రాష్ట్రీయం

తెలంగాణ రాష్ట్రం.. దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ‘తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం’గా నిలుస్తుందని 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించింది. వివిధ అభివృద్ధి పథకాలతో పాటు, నీటి పారుదల ప్రాజెక్టుల పనుల వేగవంతం, నిధుల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ సంతృప్తిగా ఉందని అభినందించింది. 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా ఆధ్వర్యంలో సభ్యులు శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరిశీలించారు. దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ, సాగు నీటి ప్రాజెక్టు కాళేశ్వరం అన్ని రాష్ట్రాలకూ ఆదర్శవంతం అవుతుందన్నారు. అతి తక్కువ వ్యవధిలో ఇంత అద్భుతంగా పనులు జరగడం సంతోషకరమని ఆయన తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులందరమూ వస్తామని ఆయన చెప్పారు. సిద్దిపేట సమీపంలో నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన 11వ ప్యాకేజీ రంగనాయక సాగర్ పనులు, అన్నారం బ్యారేజీలను సందర్శించామని ఆయన వివరించారు. రంగనాయక సాగర్ టనె్నల్‌లో పనులు నిర్వహిస్తున్న తీరు బాగుందన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ఆర్థిక సంఘం ముఖ్య ఉద్దేశం కూడా అదేనని అన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి కూడా జరుగుతుందని ఆయన తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ రంగంలో జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాల రీత్యా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. నిర్మాణం, ప్రణాళిక, పనుల వేగవంతం తమను ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రాత్రింభవళ్ళు మూడు షిఫ్టులలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, వచ్చే వర్షాకాలం నాటికి మొదటి దశ పూర్తవుతుందనడంలో తనకు ఏ మాత్రం సందేహం లేదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు మరో 18 లక్షల ఎకరాలకు కొత్తగా సాగు నీటిని అందించే బృహత్తర ప్రాజెక్టుగా మెహతా అభివర్ణించారు.
వ్యయం పెరగదు..
సకాలంలో ప్రాజెక్టు పూర్తయితే వ్యయం పెరగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక సవాల్‌గా స్వీకరించినట్లు తమకు అర్థమవుతున్నదని ఆయన తెలిపారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వం ఎలా పని చేస్తున్నదో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎలా కృషి చేస్తున్నారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి తమకు వివరించారని ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా చెప్పారు.
ప్రదర్శనను తిలకించిన బృందం
ఇలాఉండగా సండ్లాపూర్లోని రంగనాయక సాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను, కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్‌ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు ఆర్థిక సంఘం బృందానికి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అవసరమైన నిధులు, వ్యయం గురించి వారు తెలిపారు. రంగనాయక సాగర్ టనె్నల్, కాలువల నిర్మాణం, ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న పనులపై ఆర్థిక బృందం సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ పట్టుదలతో..
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పట్టుదల, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు కృషి కారణంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్ణీత గడువు ప్రకారం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చిత్రం..కోమటి బండలో మిషన్ భగీరథ అమలు విధానాన్ని 15వ ఆర్థిక సంఘం కార్యదర్శికి
వివరిస్తున్న అధికారులు