రాష్ట్రీయం

సీపీఎంకు పూర్వవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 10: రానున్న రోజుల్లో సీపీఎంకు పూర్వవైభవం రావడం ఖాయమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ధీమా వ్యక్తం చేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం వామపక్ష ప్రజాతంత్ర సామాజిక శక్తుల ఐక్యతే ప్రత్యామ్నాయమని ఆయన ప్రకటించారు. సీపీఎం పార్టీ ఏర్పడిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తొలిసారిగా 25వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి బి బలరాం అధ్యక్షతన అల్లూరి సీతారామరాజు నగర్ పేరిట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యవక్తగా జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రసంగించారు. హిట్లర్, ఇందిరాగాంధీ లాంటివారు ఎంతో మంది ఎర్ర జెండాను ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఈ దేశంలో ఎర్ర జెండాను దించే శక్తి ఎవరికీ లేదని ఆయన ఉద్ఘాటించారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) దేశంలో ప్రైవేటు సైన్యంతో మత ఘర్షణలను సృష్టిస్తోందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో జరిగే త్రిపుర ఎన్నికలకు ముందే అక్కడ హిందూ, క్రిస్టియన్లమధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలులో ఎవరికీ న్యాయం చేయలేదని విమర్శించారు. పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం పార్టీ తోడు దొంగలుగా మారి రాష్ట్రానికి నష్టం కలిగించారన్నారు. పోలవరం విషయంలో పొలాలు, ఇళ్లు, ఉపాధి నష్టపోయిన వారికి పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పారిశ్రామిక వాడలని అంటారని, తీరా చూస్తే తుందుర్రులో ఫుడ్‌పార్కు వంటి కాలుష్య రకాల ఫ్యాక్టరీలు వస్తున్నాయని, వాటి వల్ల వరి భూములు, కాలువలు, మత్స్యకారులకు నష్టం ఏర్పడుతోందని వివరించారు. విద్య, ఆరోగ్యంలో ఏపీ వెనుకబడి ఉందని సర్వేలు తేల్చి చెప్పాయన్నారు. టీడీపీ, బీజేపీలు ఎవరి కోసం వారు పనిచేస్తుంటే వైసీపీ మాత్రం కష్టజీవుల కోసం ఎటువంటి పథకాలు లేకుండా నవరత్నాలను ఏర్పాటుచేసిందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీపీఎం జేఏసీలను కూడా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇప్పుడిప్పుడే మేల్గొని హోదా కోసం జేఏసీ వేయాలనడం విడ్డూరంగా ఉందని, పవన్ కావాలంటే సీపీఎంతో హోదా కోసం పని చేయవచ్చునని ఆహ్వానించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, అనేక అంశాలపై మాట్లాడాల్సిన వైసీపీ అసెంబ్లీలో ప్రశ్నించకపోవడం సిగ్గుచేటుగా ఉందని దుయ్యబట్టారు. కేంద్ర కమిటీ సభ్యురాలు హేమలత, పుణ్యవతి, గఫూర్, మిడియం బాబూరావు, అరుణ్‌కుమార్, వి ఉమామహేశ్వరరావు, మంతెన సీతారాం, జెఎన్‌వి గోపాలం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బహిరంగ సభలో మాట్లాడుతున్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి