రాష్ట్రీయం

కరవు ఊసే ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించి కరవురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉభయగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 40 లక్షల ఎకరాలకు సాగునీరు, 548 గ్రామాలకు తాగునీరు అందించనున్నట్లు చెప్పారు. పోలవరం పనులు ఇప్పుడు మరింత వేగవంతం చేశామని, 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరందిస్తామన్నారు. గత సీజన్‌లో కొన్ని ఇబ్బందుల కారణంగా జాప్యం జరగడంవల్ల 2018కి బదులు 2019 నాటికి పోలవరం నుంచి నీరందిస్తామన్నారు. డిసెంబర్ నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన జరిపిన సీఎం చంద్రబాబు తొలుత బుట్టాయిగూడెం మండలం చింతలగూడెంలో రూ.129 కోట్లతో నిర్మించిన పోగొండ జలాశయాన్ని ప్రారంభించారు. అనంతరం పోలవరం చేరుకుని ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని స్పిల్‌వే, స్పిల్‌ఛానల్, డయాఫ్రం వాల్ తదితర పనులను పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజన రైతుల సంక్షేమం కోసం నిర్మించిన పోగొండ జలాశయంతో పశ్చిమగోదావరి జిల్లా మొత్తం ముంపురహితంగా మారనుందన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిదని, అందువల్లే ప్రాజెక్టుపై పూర్తి శ్రద్ధ చూపుతున్నామన్నారు. ప్రాజెక్టు వ్యయం విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని, అంతా పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లాలని కాంట్రాక్టు ఏజన్సీలు, అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఇంతవరకు ప్రాజెక్టుకు సంబంధించి చేసిన మొత్తం ఖర్చును ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపర్చామని, దీనిని ఎవరైనా పరిశీలించుకోవచ్చునన్నారు. అంతేకాకుండా పనులను జియో ట్యాగింగ్ చేయటం, ఏరియల్ చిత్రాలు, డ్రోన్‌ల ద్వారా తీసిన ఫోటోలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు రూ.13,050 కోట్లు ఖర్చుచేశామన్నారు. ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తూ ప్రకటన చేసిన తర్వాత రూ.7,810 కోట్లు ఖర్చు చేశామని, వీటిలో రూ.4,932 కోట్లు కేంద్రం ఇచ్చిందని, మిగిలిన మూడువేల కోట్లు రావాల్సి ఉందన్నారు. జాతీయహోదా రాకముందు రూ.5,138 కోట్లు ఖర్చుచేయగా దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించారన్నారు. కొత్త డీపీఆర్‌ను కూడా కేంద్రం ఆమోదిస్తే మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.53 వేల కోట్లుగా మారుతుందన్నారు. ప్రాజెక్టు పనులను ఫాస్ట్‌ట్రాక్‌లో పెట్టామని, ఇక నిర్మాణపనులు అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్తాయన్నారు. ఇంకా 1.10లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తికావాల్సి ఉందని, ఈ నెలలో 2700 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఈసీజన్‌లో మొత్తం 40వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేస్తామన్నారు. విభజన అనంతరం ప్రభుత్వాలు ఏర్పడే తొలిదశలోనే తాను ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను రాష్ట్రానికి కలపకుంటే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనని కేంద్రానికి స్పష్టం చేయటంవల్లే అప్పట్లో ఈకార్యక్రమం ముందుకెళ్లిందన్నారు. అలా జరగకపోయి ఉంటే తాను ప్రమాణస్వీకారం చేసేవాడిని కాదని చంద్రబాబు పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తికాకూడదని, ప్రజలు ఇబ్బందుల్లోనే ఉండాలని ఫలితంగా తనకు చెడ్డపేరు వస్తే దాన్ని రాజకీయంగా వాడుకోవచ్చునన్న ఉద్దేశ్యంతో కొంతమంది రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే వాటిని ఆశీస్సులుగానే తీసుకుని ముందుకెళ్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 28 సాగునీటి ప్రాజెక్టులను జూన్‌కల్లా పూర్తిచేస్తామన్నారు.
కాగా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం చింతలగూడెం వద్ద రూ.129 కోట్ల రూపాయలతో నిర్మించిన పోగొండ జలాశయం వల్ల ఏజన్సీలోని గిరిజన రైతులకు ఎన్నో ప్రయోజనాలు సాధ్యమవుతాయన్నారు. దీనివల్ల ఏటా కనీసం పదికోట్ల రూపాయల ఆర్ధికప్రయోజనాలు వారికి అందుతాయన్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ముంపుబారిన పడుతున్న ప్రాంతాలు కూడా దాన్నినుంచి రక్షణ పొందుతాయన్నారు. దీనివల్ల పదివేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో యంత్రాన్ని నడుపుతున్న సీఎం చంద్రబాబు