రాష్ట్రీయం

‘సమాధాన్’తో మావోయిస్టుల అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోపూరు శ్రీనివాసరావు
గుంటూరు, ఫిబ్రవరి 15: నక్సల్స్ అణచివేతకు కేంద్రప్రభుత్వం రాష్ట్రాల సమన్వయంతో చేపట్టనున్న ‘సమాధాన్’ను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు మావోయిస్టు పార్టీ బహుముఖ వ్యూహంతో సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఎదురైన గుణపాఠాలపై ఆత్మపరిశీలన చేసుకోవటం ద్వారా ఉద్యమానికి పూర్వస్థితి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రజా ఉద్యమాలతో మమేకం కావటం.. క్యాడర్ రిక్రూట్‌మెంట్లు.. గతంలో జరిగిన తప్పిదాల దిద్దుబాటు.. గెరిల్లా యుద్ధతంత్రంతో ఉనికిని చాటుకోవాలని భావిస్తోంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన పీఎల్‌జీఎ 17వ వారోత్సవాల అనంతరం పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర కమిటీ దృష్టి సారించింది. క్యాడర్‌కు నిర్దేశించిన కీలక మార్గదర్శకాలు ఆంధ్రభూమికి అందాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలు చత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో మావోయిస్టుల అణచివేతకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దేశం మొత్తంగా పది రాష్ట్రాల్లో 106 జిల్లాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా కేంద్రం గుర్తించింది. వీటిలో 7 రాష్ట్రాల్లో 35 జిల్లాలు అధికంగా, మరో 24 జిల్లాలు అత్యధిక సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణిస్తోంది. ఇందుకోసం 119 బెటాలియన్ల పారామిలిటరీ, 37 బెటాలియన్ల ఇండియన్ రిజర్వు, మరో 156 ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు బలగాలను రంగంలో దించింది. కార్డన్, సెర్చ్ అండ్ కిల్ ఆపరేషన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 400 ఫోర్టిఫైడ్ పోలీసుస్టేషన్ల నిర్మాణంతో పాటు 2199 మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దండకారణ్యం, ఏఓబీ, చత్తీస్‌గఢ్, బస్తర్ తదితర ప్రాంతాలు కీలకమైనవిగా కేంద్రం భావిస్తోంది. సమాధాన్‌లో ఎస్ అంటే స్మార్ట్ లీడర్ షిప్ (చురుకైన నాయకత్వం), ఎ- అగ్రెసివ్ స్ట్రాటజీ (దూకుడు వ్యూహం), ఎం- మోటివేషన్ అండ్ ట్రైనింగ్ ( ప్రేరణ, శిక్షణ), ఎ-యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ (కార్యాచరణకు ఉపయోగపడే నిఘా వ్యవస్థ), డి-డాష్‌బోర్డు బెస్ట్ ఇండికేటర్స్ (చేతికి అందుబాటులో ఉండే సూచికలు), హెచ్-హార్నెసింగ్ టెక్నాలజీ (సాంకేతిక వ్యవస్థ), ఎ-యాక్షన్ ప్లాన్ ఫర్ ఈచ్ త్రెట్ (ప్రతి సవాల్‌కు కార్యాచరణ) ఎన్ అంటే నో యాక్సెస్ టు ఫైనాన్సింగ్ ( ఆదాయ వనరులను అడ్డగించడం) వంటి చర్యల ద్వారా మావోయిస్టులను పూర్తి స్థాయిలో అణచివేయాలని నిర్ణయించింది. పారామిలిటరీ, వాయుసేన బలగాలకు ఇజ్రాయిల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిసింది. నిరంతరం పనిచేసే ఎయిర్‌లైన్స్‌తో పాటు డ్రోన్లు, రాడార్లు తదితర నిఘా వ్యవస్థలతో గెరిల్లాజోన్ల కదలికలు గుర్తించి మట్టుపెట్టే దిశగా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీనిపై మావోయిస్టు పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన తప్పిదాల కారణంగా పార్టీలో క్రియాశీల నేతలను కోల్పోయామనే ఆత్మపరిశీలన