికారిగా ఉండటంతో ఆయన అదృశ్యం రాజకీయంగా దుమారం రేపింది. ఉన్నతాధికారులకు, కుటుంబ సభ్యులకు సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీఐ అదృశ్యమవ్వడంతో ఆయన ఆచూకీ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం ఆరు ప్రత్యేక బృందాలను నియమించి అనే్వషణ చేపట్టింది. చివరకు గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక రిసార్ట్‌లో ఉన్నట్టు గుర్తించిన పోలీసు బృందాలు సీఐ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారుల సంప్రదింపుల పిదప వెంకటేశ్వర్లు సాయంత్రం 7గంటలకు విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస హత్యల నేపథ్యంలో తాను తీవ్రమైన పని ఒత్తిడికి గురై ఆరురోజులు నిద్రలేకుండా విధులు నిర్వహించి విసుగెత్తిపోయానన్నారు. ఈ సమయంలో తనకు సెలవులు మంజూరు చేయరన్న ఉద్దేశంతో విశ్రాంతి కోసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అజ్ఞాతంలోకి వెళ్లానన్నారు. సొంత పనిపై వెళ్లినందున సర్వీస్ రివాల్వర్‌ను, సిమ్‌కార్డును పోలీసు సిబ్బందికి అప్పగించి వెళ్లానన్నారు. తన అదృశ్యంపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లుగాని, ఉన్నతాధికారుల వేధింపులు గాని లేవని విశ్రాంతికోసమే ఈ పనిచేసినట్టు చెప్పారు.

చిత్రం..తన అదృశ్యంపై వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న నల్లగొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు