రాష్ట్రీయం

కొలిక్కి రానున్న వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన మరో మూడు నెలల్లో నాలుగేళ్లు కావస్తున్నా, 9, 10 షెడ్యూళ్లలో వివిధ సంస్థల ఆస్తులు, అప్పుల విభజనపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. బడ్జెట్ తర్వాత రెండు రాష్ట్రాల్లో నెలకొన్న అసంతృప్తిని పరిగణనలోకి తీసుకుని ఆస్తులు, అప్పుల విభజన సమస్యను ఒక కొలిక్కి తీసుకుని వచ్చేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తును ప్రారంభించినట్లు సమాచారం. ఈ నెల 21వ తేదీన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు సంబంధిత శాఖల కార్యదర్శులు, అధికారులు ఢిల్లీకి రావాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు సంబంధించి రెండు రాష్ట్రాల అధికారులు అనేకసార్లు ఇక్కడ చర్చించినా, గవర్నర్ సమక్షంలో మాట్లాడుకున్నా ఉపయోగంలేకుండా పోయిన విషయం విదితమే. ఇంకా విభజన చట్టంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీల అమలుపై కూడా చర్చలు జరగనున్నాయి.
ఖమ్మం జిల్లాలో స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణం, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ రామగుండం, ఆంధ్రాలో రైల్వే జోన్, కడపలో స్టీలు ఫ్యాకిటరీ, దుగరాజపట్నం రేవును మరో ప్రదేశంలో ఏర్పాటు చేయడం తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న 9, 10 షెడ్యూల్‌లలోని సంస్థల భవనాలు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్నందువల్ల వీటిని తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచి కోరుతోంది. ఆస్తుల విభజన జనాభా నిష్పత్తికు లోబడి ఉండాలని, దీనికి లోబడి తమకు ప్రతి భవనంలో, ఆస్తిలో 58 శాతం వాటా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ కూడా ఇంకా విభజన కాలేదు. విజయవాడలో ఆర్టీసీ విభజనపై రెండు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారుల మధ్య చర్చ జరిగినా ఇంతవరకు కొలిక్కిరాలేదు. బస్ భవన్, మియాపూర్‌లో బస్ బాడీ బిల్డింగ్, తార్నాక ఆసుపత్రిలో తమకు వాటా ఉందని ఏపీ వాదిస్తోంది. ఆర్టీసీకి సంబంధించి మొత్తం 14 ఆస్తులు ఉన్నాయి. గతంలో జరిగిన చర్చల్లో హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసి ఆస్తుల్లో ఏపీకి వాటా ఇవ్వబోమని తెలంగాణ స్పష్టం చేసింది. 9వ షెడ్యూల్‌లో హైదరాబాద్‌లో 17 సంస్థల కార్యాలయాలున్నాయి. ఇందులో విద్యుత్ సౌధ కూడా ఉంది. భవనాలు, ఖాళీ స్థలాలు, వాటాలు, శిక్షణ సంస్థల్లో తమకు వాటా ఉందని ఏపీ చేస్తున్న వాదనలను తెలంగాణ అధికారులు పలుసార్లు జరిగిన చర్చల్లో తోసిపుచ్చారు. ఏపీ ఉన్నత విద్యామండలి విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఆదర్శంగా తీసుకుంటే హైదరాబాద్‌లో ఉన్న వివిధ సంస్ధల భవనాల్లో, డిపాజిట్లలో తమకు జనాభా నిష్పత్తి ప్రకారం వాటా ఉంటుందని ఏపీ అధికారులంటున్నారు. ఈ సమావేశంలో తమ వాదనలు వినిపించేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాధికారులు బలమైన ఆధారాలతో సమాయత్తమవుతున్నారు.