మొదలెట్టింది. రాజకీయ పరిస్థితుల్లో అనుకూల, ప్రతికూల అంశాలను గమనంలోకి ఉంచుకుని గడ్డుస్థితిని అధిగమించి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కమిటీలకు మార్గదర్శకాలు జారీచేసింది. కొత్తగా విస్తరించిన ‘ఎర్ర ప్రతిఘటన ప్రాంతాల’ను గెరిల్లా జోన్లుగా ప్రకటించింది. క్యాడర్ల సైద్ధాంతిక, రాజకీయ స్థాయిని పెంచి అన్ని స్థాయిల్లో నాయకత్వ తర్ఫీదుతో పాటు క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రపంచీకరణ ప్రభావాలపై అసంతృప్తితో ఉన్న రైతాంగాన్ని కూడగట్టి సామ్రాజ్యవాద, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలని ఉద్ధృతం చేసేదిశగా కార్యాచరణ రూపొందించింది. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు పెరిగారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా వలస కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని మనం అందిపుచ్చుకుని ఉద్యమించాల’ని సూచించింది. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్య కార్పొరేటీకరణ జరుగుతోంది.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులను కూడగట్టాలి.. పెద్దనోట్ల రద్దు..జీఎస్టీతో వీధినపడిన చిరువ్యాపారులను గుర్తించి ఉద్యమపంథాపై అవగాహన కల్పించడం.. దళిత, ఆదివాసీ, మైనారిటీలపై దాడులను సానుకూలంగా మలచుకోవటం ద్వారా ప్రజా బాహుళ్యంతో మమేకం కావాలని కేంద్ర కమిటీ ఆదేశించింది. పట్టణ, నగర ప్రాంతాల్లో నూతన పంథాను అనుసరించాలని నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల్లో సామాజిక పరిశోధన పూర్తిచేసి వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడుల ప్రభావాన్ని ఆధ్యయనం చేయడం.. నిత్యం క్యాడర్లు ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుని వర్గపోరాటదిశగా జాగృతం చేయాలని ఆదేశించింది. ‘ఇప్పటి వరకు వాస్తవ ప్రపంచాన్ని గుర్తించలేకపోవటంతో పాటు దాని మూలసూత్రాలకు అనుగుణంగా గతితార్కిక భౌతిక వాదానికి దూరంగా ఆచేతనంగా పరిస్థితుల వెంట కొట్టుకుపోతున్నాం’.. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని క్యాడర్‌కు సందేశమిచ్చింది. ‘దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో ఆటుపోట్ల అంతస్సారాన్ని గతిశీలతను అర్థం చేసుకోక పోవటం.. నాయకత్వం, క్యాడర్లలో పెరిగిన అన్యవర్గ ధోరణలు..ప్రజాజీవిత సంఘర్షణను గుర్తించి ఉద్యమానికి చేయూత నందించటంలో వెనుకబాటుతనం’ కారణంగా అనేక నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని భావించింది. ఉద్యమం పరిమితులు.. బలహీనతలు..లోపాలతో సాగుతోంది.. ఈ పరిస్థితుల్లో నాయకత్వశక్తుల త్యాగ సంసిద్ధతను పెంచితేనే ఉనికి సాధ్యమని తేల్చిచెప్పింది. కొత్త క్యాడర్‌ను రిక్రూట్ చేసుకోవటం వారికి సైద్ధాంతిక, రాజకీయ శిక్షణ ఇవ్వటంతో పాటు ఆయుధ సంపత్తిని పెంచుకునే దిశగా దాడులు జరిపేందుకు సమాయత్తం కావాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. పోలీసు క్యాంపులపై దృష్టిసారిస్తూ మన క్యాంపుల చుట్టూ క్రియాశీల ఆత్మరక్షణ పద్దతులు అనుసరించాలని నిర్దేశించింది. ఎత్తుగడల సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంచుకోవటం స్థానిక నాయకత్వాన్ని కాపాడుకుంటూ యూనిట్ల నిర్మాణం చేపట్టి మాస్ కమిటీల ఎంపిక నిర్వహించాలని పిలుపునిచ్చింది.