ఆంధ్రప్రదేశ్‌

పురోగతిలో నదుల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: నదుల అనుసంధానంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహానది-గోదావరి నదుల అనుసంధానం ప్రతిపాదనల్లో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన ఒడిశా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సానుకూలంగా స్పందిస్తోంది. మహానది-గోదావరి నదుల అనుసంధానం అంటే మహానదిలోని నీటిని ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదిలోకి తరలించటమేనన్న అభిప్రాయంలో ఉన్న ఒడిశా ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ప్రధానోద్దేశ్యాన్ని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర జలవనరులశాఖ ఉన్నతాధికారులు వివరించటంతో ఒడిశా ప్రభుత్వం తన వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకుంది. బ్రహ్మపుత్ర నది నుండి నీటిని మహానదికి, మహానది నుండి గోదావరికి, గోదావరి నుండి కృష్ణా, పెన్నార్, కావేరి, వైగాయ్, గుండార్ వరకు నదుల అనుసంధానాన్ని చేపట్టాలన్నది కేంద్రప్రభుత్వ విశాల ప్రణాళిక. ఇంత పెద్ద నదుల అనుసంధానం ప్రణాళికను ఏక మొత్తంగా ఒకేసారి అధ్యయనం, సర్వే వంటి ప్రాథమిక కార్యక్రమాలను కూడా చేయలేని పరిస్థితుల్లో కేంద్ర జలవనరుల అభివృద్ధి సంస్థ పరిపాలనా సౌలభ్యం కోసం రకరకాల బేసిన్లుగా విభజించుకుంది. అందులో భాగంగా బ్రహ్మపుత్ర నుండి గంగా, గంగా-సువర్ణరేఖ, సువర్ణరేఖ-మహానది, మహానది-గోదావరి, గోదావరి నుండి కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా నుండి కావేరి, వైగాయ్, గుండార్ వరకు నదులను అనుసంధానించే విధంగా కేంద్ర జలవనరులశాఖ ప్రణాళికను సిద్ధంచేస్తోంది. బ్రహ్మపుత్ర నుండి మహానది వరకు అనుసంధానించే కార్యక్రమానికి సంబంధించిన అధ్యయనాలు వేగంగా సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే మహానది-గోదావరి అనుసంధానానికి అవసరమైన ప్రయత్నాలను కేంద్రప్రభుత్వం చేపట్టింది. బ్రహ్మపుత్ర నదిలో నిరంతరం నీరు ఉంటుంది. ఆ నదికి తరచు వరదలు సంభవిస్తూనే ఉంటాయి. అందువల్ల బ్రహ్మపుత్ర నుండి 45వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని గంగా, సువర్ణరేఖ తదితర మార్గ మధ్యలోనే వివిధ బేసిన్ల అవసరాలను తీరుస్తూ మహానదికి 14వేల మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని తరలించాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యం. మహానది నుండి 6500 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని గోదావరికి తరలించే విధంగా ఫీజిబులిటీ నివేదికలు రూపొందాయి. మహానది నీటిని గోదావరిలోకి తరలించి, గోదావరి నీటిని కృష్ణా, పెన్నార్, కావేరి మీదుగా గుండార్ వరకు దక్షిణభారతదేశం తాగు, సాగు అవసరాలను తీర్చాలన్నది కేంద్రప్రభుత్వం ఉద్దేశ్యం. ఎగువ నుండి వచ్చే నీటిలో ఎంత నీటిని కావాలంటే అంత నీటిని వినియోగించుకున్న తరువాతే దిగువకు విడుదలచేసే అధికారాన్ని ఇస్తామని, పైపెచ్చు ఒడిశాకు చెందిన మరో 6ప్రాజెక్టులకు మహానది-గోదావరి ప్రాజెక్టులో భాగంగానే కేంద్రప్రభుత్వం 90శాతం నిధులను సమకూరుస్తుందని హామీ ఇవ్వటంతో ఒడిశా ప్రభుత్వం తన విధానాన్ని సానుకూలంగా మార్చుకుంది. దాంతో ఒడిశా ముఖ్యమంత్రితో పాటు 17మంది ఎంపిలు మహానది-గోదావరి అనుసంధానం ప్రాజెక్టుకు అనుకూలంగా లేఖలు ఇచ్చారు. అయితే జాతీయ హైడ్రాలజీ సంస్థ(రూర్కీ)తో అధ్యయనం చేయించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని ఒడిశా చెప్పటంతో, జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు, ఒడిశా రాష్ట్రప్రభుత్వ ప్రతినిధులతో కలిసి ఒకేసారి అధ్యయనం జరిగే విధంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘కచ్చితంగా ఈ నివేదిక మహానది-గోదావరి అనుసంధానికి అనుకూలంగానే వస్తుంది. ఎందుకంటే నదుల అనుసంధానం వల్ల అటు ఒడిశాకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలగటంతో దేశంలో కరవు లేకుండా చేసుకోవచ్చు’, అని జలవనరుల రంగ నిపుణుడొకరు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. జాతీయ హైడ్రాలజీ సంస్థ నివేదికను ఒడిశా ప్రభుత్వం ఆమోదించిన వెంటనే అసలు అనుసంధానానికి తెరతీసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది.