రాష్ట్రీయం

ఎలాంటి తేడా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: ప్రత్యేక హోదా వల్ల ఏవి లభిస్తాయో ప్రత్యేక సహాయం (ప్యాకేజీ)వల్ల కూడా అన్నీ సమకూరుతాయని కేంద్రం చెప్పడం వల్లే అందుకు అంగీకరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 2016 సెప్టెంబర్ 8న చేసిన ప్రకటనలో కూడా ఆర్థిక మంత్రి జైట్లీ ఇదే చెప్పారన్నారు. అప్పటి ప్రధాని ప్రకటించిన హామీలకు సమానమైన ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని, ఐదేళ్లపాటు ఈ సహాయం కొనసాగుతుందని జైట్లీ విస్పష్టంగా ప్రకటించారన్నారు. గురువారం తన నివాసం వద్ద గ్రీవెన్స్ సెల్‌లో మంత్రులు, ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ ప్రకటన పూర్తి పాఠం వినిపించి ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ఆర్థిక సాయానికి తేడా ఏమిటో ప్రశ్నించాలని అన్నారు. ఒక్క అంగుళం కూడా రెండింటికీ తేడా లేదన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు తదితర అనేక సందర్భాల్లో కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చామని, ఎక్కడా ఎప్పుడూ కేంద్రాన్ని, బీజేపీని ఇబ్బంది పెట్టలేదన్నారు. చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాలు ఆయా రాష్ట్రాలకు అదనపు బలాలు అయ్యాయని, ఏపీకి అటువంటి రాజధాని నగరం లేకుండా పోయిందన్నారు. మూడేళ్ల పడ్డ కష్టం ఫలితంగా రెండంకెల వృద్ధి సాధించగలిగామని చెప్పారు. అసమాన విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయన్ని సరిదిద్దాలని కోరుతున్నామన్నారు. ‘42శాతం డివల్యూషన్ అన్ని రాష్ట్రాలకు వచ్చేదే. దశలవారీగా ఇచ్చేదే. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 60:40 నిష్పత్తిలో ఇస్తారు. నరేగా డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రాం. ఎంత చేస్తే అన్ని పనిదినాలు వస్తాయి. మన కన్వర్జెన్స్ దేశానికే నమూనా అయింది. నేషనల్ హైవేలు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఇచ్చార’ని బాబు వివరించారు. మూడున్నరేళ్లుగా వౌనంగా ఉన్నామనడం పచ్చి అబద్ధమన్నారు. ప్రతి వేదికపై ప్రశ్నిస్తూనే ఉన్నామని,అన్యాయాన్ని సరిదిద్దాలని అడుగుతూనే ఉన్నామన్నారు. ‘మోదీ ప్రమాణ స్వీకారానికి వెళ్లినప్పుడే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపాలని అడిగాను. కలిపితేనే ప్రమాణం చేస్తానని పట్టుబట్టాను. తొలి కేబినెట్‌లోనే ముంపు మండలాలపై తీర్మానం చేసేలా పట్టుబట్టాం. ఆర్డినెన్స్ తెప్పించాం. చట్టం చేయించాం.ప్రతినిధి బృందాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం పెట్టించాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల దరిమిలా ప్రత్యేక హోదా ప్రతిపత్తి స్థానంలో ప్రత్యేక ఆర్థిక సాయం ఇస్తామన్నారు. జైట్లీతో దీనిపై ప్రకటన చేయించామని’ గుర్తుచేశారు.
ప్రతి బడ్జెట్ సమావేశంలో నిధుల గురించి అడుగుతూనే ఉన్నామని, నిధుల విడుదలలో జాప్యంతో విసిగిపోయి దండంపెట్టి ‘పోలవరం మీరే చేయండని కేంద్రాన్ని అడిగాం’అని చెప్పారు. ఇప్పుడు ఆఖరి బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి బొత్తిగా న్యాయం జరగలేదన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని నిగ్గుదీసింది తెలుగుదేశం పార్టీ ఎంపీలేనని స్పష్టం చేశారు. ఆ విషయం ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ ఎంపీలు పార్లమెంటులో నిలదీశారని, 5రోజులు గాంధీ విగ్రహం
వద్ద ధర్నాలు, లోక్‌సభ, రాజ్యసభలో ఆందోళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎంపీల ఆందోళనకు సంఘీభావంగా రాష్ట్రంలో ప్రజలు బంద్ పాటించారని వివరించారు. ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో అది చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కళావెంక్రట్రావు, మంత్రులు యనమల, సోమిరెడ్డి, అచ్చెన్న, నారాయణ, లోకేష్, ఆదినారాయణరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు వర్లరామయ్య, జయనాగేశ్వరరెడ్డి, ఆనం, సుబ్బారాయుడు, ఎమ్మెల్సీలు టిడి జనార్దన్, చౌదరి పాల్గొనగా, ఉప ముఖ్యమంత్రులు కెఈ, రాజప్ప వీడియోకాన్ఫరెన్సులో హాజరయ్యారు.

చిత్రం..టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు