రాష్ట్రీయం

త్వరలో సాగర్‌కు గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/ నరసరావుపేట, ఫిబ్రవరి 17: త్వరలో నాగార్జునసాగర్ కుడికాలువకు గోదావరి జలాలను తీసుకువచ్చి ఆయకట్టును పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా సాగర్ కుడికాల్వకు నీటిని తరలించి సాగుకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూస్తామన్నారు. భవిష్యత్తులో ఏపీని నాలెడ్జి, ఎడ్యుకేషన్ హబ్‌గా మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకాని వద్ద రూ 150 కోట్లతో నిర్మించనున్న జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ- కాకినాడ (జెఎన్‌టియుకే) నరసరావుపేట క్యాంపస్‌కు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. కోటప్పకొండ వద్ద రూ 7 కోట్లతో ఏర్పాటు కానున్న రోప్‌వే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తరగతి గదులలో చదువుకున్న విద్య క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ఆ విద్యకు సార్థకత ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా విద్యాలయాలు ముందుకు వెళ్లాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేసిన విద్యా సంస్కరణల వల్ల దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటయ్యాయన్నారు. విద్యార్థి ఏ కోర్సు అభ్యసించినా
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీని అనుసంధానం చేసినట్లయితే ఆ విద్యార్థి ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్చ్యువల్ తరగతి గదులను ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాలు కలిగిన విశ్వ విద్యాలయాలను రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దేశంలో వనరులు, అవకాశాలకు కొదవలేదన్నారు. వనరులను, అవకాశాలను సద్వినియోగం చేసుకుని అందరూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోటప్పకొండ క్షేత్రాన్ని రానున్న కాలంలో ఓ ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా పర్యాటకశాఖ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం కొండ దిగువ నుండి ఎగువకు వెళ్లేందుకు రోప్‌వేకు శంకుస్థాపన చేశారు. రూ 16వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ హేతుబద్ధతలేకుండా రాష్ట్రాన్ని విభజించినా దేశంలోకెల్లా రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్‌కు నీటిని తీసుకువచ్చి కుడి కాల్వ ద్వారా ఈ ప్రాంతానికి నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ ఏడాదికి నీరందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్థిక చేయూత నందించాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా సంస్కరణల వల్ల నేడు ఈ ప్రాంతంలో 20 నుంచి 25వేల మంది యువత ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. కోటప్పకొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం అన్నివిధాల చేయూత నందిస్తున్నారని చెప్పారు. రూ 7 కోట్లతో నిర్మించనున్న రోప్‌వే త్వరితగతిన పూర్తికాగలదన్నారు. జలసంరక్షణ కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా రూ 3.5 కోట్లతో అచ్చమ్మపాలెం వద్ద నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య సమాజానికి పునాదిలాంటిదనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగానికి రూ 20వేల 290 కోట్లు కేటాయించామన్నారు. ఎక్కడ విద్యావ్యవస్థ పటిష్ఠంగా ఉంటుందో అక్కడ సమాజం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకోవాలని మంత్రి సూచించారు. తొలుత సీఎం చేతుల మీదుగా రూ 250 కోట్ల విలువగల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్‌బాబు, పైడికొండల మాణిక్యాలరావు, జడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఆహార కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్, దివ్యాంగుల సంక్షేమశాఖ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, జెసి ఎం వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జెఎన్‌టీయు వైస్‌చాన్సలర్ రాజకుమార్, నర్సరావుపేట క్యాంపస్ రిజిస్ట్రార్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..కోటప్పకొండ రోప్‌వే నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు