రాష్ట్రీయం

కలసి పోరాడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 15: ప్రత్యేక హోదా కోసం తాము చేసే పోరాటంతో టీడీపీ కూడా కలిసి రావాలని, ప్యాకేజీ మాటలు కట్టిపెట్టాలని వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష్య సాధన కోసం తమ ఎంపీలు ఎలాగూ రాజీనామా చేయనున్నారని, టీడీపీ ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జగన్ సూచించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వై ఎస్ జగన్ గురువారం మధ్యాహ్నం ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం రేణిమాలలో ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రానికి చెందిన మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం కచ్చితంగా దిగి వస్తుందని, ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుందని, ప్రత్యేక హోదావల్లనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. రాష్ట్భ్రావృద్ధి విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమతో కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మహిళ లక్షాధికారి కావాలని నాడు దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పించారని, తాము అధికారంలోకి రాగానే ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైకాపా అధికారంలోకి వస్తే మహిళలకు అన్నింటా తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పిస్తామని, గ్రామ సచివాలయాల్లో వారికి 50 శాతం అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. పెందుర్తి, కుప్పంలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించిన జగన్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకొని కొట్టాడని, అయినా ముఖ్యమంత్రి స్పందించలేదని
ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఆ ఎమ్మెల్యేను ఎన్‌కౌంటర్ చేసి ఉంటే రాష్ట్రంలో అటువంటి సంఘటనలు పునరావృతం అయ్యేవి కావని, కనీసం ఆ ఎమ్మెల్యేను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టి ఉండినా మిగతా వారు భయపడేవారని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలవల్ల మహిళలకు రక్షణ కరవైందని, తాము అధికారంలోకి రాగానే వీటిని నియంత్రిస్తామని అన్నారు. పొదుపు సంఘాల మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న బాబు ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఎన్నికల నాటికి పొదుపుసంఘాల మహిళల రుణ మొత్తాన్ని నేరుగా వారికి నాలుగు విడతల్లో అందిస్తామని హామీనిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థుల ఫీజులు ఎంతయినా ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఎంతటి ఉన్నత చదువులకైనా ప్రభుత్వ సహాయం పూర్తిగా ఉంటుందని భరోసానిచ్చారు. నిరుపేద కుటుంబాల పిల్లలకు చదువుకోసం ఏటా రూ.15 వేలు అందిస్తామని, పేదలకు నివాస గృహాలు, మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని, భవిష్యత్తులో తమ అవసరాలకు వారు ఇంటిపై రుణం పొందే వీలు కల్పిస్తామని, తీసుకున్న రుణానికి పావలా వడ్డీ తీసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హులైన వృద్ధులకు 45 ఏళ్లకే రూ.2వేల వంతున పింఛను అందిస్తామని, మిగతా వర్గాలకు 65 ఏళ్లుగా ఉన్న పింఛన్ అర్హత వయస్సును 60 ఏళ్లకు తగ్గిస్తామని అన్నారు.
ఈ మహిళా సదస్సుకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చిత్రం..నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణివరం గ్రామంలో మహిళా సదస్సులో ప్రసంగిస్తున్న జగన్