రాష్ట్రీయం

సమైక్య పోరుకు సై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 19: విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలన్నీ సాధించడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని, దానికి రానున్న రోజుల్లో మరికొన్ని పోరాట రూపాలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆందోళనలు, ఉద్యమాల్లో భాగస్వాములైన సంఘాలు, సంస్థల ప్రతినిధులతో త్వరలోనే సమావేశం నిర్వహించి, వారి ఆలోచనలు కూడా తెలుసుకుని, వాటి ఆధారంగా భవిష్యత్ పోరాటం నడుస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం చింతలగూడెంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోగొండ జలాశయాన్ని ప్రారంభించారు. ఆనంతరం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనుల ప్రగతిని పరిశీలించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విభజన హామీల అమలు, ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై విలేఖర్లతో మాట్లాడారు. కేంద్రంలో అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా అడ్డగోలుగా విభజనచేసి, తన రాజకీయ ప్రయోజనాలను చూసుకుందని, ఫలితంగా ప్రజలు ఆపార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం తెల్సిందేనన్నారు. ఇక బీజేపీ జాతీయ పార్టీగా ఉందని, ఇప్పుడు ఆ చెయ్యి కూడా వదిలేస్తే పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లవుతుందని వ్యాఖ్యానించారు. అప్పట్లో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి కేంద్ర పార్టీకి జరిగే నష్టాలను వివరించలేక ప్రజలను సంక్షోభంలోకి నెట్టివేసి విభజనకు అంగీకరించిందన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం రాష్ట్రప్రజల మనోభావాలను అన్నివిధాలా ప్రతిబింబింపజేసి, దానికి తగ్గట్టుగా పోరాటం చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు కొంతమంది కొంతమంది నిజాయితీగా ప్రయత్నిస్తున్నా మిగిలినవారు మాత్రం సొంత ఎజెండాలతో కార్యక్రమాలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వీళ్లు సహకరించడం మాటెలావున్నా రాష్ట్రానికి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
నియోజకవర్గాల పునర్విభజన గురించి, కేంద్రాన్ని తాను అడగలేదని, ఈ అంశం విభజన చట్టంలోనే ఉందని, ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం అనేది కేంద్రంపైనే ఆధారపడి ఉందన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో మన ఎంపీలు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ నుండి ఒక్కరైనా ఏపీకి అన్యాయం జరిగిందని మాట్లాడారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్లకార్డు పట్టుకుని రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఆ ఆందోళనతో తమ పార్టీకి సంబంధం లేదని సభలో ప్రకటించారని గుర్తుచేశారు. ఆ పార్టీ ధోరణి, వ్యవహారశైలి మార్చుకోకపోతే ఎంతకాలమైనా ప్రజల ఆగ్రహానికే గురవుతుందన్నారు. ఇక ప్రతిపక్షనేత జగన్‌కు మెచ్యూరిటీ లేకుండా పోయిందని, బీజేపీని అడగాల్సిన ప్రశ్నలు తనను అడిగితే ఎలా అని నిలదీశారు. ఇక అవిశ్వాసం పెట్టేద్దామని చెపుతున్నారని, అసలు చర్చే లేకుండా అవిశ్వాసం ఎలా పెడతారని ప్రశ్నించారు. వాళ్లకి మెజార్టీ ఉంది, అవిశ్వాసం వీగిపోతుంది, రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తే ఇక రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే అవకాశం ఎక్కడుంటుందని
ప్రశ్నించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి తెలుగువారి బలాన్ని తగ్గించేసిందని, అలాంటప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఇక మన మాట వినేది ఎవరని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు వదులుకుని టీడీపీ బయటకొచ్చేస్తే తాము దూరిపోదామనే తప్ప వైసీపీకి మరో ఆలోచన లేకుండా పోయిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి శక్తివంచన లేకుండా పోరాడుతున్నామని, ఈ సమయంలో ఇటీవల ఆందోళనలు చేసిన సంఘాలు, సంస్థలతో మాట్లాడతామని, వారి ఆలోచనలు కూడా తెలుసుకుని, పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.